అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

Related image

హైదరాబాద్: భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న, దళిత జనుల అభ్యున్నతికి కృషి చేసిన నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో కలసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి  శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. యువత ఉన్నత విద్య వైపు మొగ్గు చూపిస్తే, అభ్యున్నతి స్థాయికి చేరుకోవచ్చు అని మంత్రి అన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి అన్నారు.

దళితులు, గిరిజనులు కూడా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హుస్సేన్ సాగర్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి అని మంత్రి తెలిపారు. దళితులు ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. 

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులకు జిల్లాస్థాయిలో బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జీవిత చరిత్రపై  వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన వారికీ నగదు, ప్రశంసా పత్రములు మంత్రి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, హైదరాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామారావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.   

More Press Releases