చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి: మంత్రి తలసాని

Related image

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డైరెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రారంభించి మొట్టమొదటిసారిగా జిల్లా మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, విజయ డెయిరీ MD శ్రీనివాస్ రావు, మత్స్య శాఖ JD శంకర్ రాథోడ్ లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 వ తేదీ నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇందులో కోర్టు కేసు కారణంగా 8 జిల్లాలలో చేపట్టలేదని వివరించారు. నేటి వరకు కూడా కొన్ని జిల్లాల లో చేప పిల్లల పంపిణీని చేపట్టలేదని, వెంటనే చేపట్టాలని అన్నారు. చేప పిల్లల సైజు, నాణ్యత విషయంలో ప్రభుత్వ నిబంధనలకు తప్పక పాటించాలని, నిబంధనలకు విరుద్దంగా సరఫరా చేసే చేప పిల్లలను తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. చేప పిల్లల విడుదల కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సొసైటీ సభ్యులను తప్పనిసరిగా ఆహ్వానించాలని చెప్పారు. కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు.

ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సరఫరాదారులతో అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తికాలేదని, పలువురు జిల్లా మ్జత్స్య శాఖ అధికారులు వివరించగా, 4 రోజులలో ప్రక్ర్తియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ సమీక్ష సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలంలో జీవాలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. FMD వ్యాక్సిన్ లను రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల డోసులు పంపిణీ చేయగా, 73 శాతం మాత్రమే పూర్తయిందని అన్నారు. ఎన్ని జీవాలకు టీకాలు వేశారనే వివరాలను ఏ రోజుకు ఆరోజు సైట్ లో నమోదు చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. టీకాల పంపిణీ కార్యక్రమంలో అప్రమత్తంగా వ్యవహరించి ఒక్క జీవాన్ని కూడా వదలకుండా టీకాలు వేయాలని స్పష్టం చేశారు.

వేసవి కాలంలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుసంవర్ధక, డైరీ లకు చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి పశుగ్రాసం పెంపకాన్ని చేపట్టాలని ఆదేశించారు. మీ మీ జిల్లాల అవసరాలకు సరిపడా పశుగ్రాసం ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా శాఖ కు చెందిన ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు (గ్రీన్ వాల్) నాటాలని అన్నారు. అదేవిధంగా NREGS క్రింద చేపట్టిన పశువులు, గొర్రెల షెడ్ ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మిగిలిన చోట్ల కూడా స్థలాలను గుర్తించి షెడ్ ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం, వనపర్తి జిల్లాల లో గొర్రెల మార్కెట్ ల నిర్మాణానికి ఒక్కో మార్కెట్ కు 25 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరిగిందని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఖమ్మ జిల్లా కేంద్రంలో ఫిష్ మార్కెట్ నిర్మాణానికి  ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలెక్ట్రానిక్స్ కమ్యునికేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన గగన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లు సాయి ఈశ్వర్ రావు, రాజేశ్వర్ రావు లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. 

More Press Releases