అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: అధికారులకు మంత్రి తలసాని ఆదేశం

Related image

కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పశుసంవర్ద్ఖక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జీహెచ్ఎంసీ, హౌసింగ్, వాటర్ వర్క్స్, హెల్త్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో సనత్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, కోలన్ లక్ష్మి, ఆకుల రూప, ఉప్పల తరుణి, హేమలత, జోనల్ కమిషనర్ లు ప్రావిణ్య, శ్రీనివాస రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోట్లాది రూపాయల తో అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నందున చేపట్టిన రహదారులు, పైప్ లైన్ ల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని వివరించారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా  ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని నాలాలలో పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని, తొలగించిన పూడిక మట్టిని 24 గంటలలో తరలించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మ్యాన్ హోల్స్ ఓవర్ ప్లో కావడం, నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. నగరంలోనే అత్యధిక పార్క్ లు సనత్ నగర్ డివిజన్ లో ఉన్నాయని, ఆ పార్క్ ల నిర్వహణ సక్రమంగా లేదని, వెంటనే అన్ని పార్క్ లలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు రహదారుల మద్యలో ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఎలెక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అవసరమైన ప్రాంతాలలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. వేసవిలో కూడా నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేదని, కలుషిత నీరు సరఫరా అవుతున్నాయన్న పిర్యాదులు కూడా లేవని మంత్రి అన్నారు. ఇవన్ని నూతన పైప్ లైన్ ల నిర్మాణం, పైప్ లైన్ ల సామర్ధ్యం పెంపు వంటి చర్యలతోనే సాధ్యమైందని ఆయన వివరించారు.

పలు ప్రాంతాలలో పైప్ లైన్ ల నిర్మాణం పూర్తయినప్పటికీ రహదారుల నిర్మాణం చేపట్టకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. మంజూరైన పనులలో కొన్ని శంఖుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా నేటివరకు పనులు ప్రారంభించక పోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని పనులు సంవత్సరాల తరబడి పూర్తికాకుండా అలాగే ఉంటున్నాయని అన్నారు. పనులలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇక నుండి శంఖుస్థాపన జరిగిన 4 రోజులలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా చేసేందుకు సనత్ నగర్ ను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయడం జరిగిందని, ఇక్కడ విజయవంతమైతే నగరం మొత్తం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిదులు, ప్రజల నుండి వచ్చే సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రహదారులు, పుట్ పాత్ లను కొందరు ఆక్రమించారని, ఎంతటి వారైనా ఉపేక్షించ వద్దని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ లు ప్రావిణ్య, శ్రీనివాస రెడ్డి, వాటర్ వర్క్స్ gm లు రమణారెడ్డి, ప్రభు, హౌసింగ్ ee వెంకటదాసు రెడ్డి, amoh లు భార్గవ్, రవీందర్ గౌడ్, హార్టికల్చర్, టౌన్ ప్లానింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases