ఎస్టీ ప్రత్యేక ప్రగతి పద్దు కింద ఈ ఏడాది రూ.6672 కోట్లు ఖర్చు: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

  • నిధులు మురిగిపోవని నిర్లక్ష్యం వద్దు
  • కేటాయించిన నిధులు సంపూర్ణంగా వెంటనే ఖర్చు చేయాలి
  • శాఖల వారిగా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి
  • ఎస్టీ ప్రత్యేక ప్రగతి పద్దు నోడల్ ఏజన్సీ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్
(హైదరాబాద్, మార్చి 03): గిరిజనుల జనాభా శాతానికనుగుణంగా బడ్జెట్ కేటాయించేందుకు ఉద్దేశ్యించిన ప్రత్యేక ప్రగతి పద్దు చట్టం -2017 కింద వివిధ శాఖలకు కేటాయించిన నిధులను వెంటవెంటనే ఖర్చు చేస్తూ.. నిధులను సద్వినియోగిం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ –శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఎస్టీ ప్రత్యేక ప్రగతి పద్దు(ఎస్.డి.ఎఫ్) నోడల్ ఏజన్సీ మీటింగ్ లో 28 శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయాశాఖల్లోని ప్రతి పథకాన్ని సమగ్రంగా సమీక్ష చేశారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. ఎస్టీఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులు మురిగిపోవనే ఉద్దేశ్యంతో వాటిని ఖర్చుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. 

ఈ ఏడాది ఎస్టీఎస్డీఎఫ్ కింద 6672 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇందన శాఖలకు 1000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, 9 శాఖలు.. ప్రణాళిక, పరిశ్రమలు, మునిసిపల్, పంచాయతీ రాజ్, పౌర సరఫరాలు, మిషన్ భగీరథ, ఆరోగ్యం, సమగ్ర శిక్షా, ఆరోగ్య శ్రీలకు 100 నుంచి 1000 కోట్లరూపాయలకు మధ్య నిధులు కేటాయించినట్లు తెలిపారు. మరో 8 శాఖలకు 10 నుంచి 100 కోట్ల రూపాయల లోపు కేటాయించారని వెల్లడించారు. 

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం కేటాయించిన ఈ నిధులను ఖర్చు చేయడంతో పాటు లబ్ధిదారుల జాబితా, రోడ్లు, కమ్యునిటీ అభివృద్ధి కోసం చేసిన ఖర్చు విషయంలో వాటి వివరాలను సవివరంగా సమర్పించాలని మంత్రి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం కోసం కాదనకుండా నిధులు కేటాయిస్తున్నారని, సీఎం ఆలోచన మేరకు అధికారులు కూడా ఆ నిధులను సద్వినియోగం చేస్తూ వారి ప్రగతి కోసం పాటుపడాలని కోరారు. ఎస్టీఎస్డీఎఫ్ కింద కేటాయించే నిధులు, ఖర్చుపై ఆయా శాఖల అధికారులు కచ్చితంగా సకాలంలో వివరాలు అందించాలని, లబ్దిదారుల వారిగా ఈ వివరాలుండాలన్నారు. ఎస్టీఎస్డీఎఫ్ నోడల్ ఏజన్సీ మీటింగ్ కు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కచ్చితంగా హాజరై నిధుల ఖర్చు, వారికున్న సమస్యలను తెలపాలని చెప్పారు.

ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య దేవరాజన్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases