Minister Talasani inaugurated Free Coaching Centre organized by Hyd City Police – North Zone

Minister Talasani inaugurated Free Coaching Centre organized by Hyd City Police – North Zone
పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ప్రా రంభించారు. కోచింగ్ కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకిటించిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి, 16 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ అధికారులు కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింతగా శ్రమించి మీ కలను నిజం చేసుకోవాలని ఆకాక్షించారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపిక అయితే మీతో పాటు మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులకు కూడా గౌరవం లభిస్తుందని అన్నారు. గతంలో కొద్దో గొప్పో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగేదని, అందులో కూడా పలుకుబడి కలిగిన వారికే లభించేవని చెప్పారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ SI, కానిస్టేబుల్, ఎక్సైజ్ తదితర శాఖలలో 80 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కోచింగ్
సెంటర్ వద్ద విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అన్నపూర్ణ భోజన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. శిక్షణ కోసం వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడే పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పలు చెప్పి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తుందని విమర్శించారు. పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొనేందుకు వాహనాలను అందజేసిందని, పోలీసు స్టేషన్ భవనాలను ఎంతో ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ నార్త్ జోన్ DCP చందన దీప్తి ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  నార్త్ జోన్ DCP చందన దీప్తి, అడిషనల్ DCP వెంకటేశ్వర్లు, ACP లు నరేష్ రెడ్డి, రమేష్, సుధీర్, రవి శంకర్, శ్యామ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది శివ శంకర్ రెడ్డి, శేఖర్, పలువురు CI లు, SI లు పాల్గొన్నారు.

        

      

Talasani Srinivas

More Press News