మగ్గంపై నూతన డిజైన్లను ఆవిష్కరించండి: ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు

Related image

  • ముతక వెరైటీలకు కాలం చెల్లింది
  • చేనేతను ఇష్టపడుతున్న యువత
  • వారిని మెప్పించేలా డిజైన్లు రూపకల్పన
  • రాబోయే కాలం చేనేతకు స్వర్ణయుగమే
  • చేనేత సంఘాల బలోపేతానికి కృషి
  • ఆప్కో మెగా షోరూమ్ ల విస్తరణ
విజయవాడ: కాలం చెల్లిన ముతక వెరైటీలకు స్వస్తి పలికి మగ్గంపై నూతన డిజైన్లకు నాంది పలకాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయం చేనేత భవన్ లో గురువారం కృష్ణా జిల్లాలోని చేనేత సహకార సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో యువత, మహిళలు చేనేతను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, ఇది చేనేత వర్గాలకు ఎంతో శుభసూచకమని తెలిపారు. వారి అభిరుచికి తగ్గట్టుగా నూతన వెరైటీలు, సరికొత్త డిజైనులకు రూపకల్పన చేయాలని సూచించారు. డిజైన్లు, రంగులు, బుటాలు, బోర్డర్ల విషయంలో జాగ్రత్తలు వహించి స్వల్ప మార్పులు చేయ టం ద్వారా ఆప్కో తరపున నూతన డిజైన్లు, మోడళ్ళు ఇవ్వగలగాలన్నారు.

ఆప్కో ద్వారా ఇచ్చిన కొత్త డిజైన్లు నేయించగలిగితే సొసైటీల వద్ద ఉన్న పాత స్థాకుకు సైతం విలువ జోడించగలుగుతామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి బిల్లులు కూడా త్వరితగతిన విడుదలయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా షో రూములను మరింతగా విస్తరించి చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, వస్త్ర విక్రయాలను పెంచుతామని చిల్లపల్లి చెప్పారు. చేనేత వర్గాలకు మాతృ సంస్థ అయిన ఆప్కోను కాపాడుకుంటేనే చేనేత మనుగడ సాగించగలుగుతుందని, అందుకోసం ప్రతిఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.

జిల్లాలోని చేనేత సహకార సంఘాల వారు నేయిస్తున్న డిజైన్లను చైర్మన్ మోహనరావు పరిశీలించారు. ఈ సమావేశంలో ఆప్కో జీఏం లేళ్ల రమేష్ బాబు, వీవర్స్ సర్వీస్ సెంటరు ఏడీ హిమజ్ కుమార్, డీఏంఓలు, ఏడీలు, సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

More Press Releases