కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి: తెలంగాణ మంత్రి తలసాని డిమాండ్

Related image

కేంద్ర ప్రభుత్వం సడలింపుల ప్రకటన జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్ పేటలో కమాన్ నుండి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ వరకు 800 మీటర్ల మేర 1.20 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పనుల కోసం బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారి రాష్ట్రాలకు బస్సులలో వెళ్ళాలంటే 3 నుండి 5 రోజుల సమయం పడుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఉచితంగా వారి రాష్ట్రాలకు చేర్చే బాద్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సులలో తరలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం తగదన్నారు. రైళ్లలో వలస కూలీలను వారి రాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బస్సులలో కూలీల స్వగ్రామాలకు చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సౌకర్యార్ధం చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను నాణ్యతతో నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్డు, పుట్ పాత్ ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో రోడ్డు విస్తరణ చేపట్టాలని అన్నారు. రోడ్డు నిర్మాణంలో నష్టపోయే వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున భారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేయాలని చిక్కడపల్లి సీఐ ప్రభాకర్, గాంధీనగర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ లను ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మారావునగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డీఎంసీ ముకుందరెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణ మోహన్, ఈఈ శివకుమార్, డిప్యూటీ ఈఈ లోక్య, ఎలెక్ట్రికల్ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ రవీందర్ తదితరులు ఉన్నారు.

More Press Releases