చేనేత ఎగుమతులపై ప్రత్యేక దృష్టి: ముఖేష్ కుమార్ మీనా

Related image

  • చేనేత జౌళి, ఆర్ధిక (వాణిజ్య పన్నులు) శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి: చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఉన్న డిమాండ్ మేరకు ఎగుమతులపై దృష్టి సారించాలని చేనేత జౌళి, ఆర్ధిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎగుమతులు ప్రోత్సహించగలిగితే ప్రతి ఒక్క చేనేత కార్మికునికీ ఈ రంగం నుండే పూర్తి స్ధాయి ఉపాధి చూపించగలుగుతామన్నారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం చేనేత జౌళి శాఖ, ఆప్కోపై ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.

ప్రత్యేకించి ఎగుమతుల కోసమే నిర్ధేశించిన విశాఖ చేనేత పార్కును విషయంలో నిశిత దృష్టిని పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆప్కోకు ప్రభుత్వపరమైన ప్రోత్సాహం ఉంటుందని, అయితే స్వయం సమృద్దిగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారులను ఆకర్షించటంలో, వారికి అవసరమైన వస్త్రశ్రేణిని అందించటంలో ఇతర వ్యాపార సంస్ధలతో పోటీ పడేలా కార్యాచరణ అవసరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం అందాలని, ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. 

చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యువతను ఆకర్షించేలా నూతన డిజైన్లతో చేనేత వస్త్రాలను తయారు చేసి, ప్రత్యేక ప్రచార కార్యాక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases