టోక్యో ఒలంపిక్స్ కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారుడు.. ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో టోక్యో లో జరగనున్న ఒలంపిక్స్ కు దేశం నుండి బ్యాడ్మింటన్ విభాగంలో ఎంపికైన తెలంగాణ బిడ్డ సాయి ప్రణీత్ ను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ప్రోత్సహకంగా రాష్ట్ర క్రీడా శాఖ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా సదుపాయాల కల్పనకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు 25 కోట్ల 87 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. వివిధ క్రీడా సంఘాలకు 9 కోట్ల రూపాయలను అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ రాష్ట్రంను క్రీడా హబ్ గా తీర్చిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడా పాలసీ తయారీకి, క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వివిధ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు ఉన్నత విద్యా లో 0.5 శాతం, ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లలో, కామన్ వెల్త్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్నీ గతం కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఒలంపిక్స్ లో గోల్డ్ సాధించిన క్రీడాకారునికి 50 లక్షలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు, రజత పతకం సాధించిన క్రీడాకారులకు గతంలో 25 లక్షల రూపాయలు ఇస్తే నేడు ఒక కోటి రూపాయల ను అందిస్తున్నామన్నారు. కాంస్య పతకం సాధించిన క్రీడాకారులకు గతంలో 10 లక్షలు ఇస్తే నేడు 50 లక్షల రూపాయల నగదు  పురస్కారాలను క్రీడాకారులకు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

టోక్యో ఒలంపిక్స్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి క్రీడాకారులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యుడు అల వెంకటేశ్వర రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సాయి ప్రణీత్ తల్లిదండ్రులు, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, డా. నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

More Press Releases