బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: జులై 17 వ తేదీన జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాటా నుండి రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం, ఆలయ పరిసరాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఉత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భక్తుల తోపులాట లేకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేయాలని ఆర్&బీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అమ్మవారికి బోనాలు తీసుకొచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

భక్తులకు వాటర్ పాకెట్స్, బాటిల్స్ అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్, ఆర్&బీ ఈఈ రవీంద్ర సాగర్, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ గంగారెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణా రెడ్డి, సీఐ కావేటి శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, మాజీ కార్పొరేటర్  అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆలయ ట్రస్టీ కామేష్, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases