గొర్రెకుంట మృతుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ఓదార్పు-భ‌రోసా!

Related image

  • మృతుల కుటుంబాల‌కు అండ‌గా తెలంగాణ స‌ర్కార్
  • గొర్రెకుంట మృతుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ఓదార్పు-భ‌రోసా
  • మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా అంతిమ సంస్కారాలు
  • ఎంజిఎంలో మృత దేహాల ప‌రిశీల‌న‌
  • స‌మ‌గ్ర విచార‌ణ‌కు అధికారుల‌కు ఆదేశాలు
  • విచార‌ణ అనంత‌రం నివేదిక‌ల‌ను బ‌ట్టి చ‌ర్య‌లు
  • గొర్రెకుంట ఘ‌ట‌న విషాద‌క‌రం-విచార‌క‌రం
  • మృతుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించి-సంతాపం తెలిపిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
వ‌రంగ‌ల్, మే 22ః వ‌రంగ‌ల్ న‌గ‌ర శివారు గొర్రెకుంట బావిలో ప‌డి మృతి చెందిన 9 మంది మృతి ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టామ‌ని, నిజానిజాలు తెలిశాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఈ లోగా మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్క‌డే అంతిమ క్రియ‌లు చేయ‌డం కానీ, కావాలంటే వారి వారి సొంతూళ్ళ‌కు వాళ్ళ‌ని పంపించడం కానీ చేస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గొర్రెకుంట మృతుల శ‌వాల‌ను మంత్రి వ‌రంగ‌ల్ లోని ఎంజిఎంలో సంద‌ర్శించి, ప‌రిశీలించారు. అనంత‌రం గొర్రెకుంట ఘ‌ట‌న‌ల‌కు గ‌ల కార‌ణాలేంట‌ని వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌ర్ హ‌రిత‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌వింద‌ర్ ల‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. మృతుల శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. త‌న ప్ర‌గాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి మీడియాతో మాట్లాడారు. గొర్రెకుంట ఓ పాత బావిలో నిన్న నాలుగు శ‌వాలు, ఈ రోజు ఐదు శ‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మృతుల‌లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన ప‌శ్చిమ‌బెంగాల్  వారు కాగా, ఇద్ద‌రు బీహార్ కార్మికులు, మ‌రో వ్య‌క్తి త్రిపుర‌కు చెందిన వ‌ల‌స కార్మికుడిగా గుర్తించారన్నారు. వీళ్ళంతా కేవ‌లం వ‌ల‌స కూలీలు మాత్ర‌మే కాదు. చాలా కాలంగా వాళ్ళు గొర్రెకుంట ప‌రిస‌రాల్లోనే ఉంటున్నారు. కొంద‌రి మృతికి కుటుంబ త‌గాదాలు కార‌ణంగా తెలుస్తున్న‌ది. మిగ‌తా వాళ్ళ చావుకి కార‌ణాలు తెలియ‌రాలేదు. పోస్టు మార్టం రిపోర్టు వ‌చ్చాక, పోలీసు విచార‌ణ‌లో పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. ఆ వివ‌రాలు వ‌చ్చాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈ లోగా ఆ కుటుంబాలు కోరుకున్న  విధంగా ప్ర‌భుత్వం సాయం చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌న్నారు. వారు ఇక్క‌డే అంతిమ క్రియ‌లు కావాల‌నుకుంటే ప్ర‌భుత్వ‌మే ఉచితంగా చేస్తుంది. లేదంటే, వారి గ్రామాల‌కు వాళ్ళ శ‌వాలను పంపించ‌డానికి ఏర్పాట్లు చేస్తాం. కొన్ని మృత దేహాల‌కు సంబంధించిన వారెవ‌రూ లేరు. అన్ని విధాలుగా వారిని ఆదుకోవాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వారి ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటాం. అని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

అయితే, జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు విచార‌క‌ర‌మ‌న్నారు. కూలీలు, వ‌ల‌స కూలీల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం ముందుంద‌న్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చి ఓదార్చారు.

ప్ర‌భుత్వం కూలీల‌కు, వ‌ల‌స కూలీల‌కు బాస‌ట‌గా నిలుస్తుంద‌ని మంత్రి తెలిపారు. క‌రోనా క‌ష్ట కాలంలో ఆదుకున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మంత్రి వెంట స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు. అధికారులు, పోలీసు అధికారులు, వైద్యులు ఉన్నారు. 

More Press Releases