కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫి ద్వారా చిత్రీకరణ: తెలంగాణ ఎన్నికల కమిషనర్

కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫి ద్వారా చిత్రీకరణ: తెలంగాణ ఎన్నికల కమిషనర్
డిసెంబర్ 03, 2020: రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ సెంటర్ పై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి సంపూర్ణ అధికారం, జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం వారిదేనని మరియు అజమాయిషీ వారిదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి అన్నారు.

గురువారం (03.12.2020) జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి మరియు కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు మరియు ఆర్వో లతో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని, రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని, అందరిని సమన్వయ పరచుకొని, బాధ్యతాయుతంగా పూర్తి చేయాలన్నారు.

కౌంటింగ్ ఉదయం 8.00 గం. లకు మొదలవ్వాలని, సిబ్బంది ఉ. 7:30 వరకు తమకు కేటాయించిన స్థానాలలో ఆసీనులు కావాలన్నారు. అనుమతి లేని వ్యక్తులెవరు కూడా కౌంటింగ్ హాల్ లో ఉండకూడదన్నారు. కౌంటింగ్ అవసరమైన ఏర్పాట్లు సామాగ్రి ఏర్పాట్లు 3 వ తేదీ రాత్రి లోపు పూర్తి చేయాలని అన్నారు. సిబ్బందికి, కౌంటింగ్ ఎజెంటులకు అందరికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ఎవరికి కేటాయించిన టేబుళ్ళ వద్ద వారు కూర్చునేలా చూడాలన్నారు.

కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించడానికి 30 డి ఆర్ సి సెంటర్లకు 30 పరిశీలకులను నియమించినట్లు, ఎన్నికల ఫలితాలను పరిశీలకుల ఆమోదం తరువాతనే రిటర్నింగ్ అధికారి ప్రకటించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫి ద్వారా చిత్రీకరించడం జరుగుతుందని, పారదర్శకంగా నిర్వహించాలని, స్ట్రాంగ్ రూమ్ అభ్యర్ధి లేదా వారి ఏజెంట్ సమక్షంలో ఉదయం 7.45 నిమిషాలకు తెరవాలన్నారు.

సందేహాత్మక బ్యాలెట్ పేపర్ల పై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని నియమ నిబంధనలు ఆకళింపు చేసుకొని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని, ప్రతి రౌండు తరువాత ప్రతి టేబుల్ వద్ద  కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు సేకరించాలన్నారు.

మొబైల్ ఫోన్లు కౌంటింగ్ సెంటర్ లోనికి అనుమతించరాదని, ధూమపానం నిషేదమని, కౌంటింగ్ ప్రక్రియలో రిలీఫ్ ఏజెంట్లు ఉండరని తెలిపారు. కోవిడ్-19 నిబంధనలు తప్పక పాటించాలని-కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పక ధరించాలని తెలిపారు.
GHMC
GHMC Elections
Telangana State Election Commissioner
Telangana

More Press News