జ‌న‌సేన పార్టీని ఏ పార్టీలో క‌లిపే ప్రస‌క్తే లేదు: పవన్ కల్యాణ్

Related image

• పార్టీ న‌డ‌ప‌డానికి ట‌న్నుల కొద్ది ఆశ‌యం ఉంటే చాలు
• ఓట‌మి అనంత‌రం మీకు ధైర్యం ఎలా చెప్పాల‌నే ఆలోచించా
• భీమ‌వ‌రం టూర్ హైలెట్ కాకుండా తెలంగాణ‌లో వ్యూహం
• ఐదు రోజుల క్రితం మాట్లాడితే ఇప్పుడు ధ‌ర్నా ఎందుకు?
• నా మాట‌లు వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు
• నా మాటల్లో తప్పు ఉంటే క్షమించమంటా... వక్రభాష్యం చెబితే ఊరుకోను
• భీమ‌వ‌రంలో సొంత స్థ‌లంలో పార్టీ కార్యాల‌యం
• భీమ‌వ‌రం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్‌ కల్యాణ్

నా మీద న‌మ్మ‌కం ఉంచి ఓటు వేసిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ భీ‌మ‌వ‌రం నుంచి మాటిస్తున్నా… జ‌న‌సేన పార్టీని మ‌రే పార్టీలో క‌లిపే ప్ర‌స‌క్తే లేద‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు  ప‌వ‌న్‌ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌ధ్య బీజేపీలో క‌లిపేస్తారు అంటూ ప్ర‌చారం చేస్తున్నార‌నీ, నా ప్రాణంపోయినా అది జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భీమ‌వ‌రం వ‌చ్చిన ఆయ‌న ఉండి రోడ్డులోని కోట్ల ఫంక్ష‌న్ హాల్ లో భీమవరం నియోజకవర్గ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ముఖాముఖి స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ కల్యాణ్ మాట్లాడుతూ... ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీతో లోపాయికారి ఒప్పందం అంటూ ఇదే విధ‌మైన ప్ర‌చారం చేశారు. ఏదైనా ఉంటే బ‌య‌టికి చెప్పే చేస్తా, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవ‌డానికి నాకు ఎలాంటి భ‌యాలు లేవు. మ‌నం ఒంట‌రిగా పోటీ చేశాం కాబ‌ట్టే వైసీపీకి విజ‌యం ద‌క్కింది. 2018లో టీడీపీని తిట్టిన త‌ర్వాత, అవ‌కాశవాద రాజ‌కీయాలు చేయాలి అనుకుంటే… భీమ‌వ‌రంలో టీడీపీ అభ్య‌ర్ధి లేకుండా నేనే రెండు పార్టీల త‌ర‌ఫున బ‌రిలోకి దిగేవాడిని క‌దా. గాజువాక‌లో టీడీపీ అభ్యర్థి  లేకుండా జాగ్ర‌త తీసుకునేవాడిని క‌దా.. లేదంటే అభ్య‌ర్ధుల్ని మార్పించుకునేవాడిని క‌దా. ఇదే వాదాన్ని కార్య‌క‌ర్త‌లు బ‌లంగా వినిపిస్తున్నారు. అంతే నిక్క‌చ్చిగా నాయ‌కులు ఎందుకు మాట్లాడ‌లేక‌పోతున్నారు? నేను ఒక జ‌న‌సైనికుడికి అర్ధం అవుతున్నా. అందుకే అడుగ‌డుగునా మేమున్నాం అంటూ ఓట‌మి త‌ర్వాత కూడా రాజ‌మండ్రి నుంచి భీమ‌వ‌రం వ‌ర‌కు వెంట‌ వ‌చ్చారు. నాయ‌కుల నుంచి కూడా అదే న‌మ్మ‌కాన్ని కోరుకుంటున్నా. పార్టీని న‌డ‌ప‌డానికి వేల కోట్లు అవ‌స‌రం లేదు ట‌న్నుల కొద్దీ ఆశ‌యం ఉంటే చాలు. చాలా మంది అడుగుతున్నారు.

•ఇళ్ల మీదకు వస్తాం, ఆఫీసు మీదకు వస్తాం అంటే  చూస్తూ ఊరుకోను

రాజ‌మండ్రిలో దిగ‌గానే ఫోన్ వ‌చ్చింది. మా ఇంటి ముందు ధ‌ర్నా చేయ‌డానికి వ‌స్తున్నార‌ని .  ఎందుకు అంటే నేను తెలంగాణ‌లో ఎవ‌ర్నో కించ‌పరిచేలా మాట్లాడాను అని అంట‌. అదీ ఐదు రోజుల క్రితం. నేను మాట్లాడింది వేరు. వారు చెప్పేది వేరు. ఎప్పుడో ఐదు రోజుల క్రితం మాట్లాడితే దాన్ని ఈ రోజు నేను భీమ‌వ‌రం వ‌స్తుంటే తెర మీదికి తెచ్చి ఈ కార్య‌క్ర‌మం హైలైట్ అవ‌కుండా చేసే ప్ర‌య‌త్నం అది. అస‌లు నేను మాట్లాడిన విష‌యం జ‌గ‌న్‌రెడ్డి చెప్పిన మ‌ద్య‌పాన నిషేధం అంశానికి సంబంధించిన‌ది. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య రాసిన తెలంగాణ సాయుధ పోరాటం పుస్త‌కంలో చ‌దివిన అంశాన్ని ప్ర‌స్తావించాను.  మ‌ద్య‌పానం అనేది కొన్ని గిరిజ‌న తెగ‌ల్లో, కొన్ని రాష్ట్రాల్లో సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయింది అని అన్నాను.

ప్ర‌జ‌ల నుంచి సంస్కృతిని ఎలా వేరు చేయ‌లేం కాబ‌ట్టి మ‌ద్య‌పాన నిషేధం క‌ష్టం అవుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో క‌మ్యునిస్టులు సైతం మ‌ద్య‌పాన నిషేధం ఎందుకు చేయ‌లేం అన్న‌ప్పుడు అది వారి సంస్కృతిలో ఒక భాగంగా భావించారు. మ‌న గిరిజ‌నులు ఇప్ప పువ్వు నుంచి సారా తీస్తారు. అది వారి సంస్కృతి, వ‌ద్ద‌న్నా ఆగ‌రు. నేను మాట్లాడింది ఒక‌టి అయితే దాన్ని వ‌క్రీక‌రించి ఈ రోజున టిఆర్ఎస్ వ్య‌క్తులో, కార్య‌క‌ర్త‌లో తెలియ‌దు మా ఇంటి మీద దాడికి ప్ర‌య‌త్నించారు. ప్ర‌జాస్వామ్యంలో ఏదైనా మాట్లాడిన‌ప్పుడు దాన్ని మీడియా ముఖంగా ఖండించాలి. అంతేగానీ దాడుల‌కి దిగ‌డం మంచిది కాదు. ఇళ్ల మీద‌కి వ‌స్తాం, ఆఫీసుల మీద‌కి వ‌స్తాం అంటూ చూస్తూ ఊరుకోను తాట‌తీస్తా. నేను త‌ప్పు మాట్లాడి ఉంటే క్ష‌మించ‌మ‌ని అడుగుతా. నా చిన్నబిడ్డ‌లు ఉన్న ఇంటి మీదికి వ‌చ్చి ధ‌ర్నాలు, దాడులు చేస్తాం అంటే మాత్రం చేతులు ముడుచుకు కూర్చోను. మీరు భీమ‌వ‌రం వ‌చ్చి రాజ‌కీయాలు చేయవచ్చు. నేను ఒక అభిప్రాయం చెబితే ఇలాంటి ప‌నులు చేస్తారా?  ఈ విష‌యాన్ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దృష్టికి, ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌రావు దృష్టికి తీసుకువెళ్తున్నాం. నేను ఏం మాట్లాడానో వీడియో తెప్పించుకుని చూడండి. నేను త‌ప్పు మాట్లాడితే క్ష‌మాప‌ణ చెబుతా. ఇలా ఇళ్ల మీద‌కి వ‌స్తే మాత్రం చూస్తూ ఊరుకోను.

ఇక కొత్త ప్ర‌భుత్వ పాలన విష‌యం వ‌చ్చిన‌ప్పుడు మా పార్టీ నేత‌లందరికీ ఒక‌టే చెప్పా వంద రోజులు వెయిట్ చేద్దాం వారి ప‌రిపాల‌న ఎలా ఉందో చూద్దాం. ప్ర‌జ‌ల తీర్పుని గౌర‌విద్దాం. టీడీపీ నాయ‌కుల్లా ఎలా ప‌డితే అలా మాట్లాడుదాం అనుకోలేదు. మ‌ద్య‌పాన నిషేధం అంశం మీద మాట్లాడిన‌ప్పుడు జ‌గ‌న్‌ ద‌శ‌ల‌వారీ నిషేధం అన్నారు. ఇప్పుడు రూ.3వేల ఫించ‌న్ ఇస్తాన‌ని, రూ.250 పెంచారు. అది కూడా స‌మ‌యానికి రావ‌డం లేదు. జ‌న‌సేన పార్టీ మ‌ద్యం గురించి మాట్లాడిన‌ప్పుడు బాధ్య‌త‌తో కూడిన లిక్క‌ర్ పాల‌సీ తీసుకువ‌స్తామ‌ని చెప్పింది. అది ఎలా అంటే 70 శాతం ఆడ‌ప‌డుచులు కోరుకుంటే అక్క‌డ మ‌ద్యం షాపులు ఉండ‌కూడ‌దు. ప్ర‌జ‌ల లోప‌ల నుంచి మార్పు వ‌చ్చినప్పుడు త‌ప్ప‌దు .

•జనసైనికులు నమ్మారు

ఓడిపోతే మీరు న‌న్ను గుండెల్లోకి తీసుకున్నారు. పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా మీరే ఉన్నారు నా వెనుక‌. 2018లో టీడీపీతో గొడ‌వ పెట్టుకున్నాక నా ప‌క్క‌కి వ‌చ్చిన కొద్ది మంది నా ఇంటిగ్రెటినీ చెక్ చేశారు. జ‌న‌సైనికులు మాత్రం న‌న్ను న‌మ్మారు. సీట్లు రాక‌పోతే పోయాయిగానీ ఇలాంటి వారితో చేయ‌లేం అనిపించింది. వీరితో క‌ల‌సి వెళ్దాం, వారితో క‌ల‌సి వెళ్దాం అంటే కుద‌ర‌దు. ఇవాళ విజ‌య గ‌ర్వంతో వ‌చ్చాను. ఓట‌మి త‌ర్వాత పావుగంట త‌ర్వాత ఏం చేయాలి అని ఆలోచించాను. నాకు ఫ‌లితాలు రాక‌ ముందే ఓట‌మి అర్ధం అయిపోయింది. ముందు నుంచే ఓట‌మికి ప్రిపేర్ అయ్యాను.

నేను మీకు నిల‌బ‌డ‌తాను అని ఎలా చెప్పాలి అని ఆలోచించ‌డానికి పావుగంట స‌మ‌యం తీసుకున్నా. గెలుపు వ‌చ్చినా అంతే బ‌లంగా వ‌స్తుంది. పార్టీ ఎప్ప‌టి వ‌ర‌కు నడుపుతాం అని కొటికలపూడి చిన‌బాబు గారు అడిగారు. అప్పుడు, ఇప్పుడు ఒక‌టే చెబుతున్నా... ఓడించ‌బ‌డ్డ ఈ నేల నుంచి చెబుతున్నా జ‌న‌సేన‌ను మీలో న‌లుగురు వ‌చ్చి న‌న్ను మోసుకెళ్లే వ‌ర‌కు మోస్తా. అనుకూల ప‌రిస్థితుల్లో బ‌లం లేని వాళ్లు కూడా చాలా బ‌లంగా క‌నిపిస్తారు. ప్ర‌తి కూల ప‌రిస్థితుల్లో బ‌లం ఉన్న నాయ‌కులు కూడా చాలా బ‌ల‌హీనంగా క‌న‌బ‌డ‌తారు. మ‌నమేం అన్యాయాలు చేసి జైలుకి వెళ్ళలేదు క‌దా మ‌న‌కి భ‌యం ఎందుకు. గెలుపు రావ‌డానికి ద‌శాబ్దం ప‌ట్ట‌వ‌చ్చు. భీమ‌వ‌రంలో ఓడాం, గాజువాక‌లో ఓడాం, ఇన్ని స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయాం అని ఆగిపోతే రేపు రాబోయే విజ‌యాల‌ను కూడా తీసుకోలేం.  గెలుపు, ఓట‌ముల‌ను ఒక అనుభ‌వంగానే తీసుకుంటా.

•నాలుగు పార్టీలతో పోటీపడ్డాం

ఎందుకంటే మ‌నం దండ‌లు వేసే స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధులంతా ఎమ్మెల్యేలు, మంత్రులు కాదు. అలాంటి పోరాట యోధులే నాకు స్ఫూర్తి. అందుకే గెలుపుకి పొంగిపోను, ఓట‌మికి కుంగిపోను. సోష‌లిస్ట్ ఉద్య‌మాల్లో గొప్ప‌ వ్య‌క్తులు న‌న్ను ప్ర‌భావితం చేశారు. నా కోస‌మే బ‌త‌కాలి అంటే రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం లేదు.  ఎదుటి వారి క‌ష్టాలు నా క‌ష్టాలు అనుకున్నా అదే న‌న్ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చింది.  స‌మాజంలో ఉన్న పిరికి త‌నం మీద ఆవేద‌న న‌న్ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చింది.  ఇలాంటి భ‌యాలు ఎక్క‌డో ఒక‌చోట మారాలి అనే ఉద్దేశంతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను.  దెబ్బ తిన్నా ఈ రోజు నిల‌దొక్కుకుని ఇక్క‌డ భీమ‌వ‌రంలో నిల‌బ‌డ‌గ‌లిగాం.  జ‌న‌సేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కార‌ణం.. స‌మ‌స్య‌ల మీద, భ‌విష్య‌త్ తరాల అభ్యున్నతి మీద అధ్య‌య‌నం చేయ‌డ‌మే.  తెలంగాణ విభ‌జ‌న‌కి కేవ‌లం నాయ‌కుల త‌ప్పిద‌మే నాకు కార‌ణంగా తోచింది.  నాయ‌కుల త‌ప్పుకి ప్ర‌జ‌ల్ని నిందించ‌డం చూడ‌లేకే పార్టీ పెట్టాను.  న‌న్ను చంపేసినా ఫర్వాలేదు స‌త్యం మాట్లాడాల‌న్న తెగువ‌తో పార్టీ స్థాపించా.

ప్రాణాల‌కు తెగించిన వాడికి ఓట‌మి ఒక లెక్కా.  జ‌న‌సేన‌కి ఒక శాతం అన్నారు. మ‌నం నాలుగు పార్టీల‌తో పోటీ ప‌డ్డాం. బీజేపీ, టీడీపీ, వైసీపీ, తెర‌వెనుక టి ఆర్ ఎస్ ‌ల‌తో పోటీ ప‌డ్డాం.  తెలంగాణ నాయ‌కుల‌కి అప్ప‌టి నుంచి చెబుతున్నా పాల‌కులు చేసిన త‌ప్పుల‌కి ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను తిడితే నేను ఒప్పుకోను . పార్టీ పెట్టిన‌ప్పుడు గాంధీన‌గ‌ర్‌లో మోడీ గారిని క‌లిశాను. జాతీయ స‌మ‌గ్ర‌త దెబ్బ‌తినే ప‌రిస్థితుల‌ను ప్ర‌స్థావించాను.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 30 ఏళ్ల‌కి ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయో ఊహించ‌లేం. ఆంధ్రుల్ని తిడితే వారికి భావోద్వేగం రాదా అని అడిగా. దేశ స‌మ‌గ్ర‌త గురించి అన్ని విష‌యాలు మాట్లాడినందుకే  ఓ దేశ‌భ‌క్తుడిని చూశాన‌ని ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

ఈ ఓట‌మిని గ‌ర్వంగా స్వీక‌రిస్తున్నా. నేనే గెల‌వాలి అంటే పీఆర్పీలో ఎంపిగా పోటీ చేసే వాడిని. పోటీ చేసి ఉంటే నేను పార్టీని పోనిచ్చేవాడిని కాదు .2014లో నాకు ఇన్ని ఎంపిలు, ఎమ్మెల్యేలు కావాలి అని అడ‌గ‌వ‌చ్చు. గెలిచాక తీసుకుని ఉండ‌వ‌చ్చు. ఈ దేశంలో ఏదీ ఆశించ‌కుండా నిస్వార్ధంగా ప‌ని చేసే మ‌నుషులు ఇంకా బ‌తికి ఉన్నారు అని చెప్ప‌డానికి నేను ఏమీ ఆశించ‌లేదు. రాజ‌కీయాలు చేయ‌డం రాద‌న్నారు. ఎలా వాడుకోవాలో తెలియ‌ద‌న్నారు.  ఆశ‌యం నిల‌బెట్ట‌డానికి నేను అన్నీ వ‌దిలేశా. విజ‌యం క‌ష్టానికి త‌గిన ఫ‌లితం కావాలి గానీ, దాని కోసం వెంప‌ర్లాడ రాదు. విజ‌యం ద‌క్కే వ‌ర‌కు పోరాటం చేస్తాం.

•భీమవరంలో... సొంత స్థలంలో పార్టీ కార్యాలయం

అస‌లు విష‌యానికి వ‌స్తే.... భీమ‌వ‌రం, న‌ర‌సాపూర్ పార్ల‌మెంట్‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీకి ప‌డిన ప్ర‌తి ఓటుకి ధ‌న్య‌వాదాలు తెలుపుకోవ‌డానికే ఇక్క‌డికి వ‌చ్చాను. గెలిచినా.. గెల‌వ‌కున్నా.. ఇంకోసారి ఓడించినా దేశానికి, రాష్ట్రానికి, మ‌న భీమ‌వ‌రానికి అండ‌గా ఉంటా. భీమ‌వ‌రంలో సొంత డ‌బ్బుతో స్థ‌లం తీసుకుని పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేస్తా. అందుకోసం రెండు ఎక‌రాల స్థ‌లం కావాలి.సొంత స్థ‌లంలోనే పార్టీ కార్యాల‌యం పెట్టాల‌నుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఉంది. పీఆర్పీ స‌మ‌యంలోనూ ఇలాగే చాలా మంది స్థ‌లం మేమిస్తాం అంటే మేమిస్తాం అంటూ ముందుకు వ‌చ్చారు. ఓట‌మి త‌ర్వాత వెళ్లిపోమ‌న్నారు. అందుకే సొంత స్థ‌లంలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తా. రెండెక‌రాల స్థ‌లం ఎందుకు అంటే జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం అంటే పిచ్చాపాటి క‌బుర్ల‌తో కాల‌క్షేపం చేసేదిగా ఉండ‌కూడ‌దు.

కార్యాల‌యానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్కరిలో దేశ‌భ‌క్తిని పెంపొందించే వాతావ‌ర‌ణం అక్క‌డ ఉండాలి. విలువైన విష‌యాలు మాట్లాడుకునే ప్రాంగ‌ణంగా ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యే స్థానిక స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోకుంటే వాటిని గుర్తు చేయ‌డానికి మ‌న పార్టీ కార్యాల‌యం ఉప‌యోగ‌ప‌డాలి అని తెలిపారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన భీమ‌వ‌రంకి చెందిన నాయ‌కుల‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ "రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. వీటికి అతీతంగా పార్టీని సిద్ధాంత బలంతో ముందుకు తీసుకువెళ్లాలి... భావితరాల కోసం మంచి ఆలోచనలు చేయాలి అనే సదుద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై మన సమస్యలను తనవిగా భావిస్తున్నారు" అన్నారు.

ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో స‌భ్యులు పి.రామ్మోహ‌న్‌రావు, ప్యాక్ స‌భ్యులు క‌న‌క‌రాజు సూరి, బి.నాయకర్, న‌ర‌సాపురం పార్ల‌మెంట్ ఇన్‌ఛార్జ్ చేగొండి సూర్య‌ప్ర‌కాష్‌, భీమ‌వ‌రం అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కొటిక‌ల‌పూడి గోవింద్‌(చిన‌బాబు), పార్టీ ముఖ్య‌నాయ‌కులు బొమ్మ‌దేవ‌ర శ్రీధ‌ర్‌ (బ‌న్ను) త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Press Releases