రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో తెలంగాణ సీఎస్ ఎస్.కె జోషి సమీక్షా సమావేశం!

Related image

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు. గురువారం సచివాలయంలో తెలంగాణలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సింగరేణి సియండి శ్రీధర్, TSSPDCL CMD రఘుమారెడ్డి, అడిషనల్ పిసిసిఎఫ్ శోభలతో పాటు రైల్వే, ట్రాన్స్ కో, R&B అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి నారాయణపేట్, పెద్దపల్లి, మంచిర్యాల కలెక్టర్లతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ROB, RUB ల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. వీటి నిర్మాణాలు పూర్తయిన చోట లెవల్ క్రాసింగులు మూసివేయడానికి అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. భద్రాచలం, సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణంపైన సమీక్షించారు. మౌలాలి-ఘట్ కేసర్, తెల్లాపూర్- రాంచంద్రాపురం, సనత్ నగర్-మౌలాలి సెక్షన్ల నిర్మాణాల పురోగతిని రైల్వే అధికారులు వివరించారు.

ఖాజీ పేటలో పిఓహెచ్ వర్క్ షాపు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. అక్కన్నపేట- మెదక్, మనోహరాబాద్-కొత్తపల్లి రెల్వేలైన్ ల నిర్మాణాలతో సహా  వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రైల్వే అధికారులు కోరారు. ఖాజీపేట-విజయవాడ త్రిబులింగ్ కోసం అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సి.యస్ ఆదేశించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే GM మాట్లాడుతూ తెలంగాణలో చేపడుతున్న రైల్వే అభివృద్ద్ది పనులు వేగవంతం చేయడానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఇటువంటి సమావేశం ద్వారా సమస్యలు పరిష్కారమౌతాయని అన్నారు.

More Press Releases