జన సైనికులారా.. నడచి వెళ్లిపోతున్న వలస కూలీలకు భోజనం అందించండి: పవన్ కల్యాణ్

Related image

  • కరోనా సమయంలో బాధ్యతలు విస్మరించిన ప్రజా ప్రతినిధుల గురించి ప్రజలకు తెలియచెప్పండి
  • గల్ఫ్ దేశాల్లో చిక్కుపోయిన మనవారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదు
  • ఎర్ర చందనం తరలిపోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
  • రాష్ట్రంలోని పండ్ల తోటల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు
  • ఆర్థిక శక్తి లేకపోయినా తోటివారిని ఆదుకోవాలనే మంచి మనసు జనసైనికుల్లో ఉంది
  • జనసైనికులే పార్టీకి ఇంధనం
  • కడప జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ఉపాధి కోసం దేశం విడిచి గల్ఫ్ దేశాల్లో పనులు చేసుకొంటూ కరోనా మూలంగా అక్కడ చిక్కుకుపోయిన మనవారి బాధలు రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు పట్టడం లేదు... అక్కడ చిక్కుకుపోయినవారి  గురించి ఎందుకు కేంద్రంతో మాట్లాడటం లేదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కరోనా కష్ట సమయంలో అండగా నిలవాల్సిన ప్రజా ప్రతినిదులు బాధ్యతలు విస్మరిస్తున్న తీరును ప్రజలకు తెలియచేయాలని నాయకులకు సూచించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయినవారి బాధలను తప్పకుండా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. శనివారం ఉదయం కడప జిల్లా నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో పండ్ల తోటల రైతులు, పసుపు పంట వేసిన రైతులు ఎదుర్కొంటున్న బాధలను, జిల్లాలో యధేచ్చగా సాగుతున్న ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా గురించి నాయకులు తెలియచేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “భారీగా ధ్వంసం అవుతున్న అటవీ సంపదలో ముందున్నది ఎర్ర చందనమే అని నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎర్ర చందనం వృక్షాలను నరికి అక్రమ రవాణా పెరుగుతుందని అంచనా వేశారు. ఇప్పుడు జిల్లా నాయకులు అందిస్తున్న సమాచారం తెలుసుకొంటుంటే ఆ అంచనా నిజమే అనిపించింది. ఎర్ర చందనం అక్రమ రీతిలో తరలిపోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమాలపై కచ్చితంగా ప్రశ్నిస్తాం.

కరోనాతో ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో చాలా మంది ఉపాధికి దూరమవుతున్నారు. కరోనా అనేది ఒక దీర్ఘకాలిక సమస్య అని.. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపైపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకువచ్చారు. క్రమంగా పరిస్థితులు చక్కబడాలి. ఇలాంటి సమయంలో మనం ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. ఆ బాధ్యతను ప్రజా ప్రతినిధులు విస్మరిస్తే ఆ విషయాన్ని ప్రజలకు బలంగా తెలియచెప్పాలి. అందుకు మన మాటే మనకు మార్గం. మీడియాలోనే రావాలి అనుకోవద్దు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు... మీ పరిధిలో ఉన్న జనానికి మీ మాట ద్వారా కావచ్చు ఏం జరుగుతోందో చెప్పండి. మన మాటే మనకు బలం కావాలి.

రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఉద్యాన పంటలు వేసినవారు ఇబ్బందుల్లో ఉన్నారు. కడప జిల్లాలో అరటి, మామిడి, ఇతర పండ్లు, పసుపు, టమోటా రైతులు మార్కెట్ కు తరలించుకోలేక నష్టపోయారు. రైతు భరోసా విషయంలోనూ రైతులకు న్యాయం జరగడం లేదు అనే విషయం నా దృష్టికి చేరింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలుద్దాం.

జన సైనికులారా.. నడచి వెళ్లిపోతున్న వలస కూలీలకు భోజనం అందించండి:
ఆర్థికంగా బలం లేకపోయినా తోటివారు బాధల్లో ఉంటే స్పందించి ఆదుకొనే మంచి మనసు జన సైనికులకు ఉంది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి కష్టంలో ఉన్నవారికి జనసేన శ్రేణులు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఈ సేవల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ఆ జన సైనికులే పార్టీకి ఇంధనం. వారికి నా విజ్ఞప్తి... ఉపాధి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన వలస కూలీలు స్వస్థలాలకు నడుచుకొంటూ వెళ్లిపోతున్నారు. చాలా బాధలుపడుతున్నారు. అలాంటివారు మీ ప్రాంతం మీదుగా వెళ్లిపోతుంటే.. మీ శక్తి అనుకూలిస్తే భోజనం, మంచి నీళ్ళు అందించి ఆదుకోండి. వలస కూలీలకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నారు. అధికారులతో మాట్లాడి ఆ రైళ్లలో వారిని తరలించే ఏర్పాటు చేయండి” అన్నారు.

ఉద్యోగుల తొలగింపు… అధిక విద్యుత్ బిల్లులపై గొంతెత్తాలి: నాదెండ్ల మనోహర్

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కడప జిల్లాలో రైతాంగం తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. దినసరి కూలీలు ఉపాధికి దూరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని మన నాయకులు, కార్యకర్తలు ఆదుకొంటున్న తీరు మన పార్టీకి ఉన్న సామాజిక బాధ్యతను తెలియచేస్తోంది. జిల్లా నాయకులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై బలంగా మాట్లాడాలి. ఆర్టీసీలో వేలమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. అదే విధంగా విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయి. వీటిపై స్థానికంగా ఎక్కడికక్కడే నాయకులు గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి” అన్నారు.

పార్టీ పి.ఏ.సి. సభ్యులు డా.పి.హరిప్రసాద్ మాట్లాడుతూ “రైల్వే కోడూరు, బద్వేల్, రాజంపేట, రాయచోటి ప్రాంతాల నుంచి వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయారు. కరోనా వల్ల కొందరు వెనక్కి వచ్చేసినా వీసా సమస్యలు ఉన్నవారిని అక్కడి దేశాలవారు అదుపులోకి తీసుకున్నారు. అలా దుబాయిలో 3వేల మందికిపైగా ఈ జిల్లావారు ఇబ్బందులుపడుతున్నారు. అక్కడ గుడారాల్లో ఉంచారు. అక్కడి ఎండ వేడిమికి ప్రాణాలు కోల్పోయేలా ఉన్నామని వేదనకు లోనవుతున్నారు. ఇసుక, ఎర్ర చందనం  అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది” అన్నారు.

పార్టీ రాయలసీమ ప్రాంత నాయకుడు రాందాస్ చౌదరి మాట్లాడుతూ “కోయంబేడు నుంచి వచ్చిన వారితో కేసులు మళ్ళీ పెరిగాయి. ఇప్పటి వరకూ గ్రీన్ జోన్ గా ఉన్న మదనపల్లి, ఇతర పడమటి ప్రాంతాలు రెడ్ జోన్ గా మారాయి. ఇంత కష్ట కాలంలో కూడా జనసైనికులు మనస్ఫూర్తిగా సేవలు చేస్తున్నారు” అని చెప్పారు. రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముక్రమ్ చాంద్ బాషా మాట్లాడుతూ “కరోనా సమయంలో ప్రభుత్వపరంగా ప్రజలకు అందాల్సిన సహాయంలోనూ పార్టీల లెక్కలు తీయడం దారుణం.

రోజు కూలీలు, రైతులు అన్ని నష్టపోయినా సక్రమంగా సహాయం అందడం లేదు. ఇన్ని బాధల్లో ఉంటే విద్యుత్ బిల్లులను అధికంగా వేశారు. ఈ బిల్లులు కట్టాలంటే ప్రజలు అప్పులు చేయాల్సి వస్తుంది” అన్నారు. కడప అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ “జిల్లాలో పసుపు రైతులకు గిట్టుబాటు ధర అందటం లేదు. మార్కెట్ లో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. మద్యం దుకాణాలు తెరవడం, అక్కడ భౌతిక దూరం పాటించకపోవడంతో సమస్య తీవ్రం అవుతోంది” అన్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్ డా.బోనాసి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ “వైద్యులకు అవసరమైన పి.పి.ఈ. కిట్లు కూడా సమకూర్చలేదు.

అలాగే ఇంటింటికీ మాస్కులు కూడా పంపిణీ చేయలేదు. డాక్టర్లకు తగిన పి.పి.ఈ.లు ఇవ్వకపోతే ధైర్యంగా సేవలు అందించలేరు. మా నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదు. అధికార పార్టీ వాళ్ళకే నీళ్ళు ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది” అన్నారు. పార్టీ నాయకులు పందిటి మల్హోత్రా, మలిశెట్టి వెంకట రమణ, ఎస్.కె.హుస్సేన్ బాషా, తుపాకుల చంద్రశేఖర్ జిల్లా పరిస్థితిని వివరించారు.

More Press Releases