తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ

Related image

అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ సంక్షేమరాజ్యంగా తీర్చిదిద్దుతున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ అన్నారు. మాజీ ఎంపీ కవిత జన్మదినోత్సవంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మేల్యే మాగంటి గోపినాథ్ అధ్వర్యంలో వెంగళ్ రావునగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో వినూత్న పద్ధతుల్లో సంక్షేమ పథకాలను రూపొందించి విస్త్రృతస్థాయిలో అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అనేక చర్యలు తీసుకుంటుంటుండటంతో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. అలాగే, పేదింటి గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లోనే సురక్షితమైన ప్రసవాలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు తెలంగాణ సర్కారు కేసీఆర్ కిట్లు అందజేస్తుండటంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలుస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆడబిడ్డల పెళ్ళిళ్లకు కల్యాణ లక్ష్మీ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వెంగళ్ రావునగర్ డివిజన్ అధ్యక్షురాలు దీపిక, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases