బోనాల ఉత్సవాలు.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక

Related image

విజయ గాథలు.: 3

హైదరాబాద్, జూన్ 22:  బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలకు, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.

ఏ దేశ మేగిన....ఎందుకాలిడిన... పొగడరా నీ తల్లి భూమి భారతిని...
అని అన్నాడు ఆనాడు ఒక మహా కవి...రాయప్రోలు సుబ్బారావు...

ఆ మహా కవి స్పూర్తితో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ ప్రాంతానికి  ప్రతీకగా నిలిచిన బోనా ఉత్సవాలను, ప్రతిష్టాత్మకంగా భావించి, నభూతో.. నభవిష్యతి.. అన్నట్లుగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఆరంభం అయ్యాయంటే విదేశీ, దేశీ యాత్రికులకు సందడే సందడి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల ఉత్సవాలు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ సందర్భంలోనే, ఈ నెల 30 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

ముఖ్యమంత్రి అదేశాల మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 30 వ తేదీన నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం గోల్కొండ కోట వద్ద స్థానిక MLA కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మన పండుగలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ నెల 30 వ తేదీన గోల్కొండ, జులై 17 న సికింద్రాబాద్, 24 న హైదరాబాద్ బోనాలు జరుగుతాయని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని అన్నారు. బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా మఫ్టీ పోలీసులు, షీ టీమ్ లను కూడా నియామిస్తున్నామని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకేట్స్, 55 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు.

అదేవిధంగా 4 అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని, 5 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని  నియమించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేకంగా RTC బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ అంటేనే పండుగలకు, పబ్బాలకు, బోనాల ఉత్సవాలు, వినాయక చతుర్థి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ సంబరాలు, దసరా సంబరాలు, దీపావళి నవరాత్రి వేడుకలు తెలుగు ప్రజలకు గుర్తుకువస్తాయి.

గతంలో ఈ ఉత్సవాలు నామమాత్రంగానే జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, మన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో, తెలంగాణ కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ ఆత్మ గౌరవం ప్రపంచానికి తెలియాలని ఒక సత్ సంకల్పంతో, బోనాలు, ఇతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు.

More Press Releases