అతి త్వరలో రైతు భరోసా కేంద్రాలను సందర్శిస్తా: ఏపీ గవర్నర్

అతి త్వరలో రైతు భరోసా కేంద్రాలను సందర్శిస్తా: ఏపీ గవర్నర్
  • రైతు భరోసా కేంద్రాల సేవలు అనుసరణీయం
  • రాష్ట్రంలోని రసాయన రహిత సాగును గుర్తుచేసుకున్న గవర్నర్
అమరావతి: రైతు భరోసా కేంద్రాల సేవలు అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏక గవాక్ష విధానంలో రైతులకు అవసరమైన అన్ని సేవలను వారి చెంతనే అందించగలగటం సాధారణ విషయం కాదని అభినందించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, విధి విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ కు నివేదిక సమర్పించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను అందించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో రసాయన రహిత వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున చేపట్టటం రైతుల ఆసక్తిని వెల్లడి చేస్తుందని, తాను గతంలో ఆయా వ్యవసాయ క్షేత్రాలను సైతం సందర్శించానని గుర్తు చేసుకున్నారు. మధ్యవర్తుల పాత్ర లేకుండా రైతుల నుండి చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయటం వారికి భరోసా నిస్తుందన్నారు.

ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ వ్యవసాయదారుల వాస్తవ అవసరాలను గుర్తెరిగిన ప్రభుత్వం ఆర్ బికెలను స్దాపించి అన్ని రకాల సేవలను వారికి చేరువ చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏర్పాటు తదుపరి దేశంలోని ఐదారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేసి వెళ్లారన్నారు. 

సమీపంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించాలని ఈ సందర్భంగా గవర్నర్ కు విన్నవించగా, తదనుగుణ ఏర్పాట్లు చేయాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాను ఆదేశించారు. వ్యవసాయ శాఖ కమీషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ బికె కోసం ప్రభుత్వం పూర్తి స్దాయి ఉద్యోగులను నియమించిందని, ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక ఆర్ బికె సేవలు అందిస్తుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం గ్రామం దాటి వెళ్ల వలసిన అవసరం లేకుండా ఈ కేంద్రాలు విశేష రీతిన సేవలు అందిస్తున్నాయన్నారు.
జీఎస్టీ మినహాయింపు సహకరించాలని గవర్నర్ కు చిల్లపల్లి వినతి:
స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరులూదిన చేనేత రంగాన్ని పరిరక్షించుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత వస్త్రాలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు చేనేత రంగం స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యలను గురించి గవర్నర్ కు వివరించారు.

ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మగమగ్గాల పోటీని సైతం తట్టుకుని అరుదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న చేనేత కార్మికులు అభినందనీయులన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి సహకారం అందించటం, తద్వారా వారు నిరంతర ఉపాధిని పొందగలగటం మంచి పరిణామమన్నారు. యువత ఆదరణతోనే ఈ రంగం మరింత స్వయం సమృద్దిని సాధించగలుగుతుందన్నారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీఎస్టీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని విన్నవించారు. వ్యవసాయ తరువాత అత్యధిక మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి జీఎస్టీ గొడ్డలి పెట్టుగా పరిణమించిందని, కేంద్ర ప్రభుత్వం దానిని మినహాయించేలా సహకరించాలని కోరారు.

ముఖ్యమంత్రి ముందుచూపు ఫలితంగా నేతన్న నేస్తం పేరిట రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతి చేనేతకు సహాయం అందుతోందని, ఫలితంగా వారు మెరుగైన జీవనోపాధిని పొందగలుగుతున్నారని వివరించారు. నూతన డిజైన్లతో యువతను ఆకర్షించేలా ఆప్కో వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకవచ్చిందని, గన్నవరం, విశాఖ పట్నం, తిరుపతి విమానాశ్రయాలలో సైతం ఆప్కో కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 

ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన గవర్నర్ జీఎస్టీ మినహాయింపు విషయంలో తగిన సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
Biswabhusan Harichandan
apco
gst
Andhra Pradesh

More Press News