వరదనీటి ముంపుకు గురైన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది: మంత్రి తలసాని

వరదనీటి ముంపుకు గురైన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది: మంత్రి తలసాని
హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా వరదనీటి ముంపుకు గురైన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వరుసగా 3 వ రోజు ఆయన ముంపు ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో MLA ముఠా గోపాల్, అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతి నగర్, అడిక్ మెట్ డివిజన్ పరిధిలోని నాగమయి కుంట, పద్మనగర్, పాపడ్ గల్లి తదితర ప్రాంతాలలో పర్యటించి ముంపుకు గురైన బాధితులను పరామర్శించి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అన్ని రకాల సహాయక చర్యలను చేపడుతుందని హామీ ఇచ్చారు. హుస్సేన్ సాగర్ నుండి నాలా లోని నీరు విడుదల చేయడంతో నాలా పొంగి తమ ఇండ్లలోని నీరు చేరిందని అరుంధతి నగర్ కాలనీ వాసులు మంత్రికి వివరించారు.

నాలా వెంట రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచి నిర్మిస్తే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని తెలపగా, ప్రస్తుతం ఉన్న 3 అడుగుల రిటైనింగ్ వాల్ ను 10 అడుగుల ఎత్తుకు నిర్మించేందుకు తగు చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం నమోదైందని, నాలాలపై, నాలాల వెంట నిర్మాణాలు చేసిన ప్రాంతాలే అత్యధికంగా ముంపుకు గురైనాయని పేర్కొన్నారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారని చెప్పారు. ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత, RDO వసంత, DC ఉమాశంకర్, EE శ్రీనివాస్, లేక్స్ EE రేణుక, ఎలెక్ట్రికల్ DE హరీష్, వాటర్ వర్క్స్ GM సంతోష్, తహసిల్దార్ జానకి తదితరులు ఉన్నారు.
Talasani
TRS
Hyderabad

More Press News