రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో చేపట్టిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఒకటి, రెండు ప్రాంతాలలో నిబంధనలను పాటించడంలేదని పిర్యాదులు వచ్చిన నేపధ్యంలో మత్స్య శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు.

ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని పలు నీటి వనరులలో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తుందని తెలిపారు. మత్స్యకారులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే ఆలోచనతో రాష్ట్రంలో అనువైన మంచినీటి వనరులలో రొయ్య పిల్లలను విడుదల చేయాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. 2017-18 సంవత్సరంలో ప్రారంభించిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటగా 11 నీటి వనరులలో కోటి 8 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు.

వీటితో 7,783 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగిందని, దీని విలువ సుమారు 171 కోట్ల రూపాయలు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచినీటి వనరులలో ఉత్పత్తి చేస్తున్న రొయ్యలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో బాగా డిమాండ్ ఉండటంతో ఏటేటా నీటి వనరులు, విడుదల చేసే రొయ్య పిల్లల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నట్లు పేర్కొన్నారు. 2020-21 సంవత్సరంలో 4.15 కోట్ల రొయ్య పిల్లలను 90 నీటి వనరులలో విడుదల చేయగా, 381 కోట్ల రూపాయల విలువైన 11,734 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. ఈ సంవత్సరం రొయ్యల పెంపకానికి అనుకూలంగా ఉన్న 313 నీటి వనరులలో 10 కోట్ల రొయ్య (నీలకంట) పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఇందుకు అవసరమైన రొయ్య పిల్లలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 140 నీటి వనరులలో 5.34 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని వివరించారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యత, లెక్కలలో నిబంధనలు పాటించలేదన్న పిర్యాదులు వస్తున్నాయని, ఇవి పునరావృతం కాకుండా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిని ఉపెక్షిన్చావద్దని మంత్రి స్పష్టం చేశారు.

మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు: మంత్రి తలసాని సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల పై సమీక్షించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ EO మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మహేష్, కిషోర్, బాలాజీ శ్రీనివాస్ గౌడ్, కస్తూరి, ఆనంద్ పటేల్, చందు, KM కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఆలయం ప్రభుత్వం, దాతలు, భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.

మొక్కుల రూపంలో భక్తులు చెల్లించిన బంగారంతో అమ్మవారికి బంగారు బోనం చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా అమ్మవారి గర్బగుడికి మిగిలి ఉన్న వెండి తాపడం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపుకు ఒక రధాన్ని చేయించాలని, అమ్మవారికి బంగారు చీరను చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆలయ అభివృద్దికి ఇంకా చేపట్టాల్సిన పనులు, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.

More Press Releases