పీవీ సింధును అభినందించిన సీఎం కేసీఆర్!

Related image

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సీఎం అన్నారు.

పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. తనకు వచ్చిన మెడల్ ను సీఎం కేసీఆర్ కు పీవీ సింధు చూపించారు. రెండు రాకెట్లను సీఎంకి బహుకరించారు. సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సీఎం సన్మానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

‘‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరుగా నిలిచారు. ఇది మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం కాదు. స్వతహాగా జాతీయ క్రీడాకారులైన రమణ దంపతులు తమ కూతురును గొప్పగా తీర్చిదిద్దారు. గోపీ చంద్ చక్కగా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలి. ఒలంపిక్స్ కు వెళ్లాలి. భవిష్యత్తు టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

More Press Releases