ముఖ్య‌మంత్రి గారి సొంత బాబాయ్ హ‌త్య కేసు ఏం చేశారు: పవన్ కల్యాణ్

Related image

•చిన్న విష‌యానికి మన ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు
•100 రోజుల మా మౌనాన్ని మీరే బ్రేక్ చేశారు
•మా హ‌క్కులు కాల‌రాయాల‌ని చూస్తే చేతులు ముడుచుకొని కూర్చోం
•ప్రభుత్వ మెడ‌లు వంచే స‌త్తా మ‌న‌ పార్టీకి ఉంది
•పార్టీలో ఇన్‌ఛార్జ్ అంటే ప‌దవి కాదు... బాధ్యత‌
•సొంత అజెండాలు ఉన్న వారు సంతోషంగా వెళ్లిపోవ‌చ్చు
•క‌మిటీల్లో క‌ష్టప‌డిన వారికి అవ‌కాశం ఇవ్వండి
•ఏలూరు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో జనసేన అధ్యక్షులు ప‌వ‌న్‌

మలికిపురంలో చోటు చేసుకున్నా చిన్న విష‌యానికి జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్యే మీద ఏడు కేసులు పెట్టారు.... అత్యంత కిరాత‌కంగా హ‌త్య‌కు గురైన వ్య‌క్తి కేసు విష‌యంలో మాత్రం ఈ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు అన్నారు. మా ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు… మరి ముఖ్య‌మంత్రిగారి సొంత బాబాయ్ వివేకానంద‌రెడ్డిని హత్య చేసిన కేసు ఏం చేశారో చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం ఏర్పాట‌యిన 100 రోజుల వ‌ర‌కు ఏ అంశం మీద మాట్లాడ వ‌ద్ద‌ని భావించినా మా మౌనాన్ని మీరే బ్రేక్ చేశారన్నారు. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశాల్లో భాగంగా బుధ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఏలూరు పార్ల‌మెంట్ సెగ్మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ... “నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప‌త్రికా సంపాద‌కుడ్ని కొట్టి కారులో వేసుకుని తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే అత‌న్ని వ‌దిలేశారు. ఓ చిన్న‌పాటి విష‌యంలో డ‌యాల‌సిస్ పేషెంట్‌ని వ‌దిలేయ‌మ‌ని అడిగేందుకు ఎమ్మెల్యే హోదాలో రాపాక వరప్రసాద్ గారు వెళ్తే ఆయనపట్ల పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు అసంతృప్తి క‌లిగించింది. ఇలాంటి విష‌యాల్లో పోలీసులు సంయ‌మ‌నం పాటించాలి.

•జనసేన భయపడదు

నిన్న రాజోలు వెళ్లిపోదామ‌నుకున్నా. ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని కూడా భ‌య‌పెడ‌దామని చూస్తే ఎలా..?  మీ చ‌ర్య‌ల‌కు టీడీపీ భ‌య‌ప‌డుతుందేమోగానీ జ‌న‌సేన మాత్రం భ‌య‌ప‌డ‌దు. ఈవీఎంల‌లో తేడాలు జ‌రిగాయో…  ఇంకా ఏదైనా జ‌రిగిందో మాకు అన‌వ‌స‌రం. మీరు ప్ర‌భుత్వాన్ని స్థాపించారు. ఆ గౌర‌వం మాకు ఉంది. దాన్ని మీరు కాపాడుకోండి. మా హ‌క్కులు కాల‌రాయాల‌ని చూస్తే మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోం. రోడ్ల మీద‌కి వ‌స్తాం. అలాంటి ప‌రిస్థితులు వ‌చ్చే ప‌నులు చేయవద్దు. మీరు ప్ర‌జ‌ల‌కి మేలు చేసే కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామంటే చేయండి.

దానికి మా వంతు స‌హ‌కారం అందిస్తాం. ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న టీడీపీని వ‌దిలేసి ఒక్క ఎమ్మెల్యే ఉన్న మ‌న పార్టీ మీద‌, కార్య‌క‌ర్త‌ల మీద వేధింపులు ఎందుకు.? మ‌న‌మంటే భ‌యం. 2014లో జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు ఒక జ‌ఠిల‌మైన స‌మ‌స్య గురించి మాట్లాడేందుకు ఎవ్వ‌రికీ ధైర్యం లేని ప‌రిస్థితుల్లో నేను ధైర్యంగా మాట్లాడా. నేను అధికార దర్పం కోసం రాజ‌కీయాల్లోకి రాలేదు. అదే అధికారంతో ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింప‌డానికి వ‌చ్చాను. అదేమంటే ప్ర‌శ్నించ‌డానికి వ‌చ్చిన పార్టీ, ప్ర‌శ్నిస్తూనే ఉంటారు అంటూ విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌శ్నించ‌డ‌మే అంతిమ ల‌క్ష్యం కాదు. ప్ర‌శ్నించ‌డం అనే మార్గం ద్వారా మీ త‌ప్పులు ఎత్తి చూపుతూ ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకువ‌చ్చి అధికారం చేజిక్కించుకుంటాం. మారుమూల ఉన్న మీకు ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా మీద విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు మీరు మాట్లాడండి.

•వ్యక్తిగ‌త స్వార్ధంతో వ‌చ్చేవారికి అవ‌కాశం ఇవ్వొద్దు

క‌మిటీల నియామ‌కం విష‌యంలో పార్టీ నుంచి కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేస్తాం. పార్టీ నిర్మాణం అంటే ఆషామాషీగా చేసేది కాదు. బ‌ల‌మైన భావ‌జాలం కోసం  స‌ర్వ‌స్వాన్ని త్యాగం చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన వారు కావాలి. ఒక‌రిని స్టేష‌న్‌లో పెడితే వారిని తీసుకువ‌చ్చే స్థాయి మీకు ఉండాలి. వంద మందిని ఒక చోట కూర్చోబెట్టి అల్ల‌రి చేయ‌కుండా చూసే సామ‌ర్ధ్యం ఉన్నవారు ఉన్నారు. అలాంటి సామ‌ర్ధ్యం ఉన్న వ్య‌క్తులు వ‌చ్చిన‌ప్పుడు నిర్మాణం జ‌రుగుతుంది. ఎలా ప‌డితే అలా చేయబోను. ముఖ్యంగా కొంతమంది వ్య‌క్తిగ‌త స్వార్ధం కోసం నా చుట్టూ తిరిగి, నాకు జేజేలు కొట్టి చివ‌ర్లో వైసీపీ, టీడీపీల‌కు మ‌ద్ద‌తు పలికిన వారు ఉన్నారు. అలాంటివారిని క‌మిటీల్లో ప‌క్క‌న పెట్టేయండి. ముఖ్యంగా ఏలూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో అలాంటి వారు ఉన్నారు. వారు తిరిగి వచ్చి న‌మ‌స్కారాలు పెడుతున్నారు. వారికి మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్దు. అందుకు సంబంధించి బ‌ల‌మైన ఆదేశాలు కూడా పోలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీకి ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

•కమిటీలను ఓ కులంతో నింపేయవద్దు

ఏలూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ముందు ఇన్ చార్జిలను నియ‌మించ‌డం జ‌రుగుతుంది. మీరంతా క‌ష్ట‌ప‌డిన వారిని గుర్తించి అవ‌కాశం క‌ల్పించండి. ఎక్క‌డా పార్టీని ఓ కులంతో నింపేయ‌వ‌ద్దు. నేను కులాన్ని న‌మ్ముకుని రాలేదు. కులాల‌ను అర్ధం చేసుకుని వ‌చ్చాను. ప్ర‌స్తుతం మ‌న ముందు చ‌క్క‌టి అవ‌కాశం ఉంది. ఈసారి మ‌నం చేసుకోలేక‌పోయాం అన్న ప‌రిస్థితులు క‌ల్పించ‌వ‌ద్దు. రేపు ఎన్నిక‌లు ఉన్నా ఈ రోజు సిద్ధంగా ఉండేలా ప్ర‌తి ఒక్క‌రి చ‌ర్య‌లు ఉండాలి. పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాలు పూర్త‌య్యాక ఓ నిర్ణీత స‌మ‌యం కేటాయించి క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను క‌లుస్తాం. నియోజ‌క‌వ‌ర్గానికి 25 మందిని గుర్తించి, అంద‌ర్నీ ప్ర‌త్యేకంగా క‌ల‌సి మీ నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తాం. అంతా వ్య‌క్తిగ‌త అజెండాలు మాని పార్టీ అజెండాని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషి చేయాలి.

•ఈలలు గోలలు ప్రభుత్వాన్ని తీసుకురాలేవు

ఈల‌లు గోల‌లు ప్ర‌భుత్వాన్ని తీసుకురాలేవు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తేనే ఫ‌లితం వ‌స్తుంది. రెండు సినిమా డైలాగులు చెప్పి చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌డానికి పార్టీ పెట్ట‌లేదు. దేశం మీద ఇష్టంతో ఓ బాధ్య‌త‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. ఈ ప్ర‌స్థానంలో సీరియ‌స్‌నెస్ లేకుండా న‌న్నో నిచ్చెనగా చేసుకుని ఎద‌గాల‌నుకునే వారిని చూశాను. జ‌యాప‌జ‌యాల‌ను స‌మంగా చూడ‌గ‌లిగిన వాడిని. రెండు త‌రాల‌కు వార‌ధి‌గా ప‌ని చేయాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చాను. ఓట‌మి ఎదురైతే నిల‌బ‌డ‌గ‌ల‌నా?  లేదా అన్న ఆలోచ‌న చేసిన త‌ర్వాతే వ‌చ్చాను. నేను గెలుపు ఓట‌ముల‌ను స‌మంగా చూడ‌గ‌ల‌ను. కొన్ని ద‌శాబ్దాల క్రితం దేశం కాని దేశంలో ఆఫ్రికా ఖండంలో రైల్లో నుంచి ఓ వ్య‌క్తిని బ‌య‌టికి గెంటేస్తే ఆ వ్య‌క్తికి వ‌చ్చిన కోపం. అదే మ‌హాత్మాగాంధీ దేశానికి తిరిగి వ‌చ్చి త‌న‌ని రైలు నుంచి గెంటేసిన బ్రిటీష్ వారిని మ‌న దేశం నుంచి త‌రిమేశారు. ఒక్క వ్య‌క్తి కోపానికి అంత‌టి శ‌క్తి ఉంది. ఏ ఒక్క‌రి కోపాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు. జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ఓట్లు మార్పు కోరుతూ వ‌చ్చిన ఓట్లు. ఒక్క వ్య‌క్తి కోపానికి అంత‌టి శ‌క్తి ఉంటే ఇన్ని ల‌క్షల మంది ఓట్లు వేస్తే మార్పు కచ్చితంగా వ‌చ్చి తీరుతుంది.

•సమాజ శ్రేయస్సు కోరేవారు జనసేన వీడరు

సొంత అజెండాలు ఉన్న వారు సంతోషంగా వేరే పార్టీలోకి వెళ్లి పోవ‌చ్చు. నిజంగా స‌మాజ శ్రేయ‌స్సు కోరుకునే ఏ ఒక్క‌రూ జ‌న‌సేన పార్టీని వీడ‌రు. ప్ర‌భుత్వాన్ని మెడ‌లు వంచి ప‌ని చేయించ‌గ‌లిగే శ‌క్తి మ‌న‌కి ఉంది. పోల‌వ‌రంకి సంబంధించి ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్నారు. నేను ఓ పిలుపు ఇస్తా. మ‌ద్ద‌తుగా వ‌చ్చిన వారంద‌రినీ స‌మ‌న్వ‌యప‌ర్చుకునే స‌త్తా మీకు ఉండాలి. ప్ర‌తి విష‌యానికీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాలేడు. స్థానికంగా ఉన్న నాయ‌కుల‌కు ప‌ని చేసే శ‌క్తి ఉండాలి. జ‌న‌సేన‌కి వ‌చ్చిన ఓట్లు 6 శాతం అంటున్నారు. శ‌క్తివంతులైన నాయ‌క‌త్వం ఉన్న బీజేపీకి వ‌చ్చింది 0.9 శాత‌మే. ఎలాంటి బ‌లమైన నాయ‌కులు లేకున్నా యువ‌త‌, మ‌హిళ‌లు మార్పు కోరుకుంటే జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ఓట్లు ఆరు శాతం. మొక్క కూడా ఒక్క రోజులో వృక్షం అయిపోదు.

మ‌నం ఎదిగే ద‌శ‌లో ఉన్నాం. పీఆర్పీ స‌మ‌యంలో కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా భ‌య‌పెట్టి న‌డ‌ప‌లేని పార్టీ అన్న ముద్ర వేశారు. న‌న్ను కూడా అలాగే భ‌యపెట్టాల‌ని చూశారు. మీకు ఇష్టం లేక‌పోతే వెళ్లిపోమ‌న్నాను.  నా ఆలోచ‌న ఒక్క‌టే. ఒక్క‌డికి గుండె ధైర్యం ఉంటే - కోట్లాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటుంది. నా ప్ర‌య‌త్నం ఈ స‌మాజంలో మార్పు కోసం. ఎవ‌రు తోడున్నా లేక‌పోయినా నా ప్ర‌య‌త్నాన్ని వ‌ద‌ల‌ను. ఎవ‌రికైనా మూడేళ్ల‌లో ముఖ్య‌మంత్రి అవ‌డం కుద‌ర‌దు. న‌ల్ల‌జాతి సూర్యుడు నెల్స‌న్ మండేలా ఐద‌డుగుల గ‌దిలో 25 ఏళ్ల పాటు ఒంట‌రిగా ఉండి పోరాటం చేసి సాధించారు. అదే స్ఫూర్తితో నేను ప‌ని చేస్తా. మీకోసం నేను ఉన్నాను అని చెప్ప‌డానికే పార్టీ పెట్టాను.

దెందులూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రూ పోటీ చేయ‌డానికి ముందుకు రాని ప‌రిస్థితుల్లో ఓ ఆడ‌ప‌డుచు ధైర్యంగా ముందుకు వ‌స్తే అవ‌కాశం ఇచ్చాను. రాజ‌కీయాల్లోకి కొత్త ర‌క్తం రావాల‌న్న‌దే నా ఉద్దేశం. నా కోసం, న‌న్ను చూసి చాలా మంది తెలంగాణ‌తోపాటు వివిధ దేశాల నుంచి వ‌చ్చి ఎన్నిక‌ల్లో ప‌ని చేశారు. అలా ప్రేమ‌తో వ‌చ్చిన వారిని త‌క్కువ‌గా అంచ‌నా వేయవద్దు. వారు గుర్తింపు కోసం చూడరు. ఆశ‌యాలు నిర్వీర్యం అవుతుంటే మాత్రం బాధ‌ప‌డ‌తారు. డ‌బ్బుతో కొనేద్దామంటే ఎన్ని వంద‌ల కోట్లు ఉన్నా చాల‌వు. హ‌క్కుల‌ను ఓట్ల రూపంలో అమ్మేసుకుంటున్నారు. అలా చేయ‌డం వ‌ల్ల.. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు అడిగే హ‌క్కు కోల్పోతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మార్పు అయితే వ‌చ్చింది. అది అధికారం ఇచ్చే స్థాయిలో రాలేదు. ఆరు శాతం ఓట్లు మాత్ర‌మే తీసుకురాగ‌లిగింది.

రేపు ఆగ‌స్ట్ 15. నేను పార్టీ స్థాపించిన‌ప్పుడు రెండు పండుగ‌ల‌ను బ‌లంగా నిర్వ‌హించాల‌నుకున్నా. ఒక‌టి దేశానికి స్వ‌తంత్రం సిద్ధించిన రోజు ఆగ‌స్ట్ 15, రెండు రిప‌బ్లిక్ డే. ఏదో జెండా ఎగుర‌వేశాం అన్న చందంగా కాకుండా.. స్వ‌తంత్రం కోసం ఎంత మంది శ్ర‌మిస్తే మ‌న‌లాంటి వారు దాన్ని ఇక్క‌డి వ‌ర‌కు తీసుకురాగ‌లిగారు అనే అంశాల‌ను మ‌న‌నం చేసుకోవాలి. వారి త్యాగానికి తూట్లు పొడిచేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. సెక్యుల‌రిజాన్ని చంపేసే ప‌రిస్థితులు వ‌స్తూ ఉంటాయి. దాన్ని కాపాడుకునేందుకు నేను నిత్యం నా వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాను.’ నా చావు మేల్కొ లుపు కావాలి’ అంటూ 23 ఏళ్ల వ‌య‌సులోనే ఉరి కంబానికి ఎక్కిన భ‌గ‌త్‌సింగ్ లాంటి త్యాగ‌ధ‌నులు స్ఫూర్తిని బ‌లంగా స్మరించుకుందాం” అని చెప్పారు.

•పార్టీ కోసం క‌ష్టప‌డిన వారిని విస్మరించ‌వ‌ద్దు: నాదెండ్ల మ‌నోహ‌ర్‌

రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాజకీయాల్లో నిలకడగా, సుదీర్ఘ ప్రయాణం చేద్దామన్న సంకల్పంతో ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీ పవన్‌క‌ళ్యాణ్‌ గారు. ఆయనకి అంతా మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్యకర్తలు కూడా మీమీ పట్టణాల్లో, గ్రామాల్లో పార్టీ నిర్మాణంపై, చేపట్టవలసిన కార్యక్రమాలపై అంతా ఒక చోట చేరి చర్చించుకోవాలి. పార్టీ బలోపేతం కోసం కష్టపడిన వారిని విస్మరించే పరిస్థితి రాకూడదు. పార్టీ అభ్యర్ధులకి వచ్చిన ఓట్లను అంకెలుగా చూడవద్దు. శ్రీ పవన్‌క‌ళ్యాణ్‌ గారి పిలుపుతో వేల సంఖ్యలో సామాన్యులు జనసేన అభ్యర్ధిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 70 మందికి పైగా 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువతకు అవకాశం ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలన్న తపనతో, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సుధీర్ఘ ప్రయాణానికి సిద్ధమవుతారన్న లక్ష్యంతో వారికి అవకాశం ఇచ్చారు. దాన్ని అవకాశంగా కాక బాధ్యతగా భావించాలి.

ఎన్నికల ముందు వచ్చి రాత్రి పగలు కష్టపడి సీట్లు తెచ్చుకుంటే సరిపోదు. పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. గ్రామ గ్రామాన జనసేన జెండా ఎగిరే ఏర్పాటు చేయాలి.  ఇక్కడ ఉన్న అభ్యర్ధుల్లో ఎవరైనా.. అధ్యక్షుల వారు అప్పగించిన పనిని సవ్యంగా చేపట్టడం లేదు అని భావిస్తే ఆ విషయాన్ని మీరు ఆయన దృష్టికి తీసుకురండి. కొందరు ఈ మధ్య వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అలా కాకుండా పార్టీ కేలెండ‌ర్‌ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనల్ని ఏ విధంగా ఇబ్బందిపెట్టాలి... మన ఎమ్మెల్యేని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక 100 రోజుల పాటు ఎలాంటి విమర్శలు చేయొద్దని శ్రీ పవన్‌క‌ళ్యాణ్ గారు ఆదేశించారు. అయితే సమస్య వచ్చినప్పుడు మాత్రం ప్రజల పక్షాన  నిలబడాలని నిర్ణయించారు. మన నాయకుడికి సమస్య వచ్చినప్పుడు ఆయనకి అండగా నిలబడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అవసరం అయితే రోడ్డు మార్గం ద్వారా రాజోలు వెళ్లేందుకు పార్టీ అధ్యక్షుల వారు సిద్ధమయ్యారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది ఆయన దృష్టికి వచ్చి తీరుతుంది. ఎక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి.

వాటి పరిష్కారం కోసం కేంద్ర కార్యాలయం నుంచి ఎవర్నయినా పంపాలా అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించడం జరిగింది. మీ అందరికీ సమాజంలో ఒక గౌరవం తీసుకురావాలన్న ఆలోచనతో, సమాజంలో మార్పు తీసుకు వచ్చే విధానంలో మిమ్మల్ని భాగస్వామ్యుల్ని చేయాలన్న ఆలోచనతో శ్రీ పవన్‌క‌ళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆలోచనకు మీరంతా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కమిటీల ఎంపికపై అధ్యక్షుల వారు మార్గదర్శకాలు ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ చార్జీల నియామకం అనంతరం మండల, గ్రామ స్థాయి కమిటీల నిర్మాణం జరుగుతుంది” అని తెలిపారు. అంతకు ముందు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన ఎమ్మెల్యే అభ్యర్ధులు శ్రీ రెడ్డి అప్పలనాయుడు, శ్రీ చిర్రి బాలరాజు, శ్రీ మేకా ఈశ్వరయ్య, శ్రీ బి.వి. రావు, శ్రీ నవుడు వెంకటరమణ, శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, శ్రీ బసవ వైకుంఠ భాస్కరరావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు.

More Press Releases