పార్లమెంట్ ను పోలిన పీఠం.. 125అడుగులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు: మంత్రి కొప్పుల ఈశ్వర్

Related image

  • రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125అడుగుల విగ్రహం ఏర్పాటు
  • కొత్తగా కడుతున్న సచివాలయం సమీపాన 11.4ఎకరాలలో
  • అంబేద్కర్ విగ్రహాలలో దేశంలోనే అతిపెద్దది
  • అంబేద్కర్ స్పూర్తితో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కెసిఆర్ చిత్తశుద్ధితో పాటుపడుతున్నారు
  • కెసిఆర్ అనుమతితో త్వరలో టెండర్లు పిలిచి, వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేస్తాం
  • విగ్రహం ఏర్పాటు పై సచివాలయంలో గురువారం అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కొప్పుల
హైదరాబాద్: రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున 125అడుగులతో ఏర్పాటు చేస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. నగరం నడిబొడ్డున కొత్తగా కడుతున్న సచివాలయానికి సమీపాన సువిశాలమైన 11.4ఎకరాలలో గొప్పగా ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు అధికారులతో సమీక్ష జరిపినట్లు మంత్రి చెప్పారు.

దేశంలోని అంబేద్కర్ విగ్రహాలలో ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. దీనిని దేశం అబ్బురపడే విధంగా ఏర్పాటు చేస్తామని, పరిసరాలను పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. 50అడుగుల ఎత్తులో పార్లమెంట్ ను పోలిన పీఠం నిర్మించి, దానిపై 125అడుగుల విగ్రహాన్ని నిలుపుతామని, దీని మొత్తం ఎత్తు 175 అడుగులని మంత్రి  కొప్పుల వివరించారు. పీఠం నిర్మాణం తయారీకి రాజస్థాన్ లోని ధోల్ పూర్ కు చెందిన శాండ్ స్టోన్ ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు.

146కోట్ల 50లక్షల రూపాయలు వెచ్చించి అవసరమైన అన్ని నాణ్యతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మకంగా రూపొందనుందన్నారు. ఇందులో మ్యూజియం, అంబేద్కర్ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలకు సంబంధించిన ఫోటోల ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్, ఆయన అధ్యయనం చేసిన, రచించిన, ఆయన గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలతో కూడిన గ్రంథాలయం ఏర్పాటవుతుందన్నారు. అలాగే ధ్యానమందిరం, అంబేద్కర్ జీవిత విశేషాలతో రూపొందించిన లేజర్ షో, సమావేశ మందిరం, క్యాంటీన్ సువిశాలమైన పార్కింగ్, వాష్ రూములు తదితర ఏర్పాట్లు ఉంటాయని మంత్రి చెప్పారు.

ఈ స్పూర్తి కేంద్రం అన్ని వర్గాల ప్రజల ఆత్మ గౌరవం మరింత పెంపొందేలా, భావితరాలకు స్పూర్తినిచ్చే విధంగా అత్యద్భుతంగా రూపుదాల్చనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ తో హైదరాబాద్ నగరంతో పాటు, కేసీఆర్ పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠ మరింత పెరుగుతాయని కొప్పుల చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బి ఇఎన్సి ఐ.గణపతిరెడ్డి, షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఎండి కరుణాకర్, ఢిల్లీకి చెందిన కన్సెల్టెన్సీ కంపెనీ డిజైన్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

విగ్రహ నమూనా, ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించిన అన్ని అంశాలను మంత్రి నిశితంగా పరిశీలించారు. కన్సెల్టెన్సీ కంపెనీ ప్రతినిధుల నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సమీక్షకు సంబంధించిన అంశాలన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించి టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకోనున్నట్లు ఈశ్వర్ పేర్కొన్నారు. త్వరలో టెండర్లను పిలిచి ఏడాదిలోగా విగ్రహం ఏర్పాటు పూర్తవుతుందని మంత్రి చెప్పారు.

More Press Releases