పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, ఫోటో కాంపిటీషన్ కార్యక్రమాలు

Related image

హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ర్యాంకుల పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడంతో పాటు తెలంగాణలో పోలీస్ సేవలకు సంబందించిన అంశాలపై ఫోటో కాంపిటీషన్ ను నిర్వహించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 21 వతేదీ నుండి 31 వరకు పోలీస్ అమర వీరుల సంస్మరణతో పాటు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతొ పది రోజులపాటు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఏ.ఆర్.ఏ.ఎస్.ఐ., ఏ.ఎస్.ఐ లతో పాటు క్రింది స్థాయి పోలీసులకు 'కోవిద్-19 మహమ్మారి - పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లు' అనే అంశంపై, ఆర్.ఎస్.ఐ, ఎస్.ఐ తోపాటు ఆపైన పోలీస్ అధికారులు 'కోవిద్ - 19 పాండమిక్ సందర్బంగా పోలీసింగ్ లో అవలంబించిన వినూత్న విధానాలు' అనే అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తారు. వచ్చిన వ్యాసాలలో ఎంపికయినవాటికి
అందచేస్తారు. అదే విధంగా, విద్యార్థులకు కోవిద్ -19 సందర్బంగా పోలీసుల పనితీరు అనే అంశంపై ఆన్-లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ విధులను తెలిపే అంశాలపై ఫోటో పోటీ, లఘు వీడియో పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోటీలను సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు నిర్వహిస్తారు. కాగా, పోలీసు అమరవీరుల దినమైన అక్టోబర్ 21 వతేదీకి వారం రోజుల ముందునుండే గతంలో పలు కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 21 తేదీన పోలీస్ అమర వీరుల దినం నిర్వహించి అక్టోబర్ 31 తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్-డే పేరుతొ పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి అనుగుణంగా పదిరోజుల పాటు రాష్ట్రంలో పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ప్రతీసారి పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ నిర్వహించి పాఠశాల, కళాశాల విద్యార్థులను, యువజన సంఘాల ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానించేవారు. అయితే, ఈ సారి కోవిద్ నిబంధనలను అనుసరించి ఓపెన్ హౌస్ ను ఆన్-లైన్ ద్వారా నిర్వహించి వివిధ వర్గాల వారు వీక్షించే విధంగా ఆన్-లైన్ ఆక్సెస్ ఇవ్వాలని ఆదేశించారు.

ప్రధాన వీధులకు, మార్గాలకు అమర పోలీసుల పేర్లు:

తీవ్రవాద చర్యల్లో మరణించిన పోలీసు అమరుల పేర్లను వారి స్వస్థలంలో ఏదైనా ఒక వీధికి గానీ, రహదారికి గాని పెట్టేందుకు లోకల్ స్థానిక గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీల నుండి తీర్మానం చేయించి వారి పేరు పెట్టాలని మహేందర్ రెడ్డి ఆదేశించారు. అదే విధంగా పోలీస్ అమరుల కుటుంబసభ్యులను కలసి వారి యోగ క్షేమాలు తెలుసుకొని అవసరమైతే తక్షణ సహాయం అందించాలని స్పష్టం చేశారు. అమర పోలీసుల చిత్ర పటాలను స్థానిక పోలీస్ స్టేషన్లల్లో ప్రదర్శించాలని తెలిపారు.

పోలీస్ ఫ్లాగ్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ఒక గంటసేపు పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అన్ని యూనిట్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా పోలీస్ శాఖ లక్ష్యాలు, విజయాలను ప్రజలకు తెలియ చెప్పటానికి పోలీస్ జాగృతి, పోలీస్ కళా బృందాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే, ఏ కార్యక్రమం చేపట్టినా కోవిద్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

More Press Releases