మిడతలు దాడి చేసే అవకాశం.. ఎటువంటి పరిస్ధితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ సీఎస్ ఆదేశం!

Related image

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిడతలు దాడి చేసే ప్రభావం ఉన్న 9 జిల్లాల కలెక్టర్లు ఎస్.పిలు, ఫైర్, వ్యవసాయ, అటవీ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎటువంటి పరిస్ధితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సి.యస్ అధికారులను ఆదేశించారు. సరిహద్దు జిల్లాలలో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం సూక్ష్మ స్ధాయి ప్రణాళికను తయారు చేయాలన్నారు. గ్రామాలలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, పరికరాలు, మెటీరియల్ కు సంబంధించి ఇన్ వెంటరీను తయారు చేయాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. గ్రామ స్ధాయిలో బృందాలను (టీమ్స్) ఏర్పాటు చేసి స్టేక్ హోల్డర్స్ ను భాగస్వామ్యులుగా చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫసర్ ను నియమించాలని సి.యస్ అధికారులకు సూచించారు.

జిల్లా స్ధాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు సరిహద్దు జిల్లాలతో సమన్వయంతో పనిచేసి మిడతల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, అవసరమైన స్ప్రేయర్లు, సేఫ్టీకిట్స్, మెటీరియల్, నీటివసతి, లైటింగ్ తదితర వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలలో అమలు చేయటం కోసం స్టాండింగ్ ఆపరేటరీ ప్రొసీజర్స్ తో అడ్వైజరీని తయారు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. మిడతల గమనం, నిరోధక చర్యలపై శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా అధికారులకు ప్రజేంటేషన్ ఇచ్చారు.

 ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, పిసిసిఏఫ్ శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి  జనార్ధన్ రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అగ్నిమాపక శాఖ డిజి సంజయ్ జైన్, జయశంకర్  వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉపకులపతి డా. ప్రవీణ్ రావు, ముఖ్య ఎంటమాలజిస్ట్ రెహమాన్, సస్య సంరక్షణ అధికారి సునీత, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

More Press Releases