భవన నిర్మాణ కార్మికుల వెతలను జిల్లా కేంద్రాల్లో ఎలుగెత్తాలి

భవన నిర్మాణ కార్మికుల వెతలను జిల్లా కేంద్రాల్లో ఎలుగెత్తాలి
* 30 న కార్మికుల చేతుల మీదుగా పోస్టర్లు విడుదల
* ఛలో విశాఖపట్నం కార్యక్రమ సన్నాహక సమావేశంలో నిర్ణయం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి పడుతున్న బాధలను తెలియచేసేందుకు నవంబర్ 3 వ తేదీన చేపడుతున్న లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరిస్తారు. 30 వ తేదీన భవన నిర్మాణ కార్మికుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించాలని నాయకులకు, శ్రేణులకు సూచించారు. ఛలో విశాఖపట్నం కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సోమవారం ఉదయం హైదరాబాద్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్ గారు ఈ సమావేశానికి నేతృత్వం వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో నెలకొన్న ఇసుక సంక్షోభం మూలంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం, ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని ప్రతి జిల్లా కేంద్రం లో ఎలుగెత్తి చాటాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఈ నెల 31 వ తేదీన జనసేన నేతలు జిల్లా కలెక్టర్ కు ఈ సమస్యపై వినతి పత్రం అందించేందుకు, పార్టీ శ్రేణులు, కార్మికులతో కలసి జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇసుక అందుబాటులో ఉంచకపోవడంతో కార్మికులు, గృహ నిర్మాణదారులు ఎంతటి ఇబ్బందులుపడుతున్నారో అందరికీ తెలియచేసేలా ఈ కార్యక్రమం ఉంటుంది.

* నకిలీ ఖాతాలను నమ్మొద్దు 
ఛలో విశాఖపట్నం కార్యక్రమం నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించారని, వాటి ద్వారా విరాళాలు సేకరిస్తున్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది. ఇలాంటి ఖాతాలను ఎవరూ నమ్మవద్దు అని శ్రేణులకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన మద్దతుదారులకు పార్టీ సూచించింది.
Pawan Kalyan
Jana Sena

More Press News