యువత జాతీయవాదాన్ని.. మానవతావాదాన్ని అలవరచుకోవాలి: పవన్ కల్యాణ్

Related image

  • జాతీయ సమగ్రత పెంపొందించాలి 
  • త్యాగధనుల చరిత్ర తెలియకే నాయకులు అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారు
  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
  • మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారత జాతిని ఏకం చేసే రెండు పండగలే జనసేన పార్టీ ముఖ్య పండగలని, మొదటిది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, రెండోవది జనవరి 26 రిపబ్లిక్ డే అని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎంతోమంది త్యాగధనులు జైళ్లలో మగ్గి, ప్రాణాలు తృణప్రాయంగా త్యజించి మనకు ఈ పర్వదినోత్సవాలను అందించారన్నారు. ఆ త్యాగధనుల స్ఫూర్తిని గుండెల్లో నింపుకొంటూ, వారు కోరుకున్న జాతీయవాదాన్ని జనసేన పార్టీ మరింత ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ వేడుకకు జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు హాజరై త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు.

అనంతరం జనసేన శ్రేణులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒక రోజు జరుపుకొంటే సరిపోదు. కనీసం వారం రోజులపాటు జరగాలి. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి వారం రోజుల ముందు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించి, అనంతరం జెండా పండుగ చేసుకోవాలి. ఇదే నా కల. ఇలా చేయడం వల్ల కొత్త తరానికి దేశం గొప్పతనం, సమరయోధుల త్యాగాల విలువ తెలుస్తాయి. ముందు ముందు అలాంటి రోజులు రావాలని ఆశిస్తున్నాను.

•అణువణువునా దేశభక్తి నిండిన పార్టీ... జనసేన

కొంతమంది రాజకీయంగా ఎలా బతకాలో మీకు తెలియదండి అంటుంటారు. రాజకీయంగా ఎలా బతకాలో తెలిసినోళ్లు దేశాన్ని అవినీతిలో కూరుకుపోయేలా చేశారు. బతకనేర్చిన రాజకీయం తెలియక కాదు.. గుండెల్లో దేశభక్తిని నింపుకొన్నవాడిగా, అవకతవక రాజకీయాలు చేయకూడదని నిబద్ధతో ఉన్నాను. దేశం కోసం ఏమీ ఆశించకుండా నిలబడ్డ పార్టీలు, వ్యక్తులు ఉన్నారని రేపటి తరానికి చెప్పడానికే నా ప్రయత్నం. ఓటమి ఎదురైతే ఏ పార్టీ అయిన చిగురుటాకులా వణికిపోతుంది. కానీ బలమైన భావజాలం, జాతీయభావం, మానవతావాదం ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిటారుగా నిలబడుతుంది. ఆ లక్షణాలు జనసేన పార్టీకి పుష్కలంగా ఉన్నాయి. దేశభక్తిని అణువణువునా జనసేన పార్టీ నింపుకొంది. దేవుడిని ఎంత మొక్కుతానో తెలియదుగానీ దేశాన్ని మాత్రం ప్రతి క్షణం స్మరిస్తాను. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగధనులు ప్రాణాలు అర్పించారు. వారి చరిత్ర తెలుసుకోకపోవడం వల్లే ఇప్పుడున్న నాయకులు అవినీతికి, అరాచ‌కాల‌కు పాల్పడుతున్నారు. చరిత్రను అర్థం చేసుకొని ఉంటే ఇలా ప్రవ‌ర్తించే వారు కాదు.

విదేశీయులు వచ్చి మనల్ని ఇబ్బందిపెడుతుంటే వాళ్లను ఎంతో గుండె ధైర్యంతో ఎదుర్కొన్నాం. ఇవాళ సొంత ప్రజలనే ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు. డబ్బుతో కూడిన రాజకీయాలను మీరు ఎదుర్కోగలరా అని కొంతమంది నన్ను అడుగుతున్నారు.. వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాటం చేసిన వ్యక్తులకు ఎన్ని కోట్లు ఉన్నాయి.? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లు ఏమైనా కోటీశ్వరులా..? టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒంటి మీద ఉన్న ఒక్క చొక్కాతోనే పోరాటం చేశారు. ఇలాంటి వ్యక్తులే జనసేన పార్టీకి స్ఫూర్తి. మ‌న జాతీయ జెండా రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య గారు, జాతీయ జెండా మ‌న‌కి ఇచ్చిన ఆయ‌న చివ‌రి రోజుల్లో తీవ్రమైన పేద‌రికంలో చ‌నిపోయారు. ఈ రోజు మ‌నం గుండెల‌కు హ‌త్తుకునే ఈ జెండా రూప‌క‌ర్తకు ఆ స్థితి రావడం చాలా బాధాక‌రం. ప్రాంతీయవాదం, కులవాదం, మతవాదం పేట్రేగిపోతే దేశం విచ్ఛిన్నమవుతుంది. మనలో మనం కొట్టుకుంటే జాతీయ సమగ్రత దెబ్బ తింటుంది. దానికి ఏకైక మందు జాతీయవాదమేనని ప్రధాని మోదీగారిని కలిసినప్పుడు చెప్పాను. ప్రాంతీయతత్వం, మతతత్వం, కులతత్వాలకు దేశం బలి కాకూడదంటే - యువత జాతీయవాదాన్ని, మానవతావాదాన్ని అలవరచుకొని, జాతీయ సమగ్రతకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

పార్టీ రాజ‌కీయ వ్యవ‌హారాల క‌మిటీ చైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ “జాతీయ ప‌ర్వదినం అయిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజ‌రైన కార్యక‌ర్తల‌కు హృద‌య‌పూర్వక  కృత‌జ్ఞత‌లు. రిపబ్లిక్ డే సందర్భంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఈ కార్యాల‌యంలో పార్టీ కార్యక‌లాపాలు ప్రారంభించ‌డం జ‌రిగింది. ఆనాటి నుంచి పార్టీని బ‌లోపేతం చేస్తూ నిర్విరామంగా ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటం చేస్తూనే ఉన్నాం. స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా మ‌హ‌నీయుల‌ త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారి అడుగు జాడ‌ల్లో న‌డుద్దామ”ని పిలుపునిచ్చారు.

More Press Releases