భావితరాలకు కాలుష్యకారక తెలంగాణ ఇద్దామా?..పవన్ కల్యాణ్ ప్రశ్న

Related image

భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా..? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా..?అని ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం ప్రశ్నించారు.అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు దీని గురించి ఆలోచించాలి అన్నారు.నల్లమల అడవులలో యురేనియం నిక్షేపాలను అన్వేషించడానికి సర్కారు సన్నద్ధమవుతున్న తరుణంలో పర్యావరణ ప్రేమికుడు అయిన పవన్ కల్యాణ్ తన భాదను, ఆవేదనను వ్యక్త పరిచారు. యురేనియం తవ్వకాలపై కొద్దిరోజులలో రాజకీయవేత్తలు,మేధావులు,నిపుణులు,పర్యావరణ ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి విదితమే.

ఈ సందర్భంగా యురేనియం అంశంపై ఆయన స్పందిస్తూ..1852 లో అమెరికాలో అప్పటి ప్రభుత్వం నివాస ప్రాంతాల కోసం అడవులను కొనడానికి ప్రయత్నించినప్పుడు సియాటిల్ ప్రాంత ముఖ్య అధికారి రాసిన లేఖను తన ట్విట్టర్లో పవన్ కల్యాణ్ ఉటంకించారు.. మనిషి కోసం భూమి కాదు, భూమి మీద మనిషి పుట్టాడు అని ప్రారంభమయ్యే ఆ లేఖ సారాంశం ఇలా వుంది...

మా భూమిని కొనాలని ఆకాంక్షిస్తున్నట్లు... వాషింగ్టన్‌ నుంచి అమెరికా అధ్యక్షుడు సమాచారమిచ్చాడు.. కానీ.. గగనాన్ని కొనడమైనా.. అమ్మడమైనా మీకెలా సాధ్యం..? భూమి..? అసలా ఆలోచనే మాకు విచిత్రం. గాలిలోని స్వచ్ఛత.. గలగలల నీటి మిలమిలలు.. మా సొంతం కానప్పుడు.. వాటిని మీరెలా కొంటారు..?"

"ఈ భువిపైని ప్రతి అణువూ.. మా ప్రజలకు అతి పవిత్రం. కాంతులీనే ప్రతి దేవదారు వృక్షం... సాగర తీరపు ఇసుక రేణువుల అణువణువూ.. నింగినంటి.. గగనాన్ని కనుమరుగు చేసే.. వృక్ష సంపదలపైని తెలిమంచు.. పచ్చిక బయళ్లు.. కువకవలాడే పక్షులు..  అదీ ఇదీ అనేమిటి..? మా ప్రజల స్మృతుల్లో.. వారి అనుభూతి, అనుభవాల్లో..  ప్రతిదీ పవిత్రమే.."

"వృక్ష కాండముల నుంచి సిద్ధించే రససారం.. మాకు విదితం.. అది.. మా నరాల నుంచి ప్రవహించే రక్తానికి ప్రతీకే అన్నది మా అభిమతం. పుడమిలో మేము భాగం.. మాలో పుడమి భాగం.. సుగంధభరిత విరులు మా సోదరీమణులు. ఎలుగులు.. దుప్పులు.. పక్షిరాజులు.. మా సోదరులు. రాతి మిట్టలు.. సారవంతమైన పచ్చటి మైదానాలు.. లేగ తురగపు దేహపు తాపములు.. మనిషి.. ఇలా అంతా ఆ కుటుంబానికే సొంతం." 

"తళతళల నదీమ తల్లుల గతులు.. అవి నదులే కాదు.. మా తాతముత్తాతల రక్తపు ఝరులు. గతితప్పి మేము మా భూమిని మీకు అమ్మినా.. అది పరమపవిత్రం అన్నది మీరు గుర్తుంచుకోవాలి. స్వచ్ఛమైన తటాకాల జలసిరులు..  ఆత్మసంబంధపు ప్రతిబింబాలు.. ఇవన్నీ, మా ప్రజల ఉదంతాలు, స్మృతులు, జీవనగతులను తేటతెల్లం చేస్తాయి. పారేటి నీటి గలగలు.. మా తాతల గళాల సుస్వరాలు. "

"నదులు మా సోదరులు. వారు మా దాహార్తిని శమింపచేశారు. మా దోనెలను తీసుకెళ్లారు.. మా పిల్లలకు అందించారు. కాబట్టి.. మీరు, ఏ సోదరుడికైనా అందించే దయావర్షాన్ని..  నదులపై కురిపించాలి.. "

"మేమే గనుక మీకు మా భూమిని అమ్మితే.. గుర్తుంచుకోండి.. మాకు గాలి అతి ప్రియతమం. తనపై ఆధారపడ్డ వారందరికీ అది తన ఆత్మను పంచుకుంటుంది. గాలి.. మా తాతయ్యకు తొలి శ్వాసను అందించింది.. అదే క్రమంలో.. తుది శ్వాసనూ తనలో కలిపేసుకుంది. గాలి.. మా చిన్నారుల జీవితాలకు స్పూర్తి. కాబట్టి, మేమేగనుక మీకు మా భూమిని అమ్మితే.. హరిత ప్రదేశపు విరుల గుబాళింపులను మధురభరితం చేసిన గాలిని  ఆస్వాదించేందుకు మనిషి వెళ్లేలా.. దాన్ని ప్రత్యేకంగా చూడాలి.. పవిత్రంగా ఆరాధించాలి.. "

"మా చిన్నారులకు నేర్పిన పాఠాలను మీ చిన్నారులకు నేర్పగలరా..? అదే పుడమి మన తల్లి.. ధరిత్రికి ఏమి తటస్థించినా.. ఆ పుడమితల్లి పుత్రులకూ అది సంభవిస్తుంది. "

ఇది మాకు తెలుసు : "భూమి మనిషికి చెందింది కాదు. మనిషి పుడమికి చెందినవాడు. అన్ని అంశాలూ.. మనల్ని ఏకం చేసే రుధిరంలా కలుపుతున్నాయి. మనిషి తన జీవనపు గూడును  అల్లుకోలేదు. అందులో ఓ పోగులా మిగిలాడు. గూటికోసం అతనేమి చేసినా.. తన కోసం తాను చేసుకున్నాడు." 

ఓ విషయం మాకు తెలుసు : "మా దేవుడే మీ దేవుడు. పుడమి దైవానికి అతి ప్రియం. పుడమికి చేటు చేయడమంటే.. ఆ సృష్టికర్తపై ధిక్కరలను పోగుచేయడమే." 

"మీ అదృష్టం.. మాకు ఓ అద్భుతం..!  దున్నలన్నింటినీ దనుమాడితే.. జరిగేదేంటి..? అడవి గుర్రాలు ఇమిడేనా..?  ఎందరో మనుషుల పొడకన్నా.. వనాల మర్మపు కోణాలే అధికమైతే, పరిపూర్ణమైన కొండలను.. మాటల తంత్రుల కోసం కొట్టివేస్తే.. జరిగేదేంటి..? అడవి ఎక్కడుంటుంది..? పోయినట్లే..! గద్దలెక్కడుంటాయి..? గతించినట్లే..!  జవపు అశ్వానికి, వేటకు.. వీడ్కోలు పలకడాన్ని ఏమనాలి..? జీవితానికి చరమగీతం.. అస్తిత్వానికి ఆరంభం. 

"రుధిరవర్ణపు చివరి మనిషీ.. తన అరణ్యంతో పాటు అంతర్ధానమైతే.. ఇక ఆతడి స్మృతులు... మైదానప్రాంతంపై పయనించే మేఘాల ఛాయలే అవుతాయి. ఈ తీరాలు.. అడవులు.. ఇంకా ఇక్కడుంటాయా..? గతించిన మా ప్రజల ఆత్మ అక్కడుంటుందా..?" 

"అప్పుడే పుట్టిన శిశువు తన తల్లి గుండెచప్పుడును ప్రేమించినట్లుగా.. మేమీ పుడమి తల్లిని ప్రేమిస్తాము. కాబట్టి, మేమే గనుక మీకు మా భూమిని అమ్మితే, దాన్ని అచ్చం మాలాగే ప్రేమించండి. మేము చూసుకున్నట్లే దాన్ని చూసుకోండి. భూమిని తీసుకున్నప్పటి స్మృతులను మీ మదిలో శాశ్వతంగా నిక్షిప్తం చేసుకోండి. ఆ దైవం మనలను ప్రేమించినట్లే.. భూమినీ ప్రేమించండి.. మన పిల్లలందరి కోసం దానిని భద్రపరచండి." 

"పుడమిలో మేము భాగమైనట్లే.. మీరూ ఈ అవనిలో భాగమే. ఈ భూమి మాకు అమూల్యమైనది. అది మీకూ అమూల్యమే. ఓ విషయం మాకు తెలుసు : దేవుడొక్కడే. అలాగే, ఎర్రటివాడా..? తెల్లటివాడా..? అన్న భేదంతో మనిషినీ వేరు చేయరాదు. అంతిమంగా మనమంతా సోదరులం."

More Press Releases