రూప లావ‌ణ్యాల‌ను తీర్చిదిద్దే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ

Related image

  • శారీర‌క లోపాల‌కూ ఇదే స‌రైన చికిత్స‌
  • కిమ్స్ ఆస్ప‌త్రిలో ఘ‌నంగా ప్రపంచ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ డే
హైదరాబాద్‌, జూలై 15, 2022: శ‌రీర భాగాల్లో ఎక్క‌డ ఎలాంటి లోపం ఉన్నా స‌రిచేసి, మ‌ళ్లీ య‌థాస్థానానికి లేదా అంత‌కంటే మ‌రింత అందంగా త‌యారుచేసే ప్ర‌క్రియే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ. ఇది మ‌న దేశంలో క్రీస్తుశ‌కం ఏడో శ‌తాబ్దం నుంచే ఉంది. భార‌త‌దేశంలోనే కాక‌.. యావ‌త్ ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి శ‌స్త్రచికిత్స నిపుణుడు, శుశ్రుత సంహిత పుస్త‌కం రాసిన శుశ్రుతుడే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ పితామ‌హుడు. 1774లో జెంటిల్మ‌న్స్ మ్యాగ‌జైన్ అనే ప‌త్రిక‌లో లూక‌స్ అనే బ్రిటిష్ స‌ర్జ‌న్ రాసిన లేఖ‌తో వైద్యం, శ‌స్త్రచికిత్స రంగాల్లో ప్రాచీన భార‌త‌దేశ ప్రాధాన్యం తెలిసింది. నుదురు, ముక్కు లాంటివాటిని పున‌ర్నిర్మించే ప్ర‌క్రియ భార‌త‌దేశంలో ఓ ఇటుక‌లు త‌యారుచేసే వ్య‌క్తి చెప్పార‌ని అందులో రాశారు. అది చ‌దివిన త‌ర్వాత‌, యుద్ధంలో గాయ‌ప‌డిన ఓ సైనికుడికి జోసెఫ్ కార్ప్ అనే లండ‌న్ స‌ర్జ‌న్ అదే ప్ర‌క్రియ చేశారు.

ఇటీవ‌లి కాలంలో కొన్ని సంచలనాత్మక వార్తల వ‌ల్ల ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలామంది చెడుగా చెప్పుకొంటున్నారు. కానీ, ప్లాస్టిక్ సర్జన్ల ప్రత్యేకత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆధునిక ప్లాస్టిక్ శస్త్రచికిత్స పరిధి కాస్మెసిస్ కు మాత్రమే పరిమితం కాదు. ఇందులో పునర్నిర్మాణం అనే విస్తృత ప్ర‌క్రియ కూడా ఉంది. గాయప‌డిన‌, తెగిన‌ అవయవాలను తిరిగి అమర్చడం, చేతి గాయాలు, ఎముక‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి గాయ‌ప‌డ‌టం, నరాల గాయాలు, భుజాల న‌రాల‌కు అయ్యే గాయాలు, సంక్లిష్టమైన ముఖ గాయాలు, క్యాన్సర్ వ‌ల్ల తొల‌గించిన రొమ్ము పునర్నిర్మాణం, తల, మెడ క్యాన్సర్లలో దవడ, మృదు కణజాలాల పునర్నిర్మాణం, చేతి మార్పిడి, గ్ర‌హ‌ణం మొర్రి లాంటి జనన లోపాలను సరిదిద్దడం... ఇలా ఎన్నో ప్ర‌క్రియ‌ల్లో ప్లాస్టిక్ స‌ర్జ‌రీ జోక్యం అవసరం.  చేతులు, చెవులు, పుర్రె లాంటివి స‌రిగా లేక‌పోడం, కాలిన గాయాలు, కాలిన త‌ర్వాత వ‌చ్చే శారీర‌క లోపాల‌ను స‌వ‌రించ‌డానికీ ప్లాస్టిక్ స‌ర్జ‌న్ ఉండాల్సిందే.

ఇంత విస్తార‌మైన ప‌నులు చేయాల్సిన ఈ స్పెషాలిటీలో నైపుణ్యాలు కూడా అంత ఎక్కువ‌గానే అవ‌స‌రం. సాధారణ ప్రజానీకంతో పాటు.. వైద్యుల‌లో కూడా ఈ స్పెషాలిటీ గురించి, అందుబాటులో ఉన్న చికిత్స ప‌ద్ధ‌తుల గురించి అంత‌గా అవగాహన లేదు. రోగులు ఆల‌స్యంగా వ‌స్తే శ‌స్త్రచికిత్స ఫ‌లితం స‌రిగా ఉండ‌దు. ఇది చాలా బాధాక‌రం. ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా అవ‌య‌వం తెగిపోతే.. ఆ భాగంతో స‌కాలంలో రోగి ఆస్ప‌త్రికి చేరుకోవాలి. అంటే.. ఆ భాగాన్ని గాజుగుడ్డ లేదా శుభ్రమైన వ‌స్త్రంలో చుట్టి, వాటర్ ప్రూఫ్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచాలి. దీనిని ఐస్ తో కూడిన కంటైనర్ లో ఉంచాలి (నేరుగా ఐస్ లో ఉంచరాదు). మైక్రోషియా (చెవి లేకపోవడం లేదా ఆకారం స‌రిగా లేక‌పోవ‌డం) స‌మ‌స్య ఉన్న పిల్లవాడికి 14 సంవత్సరాల వ‌య‌సులోపే పునర్నిర్మాణం చేయాలి. ఆలోపు అయితేనే పక్కటెముక మృదులాస్థి గట్టిపడదు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళలు ముందస్తుగా గుర్తిస్తే, మాస్టెక్టమీ సమయంలోనే ప్రాథమిక రొమ్ము పునర్నిర్మాణాన్ని చేయించుకోవచ్చు. అందువల్ల మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. మరీముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంటే ఈ ప‌రీక్ష‌లు త‌ర‌చు చేయించుకోవాలి.

ఆధునిక ప్రపంచంలో అందంగా కనిపించడం జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. అందంగా కనిపించడం, భావించ‌డం మ‌న ఆత్మగౌరవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అందుకే ప్లాస్టిక్ సర్జన్ల‌ను కత్తితో కూడిన సైకియాట్రిస్ట్ అని చెబుతారు. చాలా మంది ఈ కత్తితో రూపు మార్చుకుని, ప్రయోజనం పొందారు.

ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డేను శుక్ర‌వారం జూలై 15న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రిలో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ బి.భాస్కర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించారు. ఈ ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్క‌డ చేసిన శస్త్రచికిత్సల సంఖ్య పది వేలు దాటిన‌ట్లు ప్ర‌క‌టించారు. ప్లాస్టిక్ సర్జన్లు డాక్టర్ ఎన్.హేమంత్ కుమార్, డాక్టర్ శ్రుతి.కె, డా.వినయ్. ఆర్ తాము ఇన్నాళ్లుగా చేసిన కృషిని వైద్యుల‌కు, సామాన్య ప్ర‌జ‌ల‌కు ప్రదర్శించారు.

More Press Releases