ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని మత్స్యకారులకు కనీస గుర్తింపు ఉండేది కాదు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నారని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యశాఖ ఆద్వర్యంలో బేగంపేట హరిత ప్లాజాలో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వివిధ కారణాలతో మరణించిన 105 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ క్రింద ఒక్కొక్క కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని మత్స్యకారులకు కనీస గుర్తింపు ఉండేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మత్స్యరంగ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సామూహిక ప్రమాద భీమా పథకం క్రింద ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.

మత్స్య సహకార సంఘాలలో నమోదు చేయబడిన సభ్యులందరికి భీమా పథకం వర్తింపచేయనున్నట్లు తెలిపారు. ప్రతి మత్స్యకారునికి 12 రూపాయల ప్రీమియంలో 6 రూపాయలు కేంద్ర ప్రభుత్వ, 6 రూపాయల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. 2021-22 నుండి మత్స్యకారుల భీమా పథకం అమలు కోసం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేసిందని, ఈ పథకం అమలులో భాగంగా ఒక్కొక్క మత్స్యకారుడికి 28.98 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 97.58 లక్షల రూపాయలను ప్రీమియం క్రింద చెల్లించినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ పథకం క్రింద ప్రస్తుతం 3,36,799 మత్స్యకారులు అర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. మత్స్యకారుడు మరణిస్తే 2 లక్షల రూపాయలను వారి కుటుంబాలకు అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

మత్స్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరు అడగకుండానే ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారని, మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను ఇచ్చిన గొప్ప నాయకుడు అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నీరున్న ప్రతిచోట చేప పిల్లలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు. చేపల సైజు పెరిగిన తర్వాత, మద్దతు ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలని, తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. చేపల మార్కెటింగ్ లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మత్స్య సహకార సంఘాల నుండి నేరుగా మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం ద్వారా మత్స్యకారులను ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

ఫెడరేషన్ ద్వారా కొనుగోలు చేసిన చేపలను రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన చేపలను ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో వినియోగదారులకు చేపలను చేరువ చేసేందుకు 60 శాతం సబ్సిడీపై 150 మొబైల్ అవుట్ లెట్ లు ప్రారంభించినట్లు చెప్పారు. ఎంతో డిమాండ్ కలిగిన కోర్రమేను రకం చేపల ఉత్పత్తి, పెంపకాన్ని రాష్ట్రంలో రాబోయే కాలంలో చేపట్టనున్నట్లు తెలిపారు. మత్స్యకారుల వృత్తిలో దళారుల ప్రమేయాన్ని సహించబోమని, ఎవరైనా చెరువులు, చేపల విషయంలో మధ్య దళారులు జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

ముఖ్యమంత్రి కృషి ఫలితంగానే రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతున్నాయని, రానున్న రోజులలో 365 రోజులు చెరువుల్లో నీళ్లు ఉంటాయని, మత్స్యకారులకు ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారు. కొందరు అవగాహన లేకుండా గొర్రెలు, బర్రెలు ఇస్తారా అని హేళనగా మాట్లాడుతున్నారని, ఎన్నో సంవత్సరాలుగా కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం చేయూతను అందిస్తూ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని వివరించారు. పేదోడు గొప్పగా బతకాలని, ఆత్మగౌరవంతో బతకాలని మొట్టమొదట చెప్పిందే కేసీఆర్ అన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా మత్స్యకారుల కళ్ళలో ఆనందం చూడాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో మీ పిల్లలను చదివించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారులు ఐకమత్యంతో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని వివరించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ గతంలో మత్స్యకారులు అంటే కేవలం ఆంధ్రలోనే వున్నారు అనే వారు. తెలంగాణలో మత్స్యకారులు ఉన్నారని చెప్పే ప్రయత్నం అనేకసార్లు చేశామని అన్నారు. అయినా అప్పట్లో గుర్తింపు రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృషితో చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో మత్స్యకారులు ఆర్థికంగా మరింత ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన మత్స్యశాఖ అధికారులు, వివిధ మత్స్య సహకార సంఘాల సభ్యులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

More Press Releases