జీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: తెలంగాణలోని జీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. మంగళవారం రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లబు భాయ్ కతిరియా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యులు స్వామీ దాస్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ రకాల జీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని వివిరించారు. ముఖ్యంగా జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్ళాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి లక్ష్యం మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా వివిధ సంస్థలు, ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలలోని ఆవులకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు పశుగ్రాసం కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

గో జాతి అభివృద్ధి, సంరక్షణ కోసం మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో మామిదిపల్లిలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు పశుపాలన, పాడి అభివృద్ధి, పశుగ్రాస పెంపకం వంటి అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆవుల ద్వారా లభించే గోమూత్రం, పేడతో గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ వనరుగా మార్చుకోవడం, వాటి వలన కలిగే ప్రయోజనాలపై కూడా శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

గోమూత్రం, పేడను సేంద్రీయ ఎరువుగా ఉపయోగించడం వలన కలిగే లాభాలపై కూడా శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రీయ కామధేను ఆయోగ్ సహకారంతో అమలు చేస్తున్న వివిధ పథకాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలుకు గల సాద్యాసాధ్యాలని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సమాంతరంగా వృద్దిలోకి వస్తున్న పాడి రంగానికి మరింత చేయూతనిచ్చేందుకు, దీనిపై ఆధారపడిన రైతాంగానికి అదనపు ఆదాయ వనరుగా మార్చేందుకు అవసరమైన ఆర్ధిక, సాంకేతిక సహకారాన్ని అందజేయాలని మంత్రి చైర్మన్ కతిరియాను కోరారు.

గో మూత్రం, పేడతో బయోగ్యాస్ ప్లాంట్ ల ఏర్పాటు, అగర్ బత్తీలు, సబ్బులు, ఔషదాల తయారీకి అవసరమైన శిక్షణ, ఆర్ధిక సహకారం అందించాలని మంత్రి కోరారు. గోశాలలలో సేకరిస్తున్న గోమూత్రం, పేడను ఉపయోగించడం ద్వారా చిన్న చిన్న బయోగ్యాస్ ప్లాంట్ ల ఏర్పాటు, ఇతర ఉత్పత్తుల తయారీ చేపట్టడం వలన గోశాలలు ఆర్ధికంగా అభివృద్దిని సాధించేందుకు అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అందుకోసం త్వరలో పెద్ద గోశాలల నిర్వహకులతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అమోఘంగా ఉన్నాయని చైర్మన్ వల్లబు భాయ్ కతిరియా ప్రశంసించారు. గోవుల పెంపకాన్ని ప్రోత్సహించడం వలన రైతులకు అనేక రకాల ఉపయోగాలు లభిస్తాయని కతారియా వివరించారు. గోవు నుండి వచ్చే పాలు మాత్రమే కాకుండా గో మూత్రం ద్వారా అనేక రకాల ఔషదాలను ఉత్పత్తి చేయవచ్చని, ఆవు పేడతో అనేక పరికరాలను ఉత్పత్తి చేసి విక్రయించు కోవడం ద్వారా ఆర్ధికంగా పెంపకం దారులు ఎంతో అభివృద్దిని సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రికి ఆయన ఆవుపేడతో తయారు చేసిన వాచీని అందజేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలు వీటిని సద్వినియోగం చేసుకొని లబ్ది పొండుతున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ రంగంలో వారిని ప్రోత్సహించాలని కోరారు.

పాఠశాల స్థాయి నుండే విద్యార్ధులకు ఆవులు, గేదెల యొక్క ప్రాధాన్యత మరియు వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడానికి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్రంలో విద్యార్ధులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

More Press Releases