అక్రమంగా నిల్వ చేసిన అటవీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న అధికారులు!

Related image

  • అక్రమంగా నిల్వ చేసిన నాటు సారా కూడా స్వాధీనం
  • నిజామాబాద్ జిల్లాలో పోలీసు, అటవీ, ఎక్సైజ్ శాఖల జాయింట్ ఆపరేషన్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కారేపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల జాయింట్ ఆపరేషన్ జరిగింది. పక్కా సమాచారం మేరకు ఉమ్మడి సోదాలు నిర్వహించిన పలు శాఖల సిబ్బంది, అధికారులు పెద్ద ఎత్తున నిల్వ చేసిన టేకు కలపతో పాటు అక్రమంగా నిల్వ చేసిన నాటు సారాను కూడా స్వాధీనం అధికారులు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన అటవీ సిబ్బందిని అడ్డుకుని స్థానికులు కొందరు దాడి చేశారు. వారిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని అటవీ ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్లాన్ తో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయన్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ హెరామత్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర పర్యవేక్షణలో ఉమ్మడి ఆపరేషన్ జరిగింది.

ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మూడు శాఖలకు చెందిన 100 మంది సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కారేపల్లి పరిధిలోని భూక్య తండా, హనుమాన్ తండా పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ద్వారా సోదాలు నిర్వహించిన సిబ్బంది నాలుగు ట్రాక్టర్లు టేకు దుంగలతో పాటు, ట్రాక్టర్లు, కార్పెంటర్ మెషిన్, ఐదు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై అధికారులు కేసు నమోదు చేశారు. అడవుల్లో చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.

More Press Releases