రాజు మారితే రాజధాని మారాలా?.. పవన్ కల్యాణ్

Related image

  • రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలి

  • జగన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా వైసీపీ అధినేతలా వ్యవహరిస్తున్నారు

  • విభజన సమయంలో జరిగిన రాజకీయాలే రాజధాని వ్యవహారంలో జరుగుతున్నాయి

  • ప్రభుత్వ ప్రకటనలతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి

  • 90 రోజులకే జగన్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది

  • రాజధానికి, రైతులకు అన్యాయం చేస్తే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకువెళ్తా

  • రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. ఈ ప్రాంతం నుంచి ఎవరూ కదపలేరు

  • రాజధాని గ్రామాల పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి రాజకీయాలు జరిగాయో, రాజధాని వ్యవహారంలోనూ అలాంటి రాజకీయాలే చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. రాజు మారితే రాజధాని మారాలా అని ప్రశ్నించారు. రైతులు భూములు ఇచ్చిన చోట ఇన్ని నిర్మాణాలు జరిగిన తర్వాత రాజధాని మారుస్తారని భావించడం లేదన్నారు. నాలుగు ప్రాంతాల్లో రాజధానులు, కొండవీటి వాగు వరద ముప్పు  అంటూ ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

అమరావతి రైతుల అభ్యర్ధన మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఐనవోలు ఎస్ఆర్ఎం కాలేజీ సమీపంలోని కొండవీటి వాగు వంతెన పనులు పరిశీలించారు. మంగళగిరి నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ బేతపూడి, నిడమర్రు, కురగల్లు గ్రామాల మీదుగా రాజధాని గ్రామాలకు వెళ్లారు. ఆయన వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. వివిధ దశల్లో ఉన్న ప్రభుత్వ భవనాలు, యూనివర్శిటీల భవనాలు, హైకోర్టు పరిసరాలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల క్వార్టర్స్, కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం  పరిశీలించారు.

కొండవీటి వాగు వంతెన నిర్మాణం దగ్గర మీడియాతో మాట్లాడుతూ... “ వైసిపి ప్రభుత్వం రాజధాని మారుస్తుందంటూ ఈ ప్రాంత  రైతులు కొంత మంది నన్ను కలిశారు. రాజధాని అంశం భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారం. 33వేల ఎకరాలకు పైగా భూములను సమీకరణలో రైతులు ఇచ్చి త్యాగం చేశారు. ఇప్పుడు రాజధాని మారుస్తాం అంటే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. రాజధాని మార్పు మీద బలమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వైసిపి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ అంశం మీద ప్రకటన చేయాలి. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? ఒకవేళ వేరే చోటుకు తరలిస్తే అది ఏ ప్రాతిపదికపై తరలిస్తారు? రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే అంశం మీద స్పష్టత ఇవ్వాలి.

దీన్ని పొలిటికల్ గేమ్ గా చూస్తే ప్రజలు నష్టపోతారు. మంత్రి బొత్స సత్యనారాయణ గారు పరిస్థితులని అర్ధం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. రాజధాని తరలిస్తే భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకి విలువ ఏముంటుంది. నిర్మాణాలు సగంలో ఉన్నాయి.. తరలిస్తే రైతులకు భూములు తిరిగి ఇవ్వగలరా?

•విభజన వల్ల 70 %శాతం ఆదాయం ఇచ్చే హైదరాబాద్ ని కోల్పోయాం

రాష్ట్ర విభజన వల్ల 70 %శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ ను కోల్పోవాల్సి వచ్చింది. 2014లో బిజెపి, టిడిపిలతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో రాజధానికి 3 నుంచి 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అది  రాజధాని నిర్మాణానికి సరిపోతుందని ప్రధాని మోదీ గారు మాట్లాడారు. అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతా చాలా పెద్ద స్థాయి రాజధాని కావాలనుకున్నప్పుడు చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం రెండు సంవత్సరాల తర్వాత వైసిపికి పట్టు ఉన్న గ్రామాల రైతులు నన్ను కలిశారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటాము అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు ఆ రైతులకు నేను అండగా నిలబడ్డాను. తెలుగుదేశం ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రయోగించి రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటుంటే మేము అడ్డుకున్నాం. నేను భూ సేకరణ చేయవద్దు అంటే చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇప్పుడు కూడా రైతులకి అండగా నిలబడతాం.

•ప్రభుత్వ ప్రకటనతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి

ప్రభుత్వం రాజధాని మార్చేస్తానని చెప్పడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. వాస్తవానికి కొత్త ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇవ్వాలి అనుకున్నాం. 90 రోజులకే జగన్ రెడ్డి పాలనపై  ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేను 90 రోజులకే రోడ్డు మీదకి వచ్చేలా మీరే చేశారు. జగన్ రెడ్డి వైసిపి అధినేత పాలన సాగిస్తున్నారు. తనను తాను ముఖ్యమంత్రిగా భావించడం లేదు.  ఈ ప్రాంత రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ఓ పార్టీకి ఇవ్వలేదు.

ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా స్పష్టమైన ప్రకటన  చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు. అలా అని ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రజలు తిరుగులేని విజయాన్ని అప్పగించినా జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నట్టు కనబడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంచి చేస్తారని సిఎం పదవి అప్పగిస్తే ప్రజా సమస్యలన్ని పట్టించుకోవడం లేదు.

ఇంత మెజారిటీ వచ్చిన ప్రభుత్వం రాజధాని మారుస్తుందని నేను భావించడం లేదు. 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నాయకులు దొనకొండలో భూములు కొనుక్కున్నారని  ప్రజలు అనుకుంటున్నారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి. గత పాలకులు అక్రమాలు చేసారంటూ  రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు. అవినీతి జరిగిందని తేలితే విచారణ జరిపించండి. రుజువైతే చర్యలు తీసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం మాదిరి వైసీపీ ప్రభుత్వంలో కూడా రాత్రులు ఇసుక అమ్ముకుంటున్నారు.

•నాడు భూ సేకరణ వ్యతిరేకించాం.. నేడు రాజధాని మార్పుని వ్యతిరేకిస్తున్నాం

గతంలో నేను రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని పోరాడాను తప్ప అమరావతిలో రాజధాని వద్దు అనలేదు.  ఒక్క సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ 14 సామాజిక వర్గాల వారు భూములు ఇచ్చారు. రాజధాని మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే గతంలో రైతులకు ఎలా అండగా నిలబడ్డానో అలానే రైతులకు అండగా నిలబడతాను. గతంలో భూ సేకరణను వ్యతిరేకించాం, ఇప్పుడు రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాం. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఎంతవరకైనా వెళ్తాం. అవసరం అయితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలను కలుస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. రైతుల త్యాగాలు వృథా పోనీయం. వారికి జనసేన అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.

•రాజధాని పర్యటన ప్రారంభమైందిలా..

మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు నుంచి రాజధానికి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభమయ్యింది. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలుకగా, గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజధాని మార్పు నిర్ణయంపై ఆ గ్రామస్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. కురగల్లు జంక్షన్ సమీపంలో మల్లి, జాజి తోటలను పరిశీలించి, కూలీలతో మాట్లాడారు.

•కురగల్లులో పాదయాత్ర

అనంతరం కురగల్లు గ్రామంలోపవన్ కల్యాణ్ ప్రజలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. గ్రామంలో నడుచుకుంటూ ఇళ్ల వద్దకు, స్థానికంగా ఉన్న హోటళ్ల వద్దకు వెళ్లి వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అభివృద్ది చేస్తారని ఓట్లు వేస్తే, ఇప్పుడు అసలుకే మోసం వచ్చిందంటూ రాజధాని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ రోడ్లు మొత్తం తవ్వేశారని, ప్రభత్వం మారిన తర్వాత అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వెయ్యి నుంచి రూ. 1500లకి దొరికిన ఇసుక ఇప్పుడు రూ. 8 వేలకు వెళ్లిందని, సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని నిర్మాణం పనులు సాగుతున్న సమయంలో రోజుకి రూ. 5వేలు అమ్మే హోటల్, ఇప్పుడు వెయ్యి రూపాయిలకు అమ్మకాలు పడిపోయాయని ఓ హోటల్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుంచి పనులు లేక అప్పులు చేసి బతుకుతున్నామని భవన నిర్మాణ కార్మికులు పవన్ కల్యాణ్ ఎదుట వాపోయారు. రోడ్డు మీద అస్తవ్యస్తంగా ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ పవన్ కల్యాణ్ పరిశీలించారు.

ఎన్నికల ముందు భూమి ధర గజం రూ. 27 వేలు పలికిందని, ఇప్పుడు రూ. 10 వేలకు కూడా కొనేవారు లేరని కురగల్లు వాసులు తెలిపారు. పేరుకే రాజధాని అని వాడుక నీటిని సైతం డ్రమ్ము రూ. 50కి కొనుక్కోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చాం తప్ప, ఓ పార్టీకి ఇవ్వలేదని తెలిపారు. రాజధాని తరలిస్తామంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని, ప్రాణ త్యాగానికైనా వెనుకాడమని తెలిపారు. సగం సగం పనులు చేసిన భూముల్లో ఇప్పుడు తాము ఏమిచేయాలని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అండగా నిలబడితే, తాము పోరాటం చేస్తామని కురగల్లు వాసులు చెప్పారు.

•కొండవీటి వాగు వంతెన వద్ద...

అనంతరం ఐనవోలు ఎస్.ఆర్.ఎం కాలేజీ వద్ద రహదారి నిర్మాణం, కొండవీటి వాగు వంతెన నిర్మాణం పనులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. అక్కడ స్థానిక రైతులతో మాట్లాడారు. కొండవీటి వాగు కాలువ విస్తీర్ణం గతంలో 10 మీటర్లు ఉంటే ఇప్పుడు దాన్ని 100 మీటర్లకు పెంచారని, 5 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని ఆయనకు వివరించారు. భారీగా వరదలు వస్తే హాఫ్ టి.ఎం.సికి మించి నీరు వచ్చిన దాఖలాలు గత వందేళ్లలో లేవని తెలిపారు. మొన్నటి వరదల కారణంగా రాజధాని 29 గ్రామాల్లో ఏ గ్రామంలోనికి నీరు రాలేదన్న విషయాన్ని రామారావు అనే రైతు జనసేనాని ముందు ఉంచారు.

•బొత్స సీఎమ్ అయితే రాజధానిని విజయనగరం తీసుకువెళ్తారా 

తుళ్ళూరులో రైతాంగం, ప్రజానీకంతో మాట్లాడుతూ “ప్రభుత్వం మారినపుడల్లా రాజధాని మారుస్తాము అంటే ఎలా? బొత్స సత్యనారాయణ గారు రేపు సీఎమ్ అయితే రాజధానిని విజయనగరం తీసుకువెళ్తాం అంటారు. రాజధాని నగరంలో నిర్మాణాలను ప్రజాధనంతో చేస్తున్నారు. అంతేగానీ జగన్, బొత్స జేబుల్లోని డబ్బులతో కట్టడం లేదు. రాజధాని కోసం చేసిన రుణాలను కూడా ప్రజాధనంతో తీర్చాల్సిందేగానీ జగన్, బొత్స వారసులు కట్టరు. బొత్స గారు నాకు బాగా తెలుసు కాబట్టే చెబుతున్నాను... మీరు జగన్ మాయలో పడొద్దు. రైతులు, ప్రజలు ఇబ్బందిపడుతున్నారు కాబట్టే పర్యటిస్తున్నాను.

నేను ఎప్పుడు రైతులు, ప్రజల పక్షమే ఉంటాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన తప్పు ఏమిటంటే రాజధాని నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయలేకపోయారు. అమరావతి నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం విచారించాలిగానీ రాజధాని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దాన్ని తరలిస్తామంటే మేము ఒప్పుకోము” అన్నారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు శ్రీనివాస యాదవ్, మనుక్రాంత్ రెడ్డి, చిల్లపల్లి శ్రీనివాస్, పోతిన మహేశ్, బత్తిన రాము, గాంధీ, కళ్యాణం శివ శ్రీనివాసరావు, గద్దె తిరుపతి రావు, అమ్మిశెట్టి వాసు, అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases