కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన చాలా బాధాకరం: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన చాలా బాధాకరం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కాలా బురగీ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ లోని బొల్లారం కు చెందిన అర్జున్ కుమార్, అతని భార్య సరళ, కుమారుడు వివన్, K.అనిత,గోదేఖీ ఖబర్ కు చెందిన శివకుమార్, అతని భార్య రవళి, కుమారుడు దీక్షిత్ లు మరణించారు. మరో 7గురు గాయపడగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో కంటోన్మెంట్ MLA సాయన్న, కలెక్టర్ శర్మన్ లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరిగిన రోజే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా మానవతా దృక్పధంతో ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మేరకు ప్రభుత్వం 24.50 లక్షల రూపాయలు మంజూరు చేయగా, ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO లు వసంత కుమారి, వెంకటేశ్వర్లు, తహసిల్దార్ లు హసీనా, ప్రసాదరావు, నవీన్, కంటోన్మెంట్ మాజీ బోర్డ్ సభ్యులు లోకనాధం తదితరులు పాల్గొన్నారు.

More Press Releases