గ్రంధాలయాలను ఆధునీకరించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని

Related image

గ్రంధాలయాలను ఆధునీకరించి అభివృద్ధి చేయడం, పాఠకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాదు నగర గ్రందాలయాల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, TSEWIDC చైర్మన్ నాగేంద్ర గౌడ్, కలెక్టర్ శ్వేత మహంతి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, TSEWIDC MD పార్ధసారధి, హైదరాబాదు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, డైరెక్టర్ లు మమతా సంతోష్ గుప్తా, పులి జగన్, పెంటా రెడ్డి, వాసుదేవరావు, సెక్రెటరీ పద్మజ, CE మల్లేష్, SE శ్రీనివాస్, TSMIDC EE చలపతి, DE జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR, మున్సిపల్ శాఖ మంత్రి KTR గ్రంధాలయాల అభివృద్ధి పై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని, వారి ఆదేశాల మేరకే హైదరాబాదు లోని గ్రంధాలయాల ఆధునీకరణ కు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సుబులిటీ నిధులతో (CSR ఫండ్) హైదరాబాదు జిల్లా పరిధిలో ఉన్న 82 గ్రంధాలయాల లో ఈ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాదు జిల్లా పరిధిలో ఉన్న 82 గ్రందాలయాలలో  ప్రతి నెల సుమారు 21 లక్షల మంది పాఠకులు ఆయా గ్రంథాలయాల్లో పుస్తక పఠణం చేస్తుంటారని తెలిపారు. గ్రంధాలయాల లో విద్యుత్, త్రాగునీరు సౌకర్యాలు కల్పించడంతో పాటు భవనాలకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా అన్ని గ్రంధాలయాలలో అవసరమైన ఫర్నిచర్ ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు (కాంపిటీటివ్ ఎగ్జామ్స్) కు సిద్దమవుతున్న అభ్యర్ధులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రంధాలయాల అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై సెప్టెంబర్ 1 వ తేదీన జరిగే సమావేశానికి వారం రోజులలలో సమగ్ర నివేదికతో హాజరుకావాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

గ్రంధాలయాల నిర్వహణకు ప్రస్తుతం GHMC ద్వారా చెల్లిస్తున్న నెలకు 15 లక్షల రూపాయలను అవసరాన్ని బట్టి మరింత పెంచుతాం అని మంత్రి ప్రకటించారు. సికింద్రాబాద్ గ్యాస్ మండి లో 3 కోట్ల రూపాయల GHMC నిధులతో ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన గ్రంధాలయ భవన (డిజిటల్ లైబ్రరీ) నిర్మాణానికి మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారని, భవనం నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ డిజిటల్ లైబ్రరీ రాష్ట్రంలోనే మోడల్ లైబ్రరీ కానున్నదని మంత్రి తెలిపారు. అన్ని గ్రందాలయాలలో GHMC ఆధ్వర్యంలో టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా అన్నపూర్ణ కేంద్రాల ద్వారా గ్రందాలయాలకు వచ్చే పాఠకులకు 5 రూపాయలకు బోజన సౌకర్యం కల్పించే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గ్రంధాలయాల అభివృద్ధి, పర్యవేక్షణ కోసం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రంధాలయాలకు అవసరమైన సిబ్బంది ని ఔట్ సోర్సింగ్ పద్దతి లో తీసుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలు, ఇరుకు భవనాలలో కొనసాగుతున్న గ్రందాలయాలకు నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు ఉంటే అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసి 1 వ తేదీన నిర్వహించే సమావేశంలో అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

More Press Releases