నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దే వద్దు: పవన్ కల్యాణ్

నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దే వద్దు: పవన్ కల్యాణ్
  • అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తాం

  • వీహెచ్ తో భేటీ అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టీకరణ

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ ప్రాంతంలో కేంద్రం తలపెట్టిన యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు జీవవైవిధ్యం నాశనమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాల వల్ల రాడాన్ అనే అణుధార్మిక వాయువు వెలువడుతుందని, దానిని పీల్చిన వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, యురేనియం వ్యర్ధాలు కలిసిన నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు పవన్ కల్యాణ్ ని కలిశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లుతుంది. కృష్ణా జలాలు కలుషితమవుతాయి. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయం చాలా మంది చెంచులు జనసేన పార్టీ దృషికి తీసుకొచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకొని యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనుంది..?. కృష్ణా జలాలు ఎలా కలుషితం కాబోతున్నాయి..?. ఆ నీరు తాగిన ప్రజలకు ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి..?.  అన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పర్యావరణ శాస్ర్తవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తాం. రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామ"న్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. "యురేనియం సమస్య రెండు తెలుగు రాష్ట్రాల సమస్య. యురేనియం శుద్ధి చేయగా వచ్చిన వ్యర్ధాలు కృష్ణా నదిలో కలవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతారు. కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులతో పాటు పిల్లలు మానసిక రోగులుగా మారుతారు. నల్లమలలో జీవవైవిధ్యం దెబ్బతింటుంది. జంతువులు మృత్యువాత పడతాయి. చెంచుల జీవితాలు అస్తవ్యస్థం అవుతాయి. యురేనియం తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో పంటలు పండవు, నీళ్లు వ్యవసాయానికి యోగ్యం కావు, భూగర్భజలాలు అడుగంటిపోతాయి. కడప, జార్ఖండ్ ప్రాంతాల్లో ఇలానే జరిగింది. ప్రజా సమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కల్యాణ్ గారు. అందుకే ముందుగా ఆయన్ను కలసి పోరాటానికి మద్దతు అడిగాను. సానుకూలంగా స్పందించి అఖిలపక్షం పిలుద్దాం. నిపుణులతో మాట్లాడి జరగబోయే నష్టాలను ప్రజలకు వివరిద్దాం అని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో సెమినార్ ఎప్పుడు నిర్వహిస్తామనే డేట్ వెల్లడిస్తాం. అన్ని పార్టీల నాయకులం చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామ"ని అన్నారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
VH

More Press News