ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు త్వరలోనే ఎక్స్ గ్రేషియా: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను త్వరలోనే అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు.

ఇటీవల గంగపుత్ర సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశాలలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి గంగపుత్ర సంఘం ప్రతినిధులకు సూచించారు. మంత్రి సూచనల మేరకు జేఏసీ గా ఏర్పడిన అనంతరం ఈ రోజు గంగపుత్రులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో మత్స్యకారుల బాగోగులను పట్టించుకోలేదని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని చెప్పారు.

మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులకు మేలు చేయాలని, వారు అభివృద్ధి చెందాలనే తపనతో ఎవరు అడగకుండానే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.

రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు, కొండపోచమ్మ, సుందిళ్ళ తదితర నూతన ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పెద్ద ఎత్తున మత్స్య సంపద పెరిగిందని, పెరిగిన సంపదను ఈ వృత్తిలోని వారి అందరికి అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించుకోనేలా సబ్సిడీ పై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాలీలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అంతేకాకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో అందుబాటు ధరలో చేపలను విక్రయించేందుకు సబ్సిడీపై మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ను జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఔట్ లెట్స్ తో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలలో కూడా ఈ ఔట్ లెట్స్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నందున చెరువులపై మత్స్యకారులకే అధికారాలు ఉంటాయని, దళారీ వ్యవస్త నిర్మూలనకు కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. సంఘ సభ్యులు సమిష్టిగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటైన సమితి సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దీటి మల్లయ్య మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని, తమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు. గంగపుత్రులు ఉన్న చోట గంగపుత్రులకే సభ్యత్వం కల్పించాలని, గంగ తెప్పోత్సవంను అధికారికంగా నిర్వహించాలని, మత్స్యకారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, గంగపుత్ర ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలని ఇంకా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఈ సందర్భంగా మంత్రికి అందజేశారు.

త్వరలోనే మరో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ హన్మంతరావు, కన్వీనర్ యాదగిరి, కోశాధికారి గడ్డం సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.

More Press Releases