మైలార్ దేవరపల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుతపులి గురించి వివరాలు వెల్లడించిన తెలంగాణ అటవీశాఖ అధికారులు

మైలార్ దేవరపల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుతపులి గురించి వివరాలు వెల్లడించిన తెలంగాణ అటవీశాఖ అధికారులు
నిన్న మైలార్ దేవరపల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుతపులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు తెలంగాణ అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నిన్న మొదలైన ఆపరేషన్ ఈరోజు కూడా కొనసాగింది. శంషాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో జల్లెడ పట్టిన అధికారులు చిరుత జాడలను పాదముద్రల సహకారంతో గుర్తించారు. అది తిరిగిన ప్రాంతాల ఆధారంగా, నిన్నటి నుంచి గుర్తించే ప్రయత్నాలు చేశారు.

పోలీసు శాఖ సహకారం  తీసుకున్న అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శోదించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేశించారు. చివరకు చిరుత పాదముద్రలను ఫార్మ్ హౌస్ లో గుర్తించిన అటవీశాఖ అధికారులు పోలీసుల డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు. నిన్న రోజంతా అక్కడే ఉండి, గత రాత్రి  అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా, చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు.

వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన సీసీ కెమెరాల్లో చిరుతకు ఆహారంగా పనికి వచ్చే జంతువులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఆహారం కోసం అక్కడికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు దానిని బందించేందుకు అవసరమైన  బోనులను (Cage), సీసీ కెమెరాలను కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే ఒక ప్రత్యేక పర్యవేక్షణ టీమ్ ను, రెస్క్యూ గ్రూప్ ను ఉంచనున్నారు. మళ్లీ చిరుత నగరం వైపు రాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, చిలుకూరు అటవీ ప్రాంతంలో నిత్యం నిఘా పెడతామని, ప్రజలను అప్రమత్తం చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

 చిరుత ఆపరేషన్ లో సహకరించిన పోలీసు శాఖకు, సిబ్బందికి అటవీశాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వ్యవసాయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత జాడలు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు
Hyderabad
Leopard
Telangana

More Press News