అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వైయస్సార్: ఏపీ గవర్నర్

అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వైయస్సార్: ఏపీ గవర్నర్
విజయవాడ: డాక్టర్ వై.ఎస్ రాజశేఖర రెడ్డి అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం అంకితభావంతో కృషి చేశారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జయంతి నేపథ్యంలో గవర్నర్ సందేశం విడుదల చేస్తూ సమాజంలోని అణగారిన వర్గాలకు పెద్ద ఎత్తున సేవ చేయాలని ఆయన గట్టిగా విశ్వసించారన్నారు.

సమైఖ్య రాష్ట్రంలోని చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజశేఖర రెడ్డి దగ్గరయ్యారని గవర్నర్ ప్రస్తుతించారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగాన్ని మెరుగు పరచడంతో పాటు, పేద, అణగారిన ప్రజల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు.

అనేక సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయి వరకు అమలు చేయడం అనేది ప్రజల సంక్షేమం విషయంలో ఆయనలో కనిపించే సంకల్పం, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. డాక్టర్ వై.ఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల ప్రియమైన నాయకుడుగా చరిత్రలో నిలిచారని, మానవత్వంతో ప్రజల శ్రేయస్సు పట్ల చూపిన శ్రద్ధకు ఆయన ఎప్పుడూ వారి మనస్సులలో చిరస్థాయిగా గుర్తుండి పోతారన్నారు.

నేల తల్లిని నమ్మిన భూమి పుత్రునిగా వైయస్సార్ కు నివాళి అర్పిస్తూ ఆయన జన్మదినోత్సవాన్ని ‘రైతు దినోత్సవం’ గా పాటించడం సముచితమన్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు దివంగత రాజశేఖరరెడ్డి వాస్తుశిల్పిగా నిలిచారని గవర్నర్ ప్రశంసించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
Biswabhusan Harichandan
ysr
Andhra Pradesh

More Press News