నాణ్యమైన విద్య ద్వారా పేద వర్గాల వెనుకబాటుతనం నిర్మూలనకు సీఎం కేసిఆర్ కృషి: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

  • గిరిజన గురుకులాలలో పేద వర్గాలకు నాణ్యమైన విద్య
  • ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్న గిరిజన విద్యార్థులు
  • ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారి విద్యా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది
  • ఐఐఎంలలో సీట్లు సాధించిన బదావత్ సోని, రాథోడ్ నరేష్ లకు అభినందనలు
(హైదరాబాద్, జూన్ 1): తెలంగాణలో ఉన్న పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనన్ని గురుకులాలు పెట్టి కేజీ టు పీజీ ఉచిత విద్య ద్వారా అన్ని వర్గాల పేద బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడంతో నేడు గురుకుల విద్యార్థులు దేశంలోని గొప్ప గొప్ప విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించి తమ సత్తా చాటుతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ విద్యార్థులలో బదావత్ సోని, రాథోడ్ నరేశ్ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు.

బదావత్ సోని(ఎంపీసిఎస్) నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి దినసరి వేతన కూలి. జిల్లా పరిషత్ లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న సోని, గిరిజన గురుకులంలో చదివి ట్రీచి ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్2021-22కు సీటు సాధించింది.

అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ నరేష్(బికాం, హానర్స్) తల్లిదండ్రులు ఇద్దరూ దినసరి వేతన కూలీలు. సంగారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న నరేశ్, గిరిజన గురుకులంలో చదువుకుని వైజాగ్ ఐఐఎంలో సీటు సాధించాడు.

ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలలో సీట్లు సాధించిన ఈ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందనపూర్వకంగా లక్ష రూపాయల నగదు పారితోషికం, ఒక ల్యాప్ టాప్ అందిస్తోందని మంత్రి తెలిపారు. దీంతో పాటు వారికి అడ్మిషన్ సాధించిన ఐఐఎంలోని ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, మెస్ ఛార్జీలు పూర్తి ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం కోసం ప్రభుత్వం క్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోందని తెలిపారు. ఫలితంగా ఇద్దరు విద్యార్థులు ఐఐటీలలో పిహెచ్ డీలలో సీటు సాధించగా, మరో 110 మంది వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందారన్నారు.

ప్రభుత్వ గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో చదివి ఉన్నత విద్య కోసం ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అక్కడ చదివే ఆర్ధిక స్తోమత ఉండదని ముందే గుర్తించి, వారందరికీ కావల్సిన ఆర్ధికసాయం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నందున బదావత్ సోనికి, రాథోడ్ నరేష్ కు కావల్సిన ఆర్ధిక సాయం అందుతుందని తెలిపారు.

More Press Releases