ఏపీ వ్యాప్తంగా బీజేపీ – జనసేన నాయకులు, శ్రేణుల దీక్షలు!

Related image

  • ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్ష
చేయి చేయి కలుపుదాం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భూములు కాపాడుదాం అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన-భారతీయ జనతా పార్టీల శ్రేణులు నినదించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం నిర్ణయాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇరు పార్టీలు సంయుక్తంగా 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలు చేపట్టాయి. టి.టి.డి. భూముల అమ్మకం తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్షను కొనసాగిస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం స్పష్టం చేశారు.

బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో దీక్షలు సాగించారు. గుంటూరు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా శిబిరంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోయబోయిన శ్రీనివాస్ యాదవ్, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్(కె.కె.), లీగల్ విభాగం సభ్యులు గాదె వెంకటేశ్వరరావు, పాకనాటి రమాదేవిలు పాల్గొని సంఘీభావం తెలిపారు. బీజేపీ నేతలతో కలసి సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. స్వయం ప్రతిపత్తి కలిగిన టి.టి.డి.లో ప్రభుత్వ జోక్యం సరికాదని, దేవాలయ భూములు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు బీజేపీతో కలిసి రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

శ్రీవారి ఆస్తులకు కాపలాదారు మాత్రమే:

విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీజేపీ-జనసేన పార్టీలు సంయుక్త ఉపవాస దీక్ష చేపట్టాయి. జనసేన పార్టీ తరఫున అధికార ప్రతినిధులు పోతిన వెంకట మహేష్, అక్కల రామ్మోహన్ రావు, పార్టీ నేతలు అమ్మిశెట్టి వాసు, ఠాకూర్ అజయ్ వర్మ, ఆకుల కిరణ్ కుమార్, లకనం శ్యాంప్రసాద్, బొలిశెట్టి వంశీకృష్ణ,  వీరమహిళలు రావి సౌజన్య, బాడిత పద్మ తదితరులు పాల్గొనగా, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాతశెట్టి నాగేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి శివనాగేశ్వరరావు తదితరులు దీక్షకు దిగారు.

ప్రభుత్వం, టీటీడీ బోర్డు శ్రీవారి ఆస్తులకు కాపలాదారుగా మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. దేవాలయాల ఆస్తుల అమ్మకం శాశ్వతంగా నిలిపివేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రూ. 3 వేల కోట్ల ఆదాయం ఉన్న స్వామివారి ఆస్తులను నిరర్ధకం అంటూ అమ్మకానికి రూట్ మ్యాప్ రూపొందించడం వెనుక వ్యక్తిగత లబ్ది ఉందనీ, లడ్డూ ప్రసాదం విశిష్టతను తగ్గించేందుకు అంగట్లో వస్తువుగా మార్చారని ఆరోపించారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా జనసేన-బీజేపీల సంయక్త ఉపవాస దీక్షలు కొనసాగాయి. నందిగామ, మైలవరం, నూజివీడు, పామర్రు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గ కేంద్రాల్లో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు.

* తూర్పు గోదావరి జిల్లాలో...:

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి, పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్, పార్టీ నాయకులు, వీరమహిళలు, స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి ఉపవాస దీక్ష చేపట్టారు. కాకినాడ సురేశ్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, బీజేపీ నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్ లు ఇరు పార్టీల శ్రేణులతో కలసి దీక్షకు దిగారు. తిరుమల ఆస్తులపై కుట్ర జరుగుతుందని నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉపవాస దీక్షలు చేపట్టారు.

* ఉత్తరాంధ్రలో...:

విశాఖపట్నంలో బీజేపీ తరఫున ఎమ్మెల్సీ మాధవ్, మాజీ రాజ్యసభ సభ్యులు హరిబాబు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేతలు కాశీరాజు, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డిలు ఉపవాస దీక్షకు దిగగా,  జనసేన నుంచి పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, భీమిలి ఇంఛార్జ్ పంచకర్ల సందీప్, చోడవరం ఇంఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు, కృష్ణయ్య తదితరులు దీక్ష చేపట్టిన వారిలో ఉన్నారు. విశాఖ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన-బీజేపీల సంయుక్త దీక్షలు కొనసాగాయి. ఉత్తర నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, స్థానిక జనసేన-బీజేపీ నాయకులు మౌనదీక్షకు దిగారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పార్టీ నాయకులు దాసరి రాజు ఆధ్వర్యంలో జనసేన-బీజేపీలు సంయుక్త ఉపవాస దీక్షలు చేపట్టాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉత్తరాంధ్ర పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యులు పెడాడ రామ్మోహన్, బీజేపీ జిల్లా నాయకులు కలిసి దీక్షలు నిర్వహించారు.

* ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో:

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు, అద్దంకి, చీరాల, మార్కాపురం, దర్శితో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టి.టి.డి. భూముల విక్రయాన్ని నిరసిస్తూ జనసేన-బీజేపీ శ్రేణులు ఉపవాస దీక్ష చేపట్టాయి. నెల్లూరులో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి మనుక్రాంత్ రెడ్డి పర్యవేక్షణలో జనసేన-బీజేపీ శ్రేణులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టాయి. గనుకుల కిషోర్, అనుదీప్, శ్రీనివాసులు రెడ్డి, వీరమహిళలు సావిత్రి, కృష్ణవేణిలతో పాటు స్థానిక బీజేపీ నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఆత్మకూరు, కావలితో పాటు జిల్లా వ్యాప్తంగా ఇరు పార్టీలు సంయుక్త దీక్షలు నిర్వహించాయి.

* రాయలసీమలో...:

శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఇంఛార్జ్ సైకం జయచంద్రారెడ్డి నివాసంలో జనసేన-బీజేపీ సంయుక్తంగా ఉపవాస దీక్ష చేపట్టాయి. టి.టి.డి. భక్తులకు జవాబుదారీగా ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని, భూముల అమ్మకం ప్రక్రియను శాశ్వతంగా వెనక్కి తీసుకోవాలని ఇరు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తరఫున తిరుపతి నియోజకవర్గం ఇంఛార్జ్ కిరణ్ రాయల్, పార్టీ నాయకులు రాజారెడ్డి, సుభాషిణి, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ లక్ష్మీప్రియ తదితరులు దీక్షకు దిగారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంఛార్జ్ కోట వినూత, కోట చంద్రబాబు, మదనపల్లి నియోజకవర్గంలో పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యులు డాక్టర్ మైఫోర్స్ మహేష్, జిల్లా కేంద్రం చిత్తూరులో జనసేన నాయకులు దయారామ్, కవిత ఆరణి, లోకేష్, శరవణ, గంగాధర నెల్లూరులో పొన్న యుగంధర్, చంద్రగిరిలో కె.శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు సాగాయి.

టీటీడీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కడప జనసేన కార్యాలయం లో జనసేన-బీజేపీ శ్రేణులు ఉపవాస దీక్ష చేపట్టాయి. జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్, పార్టీ నాయకులు మాలే శివ, సురేష్ బాబు, పత్తి విశ్వనాథం, రంజిత్, బీజేపీ కడప ఇంఛార్జ్ కందుల శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పవన్ తదితరులు దీక్షకు దిగిన వారిలో ఉన్నారు. టి.టి.డి. బోర్డు నిర్ణయాన్ని శాశ్వతంగా విరమించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని నేతలు హెచ్చరించారు. రాజంపేట, మైదుకూరు, కమలాపురం, రాయచోటి, రైల్వే కోడూరు తదితర నియోజకవర్గాల్లోనూ ఇరు పార్టీలు నిరసన దీక్షలు నిర్వహించాయి.

టి.టి.డి. భూముల వేలం నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలు పట్టణంలో జనసేన-బీజేపీ శ్రేణులు నినదించాయి. జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యులు చింతా సురేష్, అర్షద్, బీజేపీ కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జ్ రామస్వామి, సీనియర్ నాయకులు కపిలీశ్వరయ్య తదితరులు పట్టణంలో దీక్ష చేపట్టారు. జనసేన ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంఛార్జ్ రేఖా గౌడ్, పార్టీ నాయకులు పసుపు పవన్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి  హరీష్ , సుబ్బారెడ్డిలు, మంత్రాలయం నియోజకవర్గంలో బీజేపీ ఇంఛార్జ్ పురుషోత్తమ్ రెడ్డి, జనసేన నాయకులు లక్ష్మన్న తదితర నాయకులు సంయుక్త దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గల్లోనూ ఇరు పార్టీల శ్రేణులు నిరసన తెలిపాయి.

అనంతపురం జిల్లా కేంద్రంలో టి.టి.డి. ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా జనసేన-బీజేపీల ఆధ్వర్యంలో ఇరు పార్టీల నేతలు ఉపవాస దీక్షలు చేపట్టారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి , స్థానిక జనసేన, బీజేపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. సేవ్ టి.టి.డి. అంటూ నేతలు నినదించారు. కదిరి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో సంయుక్త ఉపవాస దీక్ష జరిగింది. కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా జనసేన-బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఉపవాస దీక్షల్లో సేవ్ టి.టి.డి. నినాదంతో పాటు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

More Press Releases