రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి: పవన్ కల్యాణ్

Related image

  • రైతుల పోరాటానికి జనసేన మద్దతు  

  • ఈ నెల 30, 31 తేదీల్లో అమరావతిలో పర్యటిస్తా

  • అమరావతి రైతుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా.. నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. ఇది రాజధాని కోసం భూములిచ్చిన 28 వేల రైతు కుటుంబాల సమస్య కాదని, యావత్తు రాష్ట్ర ప్రజల సమస్యని పేర్కొన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంత  రైతులు వచ్చారు. పవన్ కల్యాణ్ తో సమావేశమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తం ఇవ్వలేదనీ, రాజధాని గురించి మంత్రులు, అధికార పక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం అమలు చేయాలి. దానిలో ఏమైనా అవకతవకలు ఉంటే సరిదిద్దాలి తప్ప మొత్తానికి రాజధానినే మార్చేస్తాం అంటే ప్రభుత్వం, ప్రభుత్వ విధివిధానాలపై ప్రజలకు నమ్మకం పోతుంది. కొందరు వ్యక్తులకు అధికారం ఇచ్చాక వారు తీసుకున్న నిర్ణయాలకు మనం బందీలం. రాష్ట్రం విడగొట్టినా, డీమానిటైజేషన్ అంటూ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకొని తీరాల్సి వచ్చింది. వేరే దారి లేదు. అలాగే గత ప్రభుత్వం రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు మంచో చెడో దానికి అందరం కట్టుబడి ఉండాలి.

అభివృద్ధి కోసం వెచ్చించింది ప్రజల డబ్బే:

మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులను గందరగోళానికి గురి చేసే ప్రకటనలు చేయకూడదు. అలా చేస్తే రాష్ట్రానికే కాదు దేశం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. ఒకసారి రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేశారు. మళ్లీ ఇప్పుడు రాజధాని అమరావతి కాదు ఇంకొక చోట అంటే మన ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజధాని అమరావతిలో ఏం అభివృద్ధి జరిగిందో నాతో సహా రాష్ట్రంలో చాలామందికి తెలియదు. అక్కడ ఏం చేశారో తెలియాలి. ఇప్పుడు రాజధాని మారిస్తే అభివృద్ధి కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులు ఏమవ్వాలి.

అభివృద్ధి కోసం వెచ్చించిన డబ్బు ప్రజల సొమ్ము.. మంత్రులు, ముఖ్యమంత్రుల డబ్బు కాదు. ఈ నెల 30, 31 తేదీల్లో పార్టీ నాయకులతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించి ఎంత అభివృద్ధి జరిగిందో స్వయంగా చూసి ప్రజలకు తెలియజేస్తాం. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పోరాటానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. మూడు పంటలు పండే భూములను రైతులు ప్రభుత్వానికి ఇచ్చి త్యాగాలు చేశారు. వారి త్యాగాలను వృథా కానివ్వమ"ని స్పష్టం చేశారు.

మంత్రుల ప్రకటనలు కలవరపెడుతున్నాయి:

అంతకు ముందు అమరావతి రైతులు పవన్ కల్యాణ్ కు తమ సమస్యలు వివరిస్తూ.. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 29 గ్రామాలకు చెందిన రైతులం స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం. 28 వేలకు పైగా కుటుంబాలు ఈ భూముల మీద ఆధారపడి ఉన్నాయి. ముఖ్యమంత్రి, గవర్నర్ బంగ్లాలు, అసెంబ్లీ మినహా రాజధానికి సంబంధించి అన్ని కట్టడాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి పనులు మొత్తం నిలిపివేశారు. ఒప్పందం మేరకు మాకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు ఇవ్వ లేదు. ఇప్పుడు వరద ముంపు ప్రాంతం అన్న నెపం చూపి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు చేస్తున్న ప్రకటనలు మా ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి.

కొండవీటి వాగుకి 1903వ సంవత్సరం తర్వాత గ్రామాలను ముంచెత్తే స్థాయి వరదలు వచ్చిన దాఖలాలు లేవు. ఆ తర్వాత 16 వేల క్యూసెక్కుల వరద ఎప్పుడూ రాలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  కూడా ఆ విషయాన్ని అంగీకరించింది. కృష్ణా నదిలో ఉద్దేశపూర్వకంగా పరిమితికి మించి నీటిని నిల్వ చేయడం వల్ల లంకల్లోకి మాత్రమే నీరు వచ్చింది. రాజధాని ప్రాంతం ఉన్న 29 గ్రామాల్లో ఎక్కడా వరద వచ్చిన దాఖలాలు లేవు. ఇంత జరిగాక రాజధానిని ఎక్కడకు తరలిస్తారో అన్న ఆందోళన భూములు ఇచ్చిన ప్రతి రైతులో ఉంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానిని మారుస్తూ పోతే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకంపోతుంది. మేం రాష్ట్రం బాగు కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చాంగానీ, ఓ పార్టీకి ఇవ్వలేదు.

రాజధానికి ఇచ్చిన భూములు కూడా ఓ కులానికి చెందిన వారివి కాదు. భూములు కోల్పోయిన వారిలో 11 కులాల రైతులు ఉన్నారు. రైతుల పక్షాన నిలిచే నాయకుడిగా పవన్ కల్యాణ్ కి పేరుంది. మీ సాయం మాకు కావాలి. మీ వెనుక మేమంతా ఉంటాం. ఒకసారి రాజధాని ప్రాంతంలో పర్యటించి మాకు న్యాయం చేయండి" అంటూ విన్నవించారు. రైతుల తరఫున మాదల రాజేంద్ర, ధనేకుల రామారావు, లంకా సుధాకర్, దామినేని శ్రీనివాస్, పోతురాజు శ్రీనివాస్, బెజవాడ నరేంద్ర, పానకాలు గోపాలం, చలపతిరావు తదితరులు సమస్యలను పవన్ కల్యాణ్ ఎదుట ఉంచారు. రైతుల వెంట జనసేన నాయకులు గద్దె తిరుపతి రావు, కళ్యాణం శివశ్రీనివాసరావు(కె.కె.) ఉన్నారు.

More Press Releases