ముంబైలో చిక్కుకుపోయిన 500 వలస కూలీల కుటుంబాలను ఆదుకోండి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Related image

• ట్విటర్ ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి 

• తక్షణం స్పందించిన ఉద్దవ్ ఠాక్రే... సహాయం అందిస్తామని భరోసా 

కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి ఉపాధి కోసం వలస వెళ్ళిన 500 కుటుంబాలు ముంబై శివార్లలో చిక్కుకుపోయాయి. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ మూలంగా ఉపాధి లేక, ఆహారం, తాగు నీరు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. వీరి సమస్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి ట్విటర్ ద్వారా కర్నూలు జిల్లా వలస కూలీల అవస్థలను తెలియచేశారు. ముంబై శివార్లలోని గోమహళ్లి (వెస్ట్) ప్రాంతంలో వీరు ఉన్నారు. లాక్ డౌన్ వల్ల వారు ఎటూ వెళ్ళే పరిస్థితి లేదనీ.. తినేందుకు తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ ఉన్నవారిలో మహిళలు, నెలల పసికందులు ఉన్నారని... ఆ పసివాళ్ళకు ఒక గ్లాసు పాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. వారంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు... వారందరినీ సత్వరమే ఆదుకొని తగిన సహాయం అందించాలని కోరారు. ఈ లేఖలో ఆ కూలీల కుటుంబాలు ఉన్న ప్రాంతం జీపీఎస్ వివరాలు, అందుబాటులో ఉన్నవారి మొబైల్ నెంబర్ అందచేశారు. అలాగే ఆ కూలీల వేదనను తెలిపే వీడియోను కూడా ట్విటర్ ద్వారా పంపారు. 

వీరి సమస్యలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆకలితో ఉన్న ఆ కూలీలను యుద్ద ప్రాతిపదికన ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇచ్చి వారిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

• వెంటనే సహాయం చేస్తాం: ఉద్ధవ్ ఠాక్రే 

పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తక్షణం స్పందించారు. “పవన్ గారు...ఈ సంక్షోభ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవాళ్లందరికీ సహాయం చేయడం మన బాధ్యత. ఎవరూ ఆందోళనపడవద్దు. వారిని వెంటనే సంప్రదించి సహాయం చేస్తాం” అని ఠాక్రే బదులిచ్చారు.  ఇందుకు పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సత్వరమే స్పందించిన మీరు తప్పకుండా వారికి సహాయం చేస్తారనే ప్రగాఢ విశ్వాసం ఉంది అన్నారు.

More Press Releases