మా గురించి జనసేన పోరాడుతుంది అనే ధైర్యం ప్రజల్లో ఉంది: పవన్ కల్యాణ్

Related image

  • ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ వదలవద్దు

  • తప్పు చేస్తే నిలదీసే నైతికత మన పార్టీకి ఉంది

  • పార్టీ నాయకులకు, శ్రేణులకు రక్షణగా ఉంటాం

  • జనసేన మేధో మధనంలో పవన్ కల్యాణ్

జనసేన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మనం నిలుపుకొంటూ వారిని అర్థం చేసుకొంటూ ముందుకు వెళ్తే అదే మనకు బలం అవుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. మా గురించి, మాకు అన్యాయం జరిగితే జనసేన పోరాడుతుంది అనే ధైర్యం ప్రజలకు ఉంది అన్నారు. అందుకే వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ వదలవద్దు అని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు తూర్పు గోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన మేధో మధనం శుక్రవారం ముగిసింది.

చివరి రోజున పార్టీ నాయకులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ “వచ్చినవి ఆరు శాతం ఓట్లే, ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు అని లెక్కలు చెబుతారు. అయితే ప్రజలకు మన పార్టీ విధానాలపై నమ్మిక ఉంది. అమరావతిలో రైతులకు సమస్య ఎదురైతే మనతో మాట్లాడారు. 26 వేల మంది రైతుల సమస్య మాత్రమే కాదు అది. రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశం అది. ఆ గ్రామాల్లో పర్యటించి భరోసా నిచ్చాం. ఏ వర్గం వారికి ఏ సమస్య వచ్చిన మనం అండగా నిలుద్దాం. తప్పు చేస్తే నిలదీసే నైతికత మన పార్టీకి ఉంది. నేను రెండు చోట్లా ఓడిపోయినప్పుడు కొద్ది క్షణాలు శూన్యత ఏర్పడింది. తక్షణమే మామూలుగా అయ్యాను. ప్రజల్లోకి వచ్చాను. ఇప్పుడు కోనసీమ వస్తే – ప్రజల ఆదరణ చూస్తే ఎన్నికల కోసం వచ్చినట్లుగా ఉంది. ఈ బలాన్ని మనం స్వీకరించాలి. మనం కష్టపడదాం. ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తున్నారు. పార్టీకి స్వచ్ఛందంగా నిధులు సమకూరుస్తున్నారు.

పార్టీ విధివిధానాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అందరిదీ పార్టీ అజెండాయే కావాలి. ప్రజాస్వామ్యయుతంగా, అందరం కలసికట్టుగా ఒకే రీతిలో వెళ్ళాలి. అంతేగానీ వ్యక్తిగత అజెండా ఉంది అందుకు అనుగుణంగా వెళ్తామంటే సాధ్యం కాదు. నాకు అందరూ సమానమే. కుల రాజకీయాలు ఇక్కడ సాధ్యం కావు. కులం కూడు పెట్టదు. కులం కూడుపెడితే సమాజంలో దారిద్ర్యం ఎందుకు ఉంటుంది?

ఘర్షణాత్మక వైఖరి కోరుకోం:

అధికారంలో ఉన్నవాళ్ళు ఇతర పక్షాలపై కక్ష సాధింపులకు దిగడం మంచిది కాదు. జనసేన ఎప్పుడూ ఘర్షణాత్మక వైఖరిని కోరుకోదు. మా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు గారిని ఇబ్బందిపెట్టిన విధానం చూశాం. పార్టీ నాయకులకు, శ్రేణులకు రక్షణగా ఉంటాం. ప్రజాపక్షంగా మనం వెళ్ళేటప్పుడు ప్రతి అంశం మీదా సమగ్రంగా పరిశీలన చేసి ముందుకు వెళ్దాం. అందుకు ఇలాంటి సమావేశాలు మరిన్ని చేపడదాం. మన నాయకులు ఈ అంశాలపై చర్చించుకొని పార్టీపరంగా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకొనే అవకాశం వస్తుంది.

ప్రజలకు అన్ని విషయాలపట్ల ఒక స్పష్టత ఉంది అనే విషయం మరచిపోవద్దు. ఈ రోజు అంతర్వేది వెళ్ళేటప్పుడు ఒక ఆడపడుచు మాట్లాడుతూ మా కాళ్ళ మీద మేము నిలబడి, కనీసం రోజుకి రూ.200 వందలు సంపాదించుకొనే విధానాలు కావాలి అని బలంగా చెప్పింది. అలాగే మరొకరు జీరో బడ్జెట్ వ్యవసాయం గురించి, దాని అవసరం గురించి చెప్పారు. ఇలా ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో వ్యవసాయం ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. తాగు నీరు సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ప్రజలు వాపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల వరకూ మనం ఏమీ మాట్లాడకూడదు అనుకున్నాం. అయితే ప్రభుత్వ పోకడలను గమనిస్తూనే ఉన్నాం. ఈ నెల 14న అన్ని వివరాలు వెల్లడిద్దాం” అన్నారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “సమకాలీన రాజకీయాలు, సమాచార హక్కు చట్టం వినియోగం, వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఇబ్బందులపై సమగ్రమైన చర్చను చేపట్టాం. సాధికారికమైన సమాచారంతోనే మనం ప్రజల తరఫున బలంగా మాట్లాడగలం. ఈ విషయాన్ని మన నాయకులు గ్రహించాలి. ఇలాంటి  కార్యక్రమాల ద్వారా పార్టీ ఆలోచనలు ఏమిటి అనేది నాయకులందరికీ స్పష్టంగా చెప్పే వీలు కలుగుతుంది. పార్టీపరంగా నాయకులకు, శ్రేణులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం.

మన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు గారిపై పోలీసులు కేసులుపెడితే ఆ అంశం మీద మన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు నిరంతరం ఏమి జరుగుతోంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని సంబంధిత వర్గాలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఒక దశలో రాజోలు బయలుదేరేందుకు సిద్దమయ్యారు” అన్నారు. 

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు మాట్లాడుతూ “జనసేన పార్టీ నిరంతరం ప్రజలతో మమేకమై ఉండేలా ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయి.  ఇందుకు సంబంధించిన సమావేశం ఇక్కడ చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

ఈ సందర్భంగా పార్టీ తరఫు నుంచి రైతులకు అండగా నిలిచేలా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్.పి.ఓ.) ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించి వివరాలను పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కి అందించారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై జి‌.వి.రమణారావు, అడ్డాల గోపాలకృష్ణ ఉపన్యసించారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పి.రామ్మోహన్ రావు, అర్హం ఖాన్ పాల్గొన్నారు.

More Press Releases