కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌లో జీహెచ్‌ఎంసీ మ‌హిళా సంఘాలు

Related image

  • 60వేల మాస్కులు కుడుతున్న యు.సి.డి మ‌హిళ‌లు

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 10:  ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్ర‌ణ‌కు ముందు జాగ్ర‌త్త‌లు పాటించ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధి సోకిన‌వారి నుండి ఇత‌రుల‌కు వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్నందున ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌కై బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అయితే న‌గ‌రాన్ని నిరంత‌రం ప‌రిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుతూ ప్ర‌తి ఇంటి నుండి చెత్త‌ను సేక‌రించి డంప్‌యార్డ్‌కు త‌ర‌లిస్తున్న శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల ర‌క్ష‌ణ‌కు జోన‌ల్ క‌మిష‌న‌ర్ల ద్వారా మాస్కుల‌ను అందించ‌డం జ‌రిగింది. అయితే వారికి ఉతికి రెగ్యుల‌ర్ గా ఉప‌యోగించుకునేందుకు అనువుగా క్లాత్ మాస్కుల‌ను అందించాల‌ని జిహెచ్‌ఎంసి నిర్ణ‌యించింది.

అందులో భాగంగా అర్భ‌న్ క‌మ్యునిటీ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో కుట్టు శిక్ష‌ణ పొందిన 200 మ‌హిళా సంఘాల‌కు మాస్కుల త‌యారీ బాధ్య‌త‌ను అప్ప‌గించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ముగ్గురు, న‌లుగురు మ‌హిళ‌లు బృందంగా ఏర్ప‌డి ఈ నెల 8వ తేదీ నుండి 20వేల మాస్కుల‌ను త‌యారుచేశారు. మ‌రో రెండు రోజుల్లో 60వేల మాస్కుల ల‌క్ష్యాన్ని సాధిస్తామ‌ని మ‌హిళ‌లు పేర్కొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌కు చేదోడువాదోడుగా నిలుస్తున్నందుకు మ‌హిళా సంఘాలు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తి మాస్కుకు రూ. 12/- చొప్పున మొత్తం 60వేల మాస్కుల‌కు రూ. 7ల‌క్ష‌ల 20 వేల‌ను జిహెచ్‌ఎంసి చెల్లించ‌నుంది. లాక్‌డౌన్ ఉన్నందున వ‌స్త్ర దుకాణ‌దారుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడి అవ‌స‌ర‌మైన క్లాత్ మెటీరియ‌ల్‌ను మ‌హిళా సంఘాల‌కు ఇప్పించ‌డం జ‌రిగింది.

ఈ మాస్కుల‌ను శానిటేష‌న్ విభాగంలో ప‌నిచేస్తున్న 20వేల మంది కార్మికుల‌తో పాటు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మొద‌టి సారిగా 2,500 స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్త‌ను త‌ర‌లిస్తున్న  మంది డ్రైవ‌ర్లు, స‌హాయ‌కుల‌కు రెండు మాస్కుల చొప్పున పంపిణీ చేస్తున్నారు. గ‌తంలో ఇచ్చిన మాస్కుల‌కు అద‌నంగా ఈ మాస్కుల‌ను జిహెచ్‌ఎంసి ఇస్తున్న‌ది.

More Press Releases