ఈజీఎంఎం ద్వారా ఉపాధి శిక్ష‌ణ‌, ఉద్యోగావ‌కాశాలు: తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

  • శిక్ష‌ణా సంస్థ‌లు, అధికారుల‌తో స‌మీక్షించిన పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
హైదరాబాద్: ఎంప్లాయిమెంట్ గ్యారంటీ మార్కెటింగ్ మిష‌న్ ద్వారా ఇస్తున్న ఉపాధి శిక్ష‌ణ, ఉద్యోగావ‌కాశాలు అద్భుతంగా ఉన్నాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పట్టుదలతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా చేప‌ట్టే ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. హైద‌రాబాద్, ఖైర‌తాబాద్ లోని రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాల‌యంలో జ‌రిగిన‌ ఈజీఎంఎం సిబ్బంది, పిఐఎల స‌మీక్ష స‌మావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి ఇంటికి కనీసం ఒక ఉపాధి లేదా ఉద్యోగ అవ‌కాశం కల్పించి బంగారు తెలంగాణకై సిఎం కృషి చేస్తున్నార‌న్నారు. ఇందులో భాగంగా ఈ డి.డి.యు.జీ.కే.వై (DDUGKY) ప్రోగ్రాం 2016 - 19 ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన 47 వేల 311 టార్గెట్ కు, 51 వేల 611 గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి 36 వేల 688 ఉద్యోగావ‌కాశాలు కల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. 2019 - 22 ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం 90 వేల మంది యువతకి శిక్షణ ఇచ్చి కనీసం 63 వేల మందికి ఉద్యోగ కల్పనకై ప్రణాళికలు రూపొందించార‌న్నారు. ఇందుకు 57 ప్రయివేట్ సంస్థలను భాగస్వాములుగా చేస్తూ, 824 కోట్ల రూపాయల బుడ్జెట్ ను నిర్ధారించామ‌న్నారు.

అయితే కోవిడ్-19 ప్రభావం వలన ఈకార్యక్రమాన్ని అనుకున్న స్థాయిలో అమలు చేయలేకపోతున్నార‌ని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల కోవిడ్-19 నియమ నిబంధనలను, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ శిక్షణ సంస్థలు శిక్షణ కొనసాగించాలని మంత్రి కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించాల‌ని సూచించారు.

ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌తోనే ఆగిపోకుండా, వారికి క‌నీసం ఏడాదిపాటు త‌గు స‌హ‌కారం అందిస్తే, ఆయా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల్లో వారు స్థిర ప‌డ‌తార‌ని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, ఇజిఎంఎం ఈడీ గ‌ణేశ్, సంబంధిత సంస్థ‌ల అధికారులు, బాధ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Press Releases