ఈ-పాస్‌ ద్వారా పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా: తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈ-పాస్‌ ద్వారా పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా: తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • అక్రమాలకు చెక్ 
  • ఆగస్టు 1 నుండి 28,623 పాఠశాలలకు
  • ప్రతి నెల 12 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా
  • తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
అక్రమాలను అరికట్టేందుకు మరింత పారదర్శకంగా ఉండేలా ఈ-పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యాన్ని సరఫరా చేయబోతున్నామని తెలంగాణ వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి 28,623 ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్‌ కోటాను ఈ-పాస్‌ ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 3965 సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 8.76 లక్షల మంది విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠాశాలల్లో 23,87,751 మంది విద్యార్థులకు ప్రతి నెల 12 వేల మెట్రిక్‌ టన్నులు, ఏడాదికి దాదాపు 1.20 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తుందని తెలిపారు.

ఈ బియ్యం సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ-పాస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చామని తెలిపారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు, సంక్షేమ హాస్టళ్లకు ఈ-పాస్‌ విధానం ద్వారానే సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ విధానం ద్వారా ఏ రోజు, ఎంతమంది, ఎన్ని క్వింటాళ్ల బియ్యం తీసుకెళ్లారు, ఇంక ఎంత తీసుకెళాల్సి ఉంది, ఓపెనింగ్‌, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. మొత్తం సరఫరా ప్రక్రియను పర్యవేక్షించడానికి కూడా సులువుగా ఉంటుంది. ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పర్యవేక్షిస్తారు.
Singireddy Niranjan Reddy
Telangana
Hyderabad

More Press News