జాబ్ క్యాలెండర్ అమలుతో ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీ.ఎస్.ఎల్.డీ.ఏ సీఈఓ మంజువాణిలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను గుర్తించి వాటి వివరాలు సమర్పించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులను ఆదేశించారని తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకొని పశుసంవర్ధక, మత్స్య శాఖలలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను సమగ్ర నివేదిక రూపంలో అందిస్తే ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని అన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలు, మండలాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నివేదికలను సిద్దం చేయాలని ఆదేశించారు.

ఇటీవల అమలులోకి వచ్చిన నూతన జోనల్ విధానంతో కూడా ఏర్పడే ఖాళీలను గుర్తించి నివేదికలో పొందుపరచాలని చెప్పారు. ఆయా శాఖలలోని ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యే ఉద్యోగులతో ఖాళీ అయ్యే పోస్టులను అదే సంవత్సరం భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణను రూపొందిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అమలుతో ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంతో భారం పడుతుందని, అయినా ముఖ్యమంత్రి ఎంతో సాహసంతో ముందుకు వెళుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

రానున్న రోజులలో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, వాటి అమలుకు అదనపు సిబ్బంది అవసరం ఉంటుందని దానిని కూడా పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, జీవాల పెంపకం దారులకు అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో జీవాల సంఖ్య కూడా పెరిగిందని, సేవలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.

అంతేకాకుండా పలు పట్టణాలలో ఉన్న పశువైద్య శాలలకు వైద్య సేవల కోసం ఎలాంటి జీవాలు రావడం లేదని అలాంటి హాస్పిటల్స్ లో ఉన్న సిబ్బందిని, వివిధ హాస్పిటల్స్ లో అదనంగా ఉన్న సిబ్బందిని అవసరమైన చోటకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలుచేసిందని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆరోగ్యవంతమైన జీవితమని భావించి అందులో ప్రధానంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మహోద్యమంలా కోట్లాది మొక్కలను నాటిన ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు.

ఇదే కాకుండా నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో భారీగా సాగుభూముల విస్తీర్ణం పెరిగిందని అన్నారు. 12,500 గ్రామపంచాయితీలకు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం ట్రాక్టర్లు అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

More Press Releases