పార్టీ కోసం క‌ష్టప‌డిన అంద‌రికీ స‌ముచిత గుర్తింపు ద‌క్కేలా క‌మిటీల నిర్మాణం: పవన్ కల్యాణ్

Related image

  • వ్యక్తిగ‌త అజెండాల‌తో పార్టీని ముందుకు తీసుకువెళ్లలేం
  • క‌మిటీల ఏర్పాటు బాధ్యత‌లు తీసుకున్న వారు బ‌లంగా ప‌నిచేయాలి
  • అక్టోబ‌ర్‌లో క్షేత్రస్థాయిలో ప‌ర్యటిస్తా
  • సార్వత్రిక ఎన్నిక‌ల్లో నాలుగు బ‌ల‌మైన శ‌క్తులతో పోరాడాం
  • లోపాల స‌వ‌ర‌ణ‌కు పార్టీ త‌ర‌ఫున కో ఆర్డినేష‌న్ క‌మిటీ
  • క‌మిటీ బాధ్యత‌లు నాగ‌బాబు గారికి అప్పగిస్తున్నాం
  • స‌మ‌స్యలు ఉంటే నాగ‌బాబు గారి దృష్టికి తీసుకువెళ్లండి
  • 100 రోజుల త‌ర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనుకున్నాం.
  • భ‌వ‌ననిర్మాణ కార్మికుల స‌మ‌స్యలు లేఖ రాసేలా చేశాయి
  • కాకినాడ పార్లమెంట్ కార్యక‌ర్తలు, నాయ‌కుల స‌మావేశంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్

జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ప్ర‌తి ఓటు నాలుగు ఓట్ల‌తో స‌మానమ‌నీ, అది ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో డ‌బ్బుకీ, సారాకీ లొంగ‌కుండా వేసిన ఓటు అని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన పార్టీకి వేసిన ప్ర‌తి ఓటుకి నా చివ‌రిశ్వాస వ‌ర‌కు నిల‌బ‌డ‌తాన‌ని, అండ‌గా ఉంటాన‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ... ఏమీ ఆశించ‌కుండా పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తాం. భీమ‌వ‌రంలో క్యాన్స‌ర్ వ్యాధికి కీమో థెర‌పీ చేయించుకుంటూ కూడా ప‌నిచేసిన అలాంటి కార్య‌క‌ర్త‌ల కోసం నిల‌బ‌డ‌తాం. మీ కోసం కార్య‌క్ర‌మాలు పెడ‌తాం. మా కుటుంబం కాదు మీరు గొప్ప‌వారు కావాలి. మీ నుంచి కొత్త నాయ‌క‌త్వాన్ని తీసుకువ‌స్తాం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వ‌స్తున్నాయి, సర్పంచ్‌లుగా, వార్డు మెంబ‌ర్లుగా పోటీ చేయ‌డానికి సిద్ధంకండి. మండ‌ల స్థాయి క‌మిటీలు, గ్రామ స్థాయి క‌మిటీలు, బూత్ స్థాయి క‌మిటీల‌కు సంబంధించిన బాధ్య‌త‌లు తీసుకున్న వారు బ‌లంగా ప‌ని చేయండి.

అక్టోబ‌ర్ నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తా. పార్టీ ఓట‌మితో ఇబ్బంది ప‌డ‌డం లాంటివి ఏమీ నాపై ప్ర‌భావం చూప‌వు. జ‌నంలోకి వెళ్లేందుకు మ‌నం ఎందుకు భ‌య‌ప‌డాలి? మ‌నం ఏమైనా ఘోరాలు, నేరాలు చేశామా.? ఆశ‌యాల కోసం పోరాటం చేశాం. ఆశ‌యాల కోసం పోరాడి ఓడితే ఎందుకు భ‌య‌ప‌డాలి. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చాం. అప్పుడు ఒంటరి‌గా పోటీ చేసి నేను ఒక్క‌డినే గెల‌వ‌లేక కాదు. పార్టీని మ‌రింత విస్తృత ప‌ర‌చాల‌న్న ఉద్దేశంతోనే నాడు పోటీ చేయ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకున్నా. అంచెలంచెలుగా ఎద‌గాల‌ని భావించా. ప‌సి బిడ్డ‌కి పంచ భ‌క్ష్యాలు పెడితే అర‌గ‌దు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మికి చాలా కార‌ణాలు ఉన్నాయి. మ‌నం న‌లుగురు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్ధుల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. టీడీపీ, వైసీపీ, బీజేపీల‌తో ప్ర‌త్య‌క్షంగా యుద్ధం చేస్తే, టిఆర్ఎస్‌తో ప‌రోక్షంగా పోరాడాల్సి వ‌చ్చింది.  పార్టీ కేలెండ‌ర్‌, ప్రోగ్రామ్‌ల‌కి రూప‌క‌ల్ప‌న చేస్తున్నాం. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ప‌నిచేసిన వారితో స‌మావేశ‌మ‌వుతా.

సంస్థాగ‌త నిర్మాణం చేప‌డ‌దామంటే ఎంత మందికి బాధ్య‌త‌లు అప్ప‌గించినా వారంతా నా చుట్టూ తిరుగుతారు మిన‌హా గ్రామాల‌కు వెళ్లింది లేదు. ప‌ని చేసింది లేదు. ఇన్ని ఓట్లు వ‌చ్చాయంటే అందుకు జ‌న‌సైనికులే కార‌ణం. జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన చాలా మంది వ్య‌క్తులు నా బ‌లాన్ని వారి బ‌లంగా చెప్పేవారు. అలాంటి వ్య‌క్తుల మ‌ధ్య నేను చాలా న‌లిగిపోయా.

వ్య‌వ‌స్థ‌ను న‌డ‌పాలి అంటే ప‌ది మంది నాయ‌కులు కావాలి. వారు న‌చ్చ‌లేదు వీరు న‌చ్చ‌లేదు అంటే కుద‌ర‌దు. విలువ‌లు కోల్పోయి నాయ‌కులంతా ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టుకుంటున్న స‌భ‌లో కూర్చోవాలి అంటే మ‌న‌కీ బ‌లం ఉండాలి. అందుకోసం అంద‌రినీ క‌లుపుకుని వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. కొంద‌రు అభ్య‌ర్ధులు మాకు స‌మ‌యం త‌క్కువ ఇచ్చారు అంటున్నారు. స‌మ‌యం నేను కాదు కేంద్రం ఇవ్వ‌లేదు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వ్య‌క్తులు ముందుకు రాలేక‌పోతున్నార‌న్న ఆలోచ‌న చాలా బాధ‌గా ఉంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ప‌ని చేసిన వారితో వ్య‌క్తిగ‌తంగా ఇంట్రాక్ట్ అవుదామ‌న్న ఆలోచ‌న ఉంది. వారి ఆలోచ‌న‌లు తెలుసుకుందామ‌నుకున్నా. అయితే ప్ర‌తి సారీ నాకు చెప్పుకునే ప‌రిస్థితులు ల‌భించ‌క‌పోవ‌చ్చు. నా త‌ర‌ఫున ఆ బాధ్య‌త‌ను నాగ‌బాబు గారికి అప్ప‌గిస్తున్నా.

మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా, అది క‌మిటీల్లో లోపాలు కావ‌చ్చు, ఇంకా ఏదైనా కావ‌చ్చు అలాంటి అన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఓ కో.ఆర్డినేష‌న్ క‌మిటీ ఏర్పాటు చేసి దానికి నాగ‌బాబు గారిని ఇన్‌ఛార్జ్‌గా వేయ‌బోతున్నాం. క‌మిటీల్లో అంద‌రికీ అవ‌కాశం ఇద్దాం. అన్ని కులాల వారికి బ‌ల‌మైన ప్రాతినిధ్యం క‌ల్పిద్దాం. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ, వీర మ‌హిళ‌ల‌తో స‌హా అంద‌రికీ పార్టీలో స‌ముచిత స్థానం, గౌర‌వం ఇచ్చేలా పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్దాం. అందుకు మీ స‌హాయ స‌హ‌కారాలు కూడా అవ‌స‌రం. జిల్లా స్థాయి క‌మిటీలు వే‌ద్దామంటే.. ఇప్పుడు కొత్త జిల్లాలు రాబోతున్నాయి. ప్ర‌తి పార్ల‌మెంట్ ఒక జిల్లా అవ‌బోతోంది. అది రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే ఉన్న ఆలోచ‌న‌. తూర్పు గోదావ‌రి లాంటి పెద్ద జిల్లాల్లో ఒకే వ్య‌క్తికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే తిరిగేందుకు స‌మ‌యం చాల‌దు. అందుకే పార్ల‌మెంట‌రీ స్థాయి క‌మిటీలు వేస్తున్నాం. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌ను వేయ‌బోతున్నాం. క‌మిటీల్లో చోటు ద‌క్కిన వారు అంద‌రినీ క‌లుపుకుపోవాలి. ఎవ‌ర్నీ నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

అర్జెంట్‌గా ముఖ్యమంత్రి అవ్వాల‌న్న ఆలోచ‌న లేదు:

పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే వ్య‌క్తిగ‌త అజెండాలు వ‌దిలేయాలి. అంద‌రికీ నేను కావాలి. ప‌ని మాత్రం వ్య‌క్తిగ‌త అజెండాల‌తో చేస్తారు. మీరు కాదు పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లండి. ఒక వ్య‌వ‌స్థ‌ను పూర్తి స్థాయిలో న‌డిపించేందుకు స‌మ‌యం ప‌డుతుంది. ఆ విష‌యం నాకు తెలుసు. నేను స్థిరంగా, బ‌లంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తా. ఆఖ‌రిశ్వాస వ‌ర‌కు ముందుకు తీసుకువెళ్తాం. నాకు అర్జెంట్‌గా ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని లేదు. నేను కేవ‌లం రాష్ట్రం బాగుండాలి అని మాత్ర‌మే కోరుకునే వాడిని. రాష్ట్రం ఏమైపోతుందోన‌న్న భ‌యంతోనే పార్టీ పెట్టా. త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు దాని గురించి మాట్లాడడానికి కూడా అంద‌రికీ భ‌యం వ‌చ్చేసింది. కొత్త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తే హ‌ర్షిస్తాం. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. నేను మొద‌టి రోజే చెప్పా. కొత్త ప్ర‌భుత్వానికి 100 రోజులు స‌మ‌యం ఇద్దాం అని ఆ త‌ర్వాత త‌ప్పులు ఉంటే ప్ర‌శ్నిద్దాం అని. ఉద‌యం మార్గం మ‌ధ్య‌లో భ‌వ‌న నిర్మాణ కార్మికులు వారి స‌మ‌స్య‌లు నా దృష్టికి తీసుకువ‌చ్చారు.

100 రోజులు మాట్లాడ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నా, వారి క‌ష్టాలు న‌న్ను క‌దిలించాయి. వారు ప‌డుతున్న ఇబ్బందుల గురించి ప్ర‌భుత్వానికి లెట‌ర్ రాశాం. గ‌తంలో రైతులు విత్త‌నాల కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు ఒక లేఖ రాశాం. ఇది రెండోది. రాష్ట్రంలో ఇంకా స‌మ‌స్య‌లు ఉన్నాయి. క‌రెంటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కుద‌రుకోవ‌డానికి కొంత స‌మ‌యం ఇవ్వాలి. అప్ప‌టికీ ప‌రిస్థితులు మార‌క‌పోతే నేను మాట్లాడ‌డానికైనా, విమ‌ర్శించ‌డానికైనా, అవ‌స‌రం అయితే ప్ర‌జ‌ల త‌ర‌ఫున రోడ్డు మీద‌కి వ‌చ్చి  కొట్లాడ‌డానికి అయినా సిద్ధం. కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెట్టి వేధిస్తున్నార‌న్న విష‌యం నా దృష్టికి వ‌చ్చింది. కార్య‌క‌ర్త‌ల‌కు ఇబ్బందులు వ‌స్తే నాయ‌కులు ముందు మీరు నిల‌బ‌డండి. ముందుగా డిజిపికి, ప్ర‌భుత్వానికి, ప్ర‌జాప్ర‌తినిధుల‌కి చెబుదాం. వారు స‌రిచేయ‌క‌పోతే ఏ ఒక్క జ‌న‌సైనికుడికి గాయం అయినా నేను వ‌స్తాను.

టెంట్లు వేసుకుని అయినా పార్టీని న‌డుపుతాం:

నా మొద‌టి సినిమా ఫెయిల్ అవ‌గానే ఉద్యోగం చేసుకోమంటూ కొంద‌రు స‌ల‌హా ఇచ్చారు. అయితే ఓడిన చోటే వెతుక్కుంటూ వెళ్లా. ఇప్పుడు వైసీపీ భారీ విజ‌యం సాధించినా, జ‌న‌సేన పార్టీకి ఘోర ప‌రాజయం ఎదురైనా ఎక్క‌డికీ వెళ్ల‌ను, ఇక్క‌డే ఉంటా గెలిచే వ‌ర‌కు పోరాటం చేస్తా. ఎన్నిక‌ల్లో  ఓట‌మి అనంత‌రం కూడా చాలా మంది అడిగారు పార్టీని న‌డ‌ప‌గ‌ల‌రా అని. ఒక సినిమా తీస్తే పార్టీ సంవ‌త్స‌రం న‌డుస్తుంది. స్వ‌శ‌క్తితో ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాను. మా నాన్న‌గారు సిఎం కాదు ఇన్‌స్టెంట్‌గా నాకు అన్నీ వ‌చ్చేయ‌డానికి. అయినా ఇంత ఆఫీస్ నిర్మించాం అంటే అందంతా మా క‌ష్టం. పార్టీని న‌డ‌పడం కూడా చాలా క‌ష్టం. దానికి ఎన్నో మాట‌లు ప‌డాలి. దెబ్బ‌లు తినాలి. వాట‌న్నింటికీ నేను సిద్ధంగా ఉన్నా. దేశ వ్యాప్తంగా శ‌క్తివంత‌మైన పార్టీగా ఉన్న బీజేపీకే రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు వ‌చ్చింది.  అలాంటిది మ‌నం ఇంత వ‌ర‌కు వ‌చ్చాం అంటే అది చాలా గొప్ప విజ‌యం. ఆఫీస్ ఉంటుందా, పార్టీ న‌డుపుతారా.? అంటూ గేలి చేస్తున్నారు. మేం ఎవ‌రినీ డబ్బులేం అడ‌గ‌లేదే. అవ‌స‌రం అయితే టెంట్లు వేసుకుని పార్టీని న‌డుపుతాం. నేను వ‌చ్చింది ఒక ప‌టిష్ట‌మైన సామాజిక వ్య‌వ‌స్థ‌ని నిల‌బెట్ట‌డానికి.

నా ఒక్క‌డి గుర్తింపు కోస‌మే అయితే ఆ రోజు అన్న‌య్య‌గారితో పాటు వెళ్లిపోయే వాడిని. అస‌లు పార్టీని విలీనం చేయ‌నిచ్చే వాడినే కాదు. అప్ప‌ట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు బ‌ల‌మైన నాయ‌కుల మ‌ద్ద‌తు ల‌భించింది. కాంగ్రెస్ పార్టీ వైసీపీగా రూపు మార్చుకుంది. జ‌న‌సేన పార్టీకి మాత్రం పెద్ద పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేరు. చిన్న చిన్న వ్య‌క్తులు, నేనంటే ఇష్ట‌ప‌డి వ‌చ్చిన జ‌న‌సైనికులు మాత్ర‌మే నాతో ఉన్నారు. స‌మాజం మారాలి అన్న ల‌క్ష్యంతోనే పార్టీ స్థాపించా. రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతూ ఉంటే విభ‌జ‌న తాలూకు తీవ్ర‌త కాకినాడ‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. అప్పటి  ప‌రిణామాలు చూస్తే మాత్రం ఏ చిన్న త‌ప్పు జ‌రిగినా ర‌క్త‌పాతానికి కార‌ణ‌మ‌య్యే ప‌రిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విభ‌జ‌న అనే ఆ చారిత్ర‌క నిర్ణ‌యానికి  కాకినాడే వేదిక అయ్యింది అని అన్నారు.

స‌మావేశంలో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రారంభోప‌న్యాసం చేయ‌గా, ప్యాక్ స‌భ్యులు నాగ‌బాబు, కాకినాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి జ్యోతుల వెంక‌టేశ్వ‌ర‌రావు, కాకినాడ అర్బన్‌, రూర‌ల్ అభ్య‌ర్ధులు ముత్తా శ‌శిధ‌ర్‌, పంతం నానాజీ, పిఠాపురం అభ్య‌ర్ధి మాకినీడి శేషుకుమారి, పెద్దాపురం అభ్య‌ర్థి తుమ్మ‌ల రామ‌స్వామి, జ‌గ్గంపేట అభ్య‌ర్ధి పాటంశెట్టి సూర్య‌చంద్ర‌, ప‌త్తిపాడు అభ్య‌ర్ధి వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు త‌దిత‌రులు కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

More Press Releases