తెలంగాణ మంత్రి ఏపీని ఉదహరించే పరిస్థితి రావడం బాధాకరం: పవన్ కల్యాణ్

Related image

  • సాధారణ జ్వరం అని తేలిగ్గా మాట్లాడం వల్లే నివారణ చర్యల్లో అలసత్వం
  • పాలన విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలి
  • ఆరోగ్య శాఖ పటిష్టంగా లేని దుష్ఫలితం కరోనాతో బయటపడుతోంది
  • పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే తమ పరిస్థితి ఏపీలోని కర్నూలు, గుంటూరులా అయిపోయేదని తెలంగాణ మంత్రి అన్నారు
  • గ్రీన్, ఆరెంజ్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా చూడటమే అసలు సవాల్ 
  • ప్రజా సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా బలంగా మాట్లాడదాం
  • రైతాంగం సమస్యలపై ప్రభుత్వం కదిలేలా స్పందిద్దాం
  • అనంతపురం జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా వణికిపోతుంటే.. ఇది సాధారణ జ్వరమే అని మాట్లాడటం వల్లే నివారణ చర్యల్లో అలసత్వం నెలకొని ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఆరోగ్య విపత్తు నియంత్రణలో పాలన విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు మాట్లాడుతూ తాము పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ఏపీలోని కర్నూలు, గుంటూరుల్లా అయ్యేదని అన్నారు అంటే – ఏపీలో పరిస్థితి అర్థమవుతోంది అన్నారు.

ఏపీని ఉదహరించే పరిస్థితి రావడం బాధకారమే అని తెలిపారు. సోమవారం ఉదయం అనంతపురం జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ప్రభుత్వ చర్యలు, లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో తలెత్తే పరిస్థితులు, రైతాంగం, చేనేత వృత్తి వారి కష్టాలు, వలస కూలీల బాధలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “జాతీయ స్థాయి నాయకులతో కరోనా వ్యాప్తి తీరు, ఉద్ధృతి మరెంత కాలం ఉండవచ్చు, లాక్ డౌన్ సడలింపులపై చర్చించాను. లాక్ డౌన్ సడలింపు తరవాతే అసలు సవాల్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ జోన్ ప్రాంతాలు ఆరెంజ్, ఆరెంజ్ జోన్ ప్రాంతాలు రెడ్ పరిధిలో రాకుండా చూసుకోవడమే అసలు సవాల్. ఈ విషయంలో రాష్ట్ర పాలన యంత్రాంగం చాలా అప్రమత్తంగా, సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సాధారణ జ్వరం అనే విధంగా మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుంది. మన ఆరోగ్య శాఖ పటిష్టంగా లేకపోవడం వల్ల తలెత్తే దుష్ఫలితాలు కరోనాతో బయటపడుతున్నాయి. పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయంగా అయిపోయారు. కేరళ లాంటి రాష్ట్రాలు ముందు నుంచీ ప్రజారోగ్యం విషయంలో పకడ్బందీగా ఉండటంతో కరోనా విషయంలో సమర్థంగా వ్యవహరించగలిగాయి. మన రాష్ట్రంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినవారికి సరైన సదుపాయాలు లేవనీ, సక్రమంగా ఆహారం అందటం లేదనే విషయం తెలిసింది.

భవన నిర్మాణ కార్మికులు.. చేనేత వృత్తివారికి భరోసా ఇవ్వాలి:

ఆపదలో ఉన్నవారికి అండగా ఉండటం మన పార్టీ బాధ్యత. ఉపాధి వెతుక్కొంటూ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి చిక్కుకుపోయినవారి గురించి మన నాయకులు, కార్యకర్తలు తెలియచేయగానే ఎంతో బాధ్యతతో స్పందించాం. భారతీయ జనతా పార్టీతో ఉన్న పొత్తు మూలంగా ఆ పార్టీ జాతీయ నాయకులతో, సంబంధిత రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసుకున్నాం. ట్విటర్ ద్వారా తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు విజ్ఞాపనలు పంపగానే వారు సత్వరమే స్పందించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మన పార్టీ తరఫున సామాజిక మాధ్యమాల ద్వారా బలంగా మాట్లాడదాం. ఈ మాధ్యమంలో మన పార్టీ శ్రేణులు ఎంతో చురుగ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను చెబుతూ... మన బాధ్యతగా మన పార్టీ ఏం చేస్తుందో చెబుదాం.

అనంతపురం జిల్లాలో రైతాంగం కరవుతో నష్టపోయేవారు. ఈసారి వారిని కరోనా నష్టపరచింది. ఉద్యాన పంటలు వేసినవారు తీవ్ర ఇక్కట్లలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. కరవు ప్రభావిత జిల్లా అయిన అనంతపురానికి రావాల్సిన ప్రత్యేక నిధులు, ఇతర సాయాలపై, రైతులను ఆదుకొనే విధంగా చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా స్పందిద్దాం. అదే విధంగా చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాల బాధలు నా దృష్టికి చేరాయి. ఇసుక విధానంతో, ఇప్పుడు కరోనాతో ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులు. కార్మికులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. కరోనా మూలంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు జనసేన నాయకులు, శ్రేణులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం” అన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి సారించండి: నాదెండ్ల మనోహర్

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కరోనా మూలంగా ప్రధానంగా హిందూపురం ప్రాంతం భయాందోళనలో ఉంది. జిల్లాలో అత్యధిక కేసులు ఆ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. అదే విధంగా అనంతపురం పట్టణ ప్రాంతం కూడా అలాగే ఉంది. కరోనా మూలంగా జిల్లాలోని రైతులు తమ పంటలు అమ్ముకోలేకపోతున్న విషయం జిల్లా నాయకుల ద్వారా పార్టీ అధ్యక్షుల దృష్టికి వచ్చింది. చీనీ, అరటి, దానిమ్మ, మామిడి లాంటి ఉద్యానపంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ధరల స్థిరీకరణ నిధి అని, మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు అంటూ ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పింది. వాటిని అమలులో చూపించాలి. రైతాంగం ఎదుర్కొంటున్న ఇక్కట్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. కరోనా విపత్తు ఉన్న సమయంలో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ అక్రమాలపై పార్టీ నాయకులు దృష్టి సారించాలి.

కరోనా సమయంలో పార్టీ నాయకులు, శ్రేణులు చేస్తున్న సేవలు అభినందనీయంగా ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను, నిబంధనలను పాటించాలి. నాయకులు, కార్యకర్తలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మన అధ్యక్షుడు తరచూ చెబుతున్నారు. ఆ మాటను ప్రతి ఒక్కరూ పాటించాల”న్నారు.

జిల్లాలో పరిస్థితి గురించి పవన్ కల్యాణ్ కి నాయకులు వివరించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “హిందూపురం ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆ నియోకవర్గంలోని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. లాక్ డౌన్ మూలంగా పండ్ల తోటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ స్థాయి నష్టాలను జిల్లా రైతులు కరవు సమయంలోనూ చూడలేదు. ఒక ఎకరా దానిమ్మకు రూ.2 లక్షల పెట్టుబడి అవుతుంది. రైతు చేతికి రూ.5 వేలు కూడా వచ్చేలా లేదు. జిల్లా రైతాంగం కోలుకొనేందుకు ఎంత కాలం పడుతుందో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు” అన్నారు.

అనంతపురం నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ “ఉపాధి దూరమై రోజు కూలీలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీరిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవలు అందించిన వైద్య సిబ్బందికి పాజిటివ్ అని తేలింది” అని చెప్పారు. హిందూపురం పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేశ్ మాట్లాడుతూ “హిందూపురం పట్టణం, గ్రామీణ ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ప్రజలకు నిత్యావసరాలు అందడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరు. ఎమ్మెల్సీ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ ప్రాంతంలోని గార్మెంట్ యూనిట్స్ లో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు అందటం లేదు” అని తెలిపారు.

పార్టీ నేతలు భైరవ ప్రసాద్, సాకే పవన్ కుమార్, కదిరి శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, జయరాం రెడ్డి, పసుపులేటి పద్మావతి తదితరులు జిల్లా పరిస్థితిపై మాట్లాడారు.

More Press Releases